తమ్ముళ్లు సరే.. అధికారులతోనూ బాబుకు చిక్కులేనా?
ఈ పరిస్థితిపై త్వరలోనే మరింత సీరియస్ యాక్షన్ తీసుకునేందుకు చంద్రబాబు సిద్ధమవుతున్నారు.
ఏపీలోని కూటమి ప్రభుత్వంలో టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, క్షేత్రస్థాయి నాయకులు కూడా దూకుడుగా ఉన్నారు. వద్దన్నా వినకుండా వివాదాస్పద విషయాల్లో వేళ్లు పెడుతున్నారు. ఈ పరిణామాలపై సీఎం చంద్రబాబు తరచుగా హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నారు.అయినా.. తమ్ముళ్లు మాత్రం మారడం లేదు. అంతేకాదు.. వారుచేయాల్సిన పనులు వారు చేసుకుంటున్నారు. ఈ పరిస్థితిపై త్వరలోనే మరింత సీరియస్ యాక్షన్ తీసుకునేందుకు చంద్రబాబు సిద్ధమవుతున్నారు.
అయితే.. ఇప్పుడు మరో సంకటం ఎదురైంది. కొందరు అధికారులు నేరుగా మీడియా ముందుకు వచ్చి రాజకీయ ప్రకటనలు చేస్తున్నారు. ఇది కూటమి సర్కారుకు ఇబ్బందిగా మారింది. ఉదాహరణకు వరద బాధితుల సాయం విషయంలో వచ్చిన విమర్శలపై స్పందించిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఆర్ పీ సిసోడియా.. కొవ్వొత్తులు-అగ్గిపెట్టెలకు 3 కోట్ల రూపాయలు ఖర్చయిందన్నారు. అదేసయమంలో జనరేటర్లను వినియోగించామని.. వీటికి 23 కోట్ల వరకు ఖర్చయిందన్నారు.
ప్రభుత్వం ఎక్కడా తినేయలేదని కూడా సిసోడియా అన్నారు. దీనికి కౌంటర్‌గావైసీపీ తీవ్ర విమర్శలు చేసింది. అసలు జనరేటర్లు ఎక్కడ పెట్టారో చూపించాలని నిలదీసింది. వాస్తవానికి వరద నీటిలో జనరే టర్లు పెట్టేందుకు అవకాశం లేదు. కానీ, సదరు అధికారి అత్యుత్సాహానికి పోయారు. ఇక, ఉచిత ఇసుక విధానంలో చోటు చేసుకుంటున్న వివాదాలను కొందరు అధికారులు దాచి పెడుతున్నారు. అంతా బాగా నే ఉందని ప్రభుత్వానికి నివేదికలు ఇస్తున్నారు.
కానీ, క్షేత్రస్థాయిలో ఉచిత ఇసుక విధానం అమలు తీరుపై ప్రజలు ఫైరవుతున్నారు. దీంతో వాస్తవాలు చెప్పాల్సిన అధికారులు ఎందుకు దాచి పెడుతున్నారనేది ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. అలానే.. దాడులు, ధ్వంసాలకు సంబంధించి.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలపైనా పోలీసులు వాస్తవా లను దాస్తున్నారన్నది సర్కారుకు అందిన సమాచారం. అనంతపురంలో రాములవారి రథాన్ని వైసీపీ నేతలు తగుల బెట్టారని.. టీడీపీ నేతలు ఆధారాలతో సహా వివరించారు.
కానీ, అసలు వైసీపీ ప్రమేయం లేదని కొందరు పోలీసులు తేల్చేశారు. దీంతో సర్కారుకు ఇబ్బందిగా మారింది. ఈ నేపథ్యంలో అధికారులను మీడియా ముందుకు రాకుండా నియంత్రించాలని సీఎంచంద్రబాబు తాజాగా తేల్చి చెప్పారు. ఎవరైనా మీడియా ముందుకు వస్తే.. సంబంధిత అజెండాను ముందుగానే ఉన్నతాధికారులకు ఇవ్వాలని కూడా సూచించారు. మరి ఏమేరకు అధికారుల నుంచి సెగ తగ్గుతుందో చూడాలి.