బీజేపీ వర్సెస్ కాంగ్రెస్.. పలువురు ఎంపీలకు గాయాలు.. అగ్రనేతపై కేసు నమోదు

పార్లమెంటు వద్ద గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. గురువారం ఉదయం ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి.

Update: 2024-12-19 08:28 GMT

పార్లమెంటు వద్ద గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. గురువారం ఉదయం ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ ఎంపీల మధ్య తోపులాట జరగడంతో పలువురు బీజేపీ ఎంపీలు గాయపడ్డారు. ఓ ఎంపీ తలకు గాయాలయ్యాయి. కాగా.. దీనిపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ స్పందించారు.

హోంమంత్రి అమిత్ షా.. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌పై నిన్న పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటూ క్షమాపణ చెప్పాలంటూ ప్రతిపక్షాలు నిరసనకు దిగారు. పార్లమెంట్‌లోని మకరద్వారం వద్ద ఉన్న గోడ ఎక్కి ఇండియా కూటమి ఎంపీలు ప్లకార్డులు చూపిస్తూ నిరసనకు దిగారు. అయితే అదే సమయంలో ఎన్డీయే కూటమి నేతలు సైతం అక్కడికి వచ్చారు. వారిని లోపలికి వెళ్లకుండా విపక్ష నేతలు అడ్డుకున్నట్లు వారు ఆరోపించారు. మరోవైపు.. కాంగ్రెస్ కూడా అంబేడ్కర్‌ను అవమానించిందంటూ ధర్నాకు దిగింది. అధికారపక్షంతోపాటు ప్రతిపక్షాలు పార్లమెంట్ వద్ద నిరసనకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే.. కొందరు నేతలు పార్లమెంటులోకి వెళ్లేందుకు ప్రయత్నించగా.. ఒకరినొకరు అడ్డుకున్నారు. దీంతో ఇక్కడే అసలు గొడవ ప్రారంభమైంది.

పార్లమెంట్ అవతల ప్రతిపక్షాలతోపాటు అధికార పార్టీ ఎంపీలు ఒకరిపై ఒకరు పరస్పర ఆరోపణలు చేసుకోవడం కనిపించింది. ఈ క్రమంలో ఎంపీలు పార్లమెంటులోకి వెళ్లేందుకు ప్రయత్నించగా.. పలువురు అడ్డుకున్నారు. ముఖ్యంగా కొందరు నేతలు ఒకరినొకరు నెట్టేసుకున్నారు. దీంతో ఒడిశాకు చెందిన బీజేపీ ఎంపీ ప్రతాప్ చంద్ర సారంగి మెట్ట పైనుంచి కింద పడిపోయారు. దీంతో ఆయన తలకు గాయాలయ్యాయి. రక్తం కారుతుండడంతో గమనించిన నేతలు ఆయనను ఓ చోట కూర్చోబెట్టారు. చికిత్స చేయించే ప్రయత్నం చేశారు. మరో ఎంపీ ముకేశ్ రాజ్‌పుత్‌కు సైతం గాయాలయ్యాయి. వీరిని హుటాహుటిని ఆసుపత్రికి తరలించారు.

బీజేపీ ఎంపీ ప్రతాప్ చంద్ర సారంగి ఈ సందర్భంగా స్పందిస్తూ.. తనను కావాలనే రాహుల్ గాంధీ కింద నెట్టేశారంటూ ఆరోపణలు చేశారు. తాను మెట్లపై నిల్చొని ఉండగా.. రాహుల్ గాంధీ ఓ ఎంపీని కిందకు నెట్టారని, ఆయన వచ్చి తనని తాకారని, దాంతో తాను కింద పడిపోయానని వెల్లడించారు. ఎంపీ గాయపడడంతో బీజేపీ నేతలు ఒక్కసారిగా కాంగ్రెస్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది సరైన పద్ధతి కాదంటూ హెచ్చరించారు. కాగా.. వీరి ఆరోగ్య స్థితిపై డాక్టర్లు స్పందించారు. ఇద్దరు ఎంపీల తలకు దెబ్బలు తగిలాయని, సారంగి తలకు లోతైన గాయం కావడంతో తీవ్ర రక్తస్రావం జరిగిందని చెప్పారు. తలకు కుట్లు వేశామని, ముకేశ్ రాజ్‌పుత్ స్పృహ కోల్పోయిన స్థితిలో వచ్చారని తెలిపారు. వైద్యం అందించాక ఆయన కోలుకున్నారని పేర్కొన్నారు. ప్రధాని మోడీ వీరిని ఫోన్‌లో పరామర్శించారు.

మరోవైపు.. బీజేపీ ఎంపీ ప్రతాప్ చంద్ర చేసిన ఆరోపణలపై రాహుల్ గాంధీ సైతం స్పందించారు. ఇక్కడ జరిగిన ఘటనను అంతా కెమెరాల్లో చూడొచ్చని.. తాను పార్లమెంట్ లోపలికి వచ్చే క్రమంలో బీజేపీ ఎంపీలు తనను అడ్డుకునే ప్రయత్నం చేశారని తెలిపారు. తోశేశారని, బెదిరించారని అన్నారు. మల్లికార్జున్ ఖర్గేను కూడా నెట్టేశారని, తమకు లోపలికి వెళ్లే హక్కు లేదా అని ప్రశ్నించారు. రాజ్యాంగంపై బీజేపీ దాడి చేస్తోందని, అంబేడ్కర్‌ను అవమానించారని అన్నారు.

కాంగ్రెస్ పార్టీ చీఫ్ ఖర్గే సైతం ఈ ఘటనపై స్పందించారు. ఈ వ్యవహారంపై స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. ఆందోళన సమయంలో బీజేపీ ఎంపీలు తనను నెట్టివేశారని, దాంతో తన మోకాలికి గాయమైందని పేర్కొన్నారు. తోపులాట ఘటనపై వెంటనే విచారణ చేపట్టాలని కోరారు. ఈ ఘర్షణ వాతావరణం నేపథ్యంలో పార్లమెంటు మధ్యాహ్నానికి వాయిదాపడింది.

ఇదిలా ఉండగా.. పార్లమెంట్ వద్ద తోపులాట ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై పోలీసులు కేసు నమోదు చేశారు. బీజేపీ ఎంపీలు అనురాగ్ సింగ్, బన్సూరి స్వరాజ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Tags:    

Similar News

ఇక ఈడీ వంతు