చిన్నమ్మ కోసం పెద్ద పదవి రెడీ చేసిన బీజేపీ ?
అదే టైంలో ఆమె సామాజిక వర్గానికి చెందిన టీడీపీ ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ కి కేంద్రంలో సహాయ మంత్రి పదవి దక్కింది.;
ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా ఉన్న దగ్గుబాటి పురంధేశ్వరి పదవీ కాలం ఈ ఏడాది జూలైలో ముగుస్తోంది. ఆమె రాజమండ్రి నుంచి ఎంపీగా గెలిచారు. కచ్చితంగా కేంద్రంలో కేబినెట్ ర్యాంక్ పదవి ఆమెకు రావాలి. కానీ అలా జరగలేదు. అదే టైంలో ఆమె సామాజిక వర్గానికి చెందిన టీడీపీ ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ కి కేంద్రంలో సహాయ మంత్రి పదవి దక్కింది.
అలాగే గోదావరి జిల్లాలకు చెందిన బీజేపీ ఎంపీ శ్రీనివాసవర్మకు మరో మంత్రి పదవి దక్కింది. దాంతో దగ్గుబాటి పురంధేశ్వరికి కేంద్ర మంత్రివర్గంలో చాన్స్ ఇవ్వలేకపోయారు. ఆమెకు స్పీకర్ పదవి ఇస్తారని అందుకే అలా చేశారని కూడా అప్పట్లో అనుకున్నారు.
కానీ ఆ పదవి కూడా మరోసారి ఓం బిర్లాకే ఇచ్చారు. దాంతో ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ పదవి తరువాత పురంధేశ్వరికి ఏమి దక్కనుంది అన్నది చర్చకు వస్తున్న విషయం. అయితే ప్రచారంలో ఉన్న దాని ప్రకారం చూస్తే ఆమెకు అతి పెద్ద పదవికే బీజేపీ పెద్దలు రిజర్వ్ చేసి ఉంచారని అంటున్నారు.
బీజేపీలో ఈ పదవి చేపడితే మాత్రం పురంధేశ్వరి ఒక రికార్డుని కూడా క్రియేట్ చేసిన వారు అవుతారు అని అంటున్నారు. బీజేపీ ఆవిర్భవించి ఈ ఏడాది ఏప్రిల్ 6 నాటికి అక్షరాలా 45 ఏళ్ళు అవుతోంది. బీజేపీకి ఈ మధ్య కలాంలో అంతా జాతీయ అధ్యక్షులుగా పురుషులే వ్యవహరించారు. అర్ధ శతాబ్దం చరిత్రకు సమీపంలో ఉన్న బీజేపీలో ఒక్క మహిళ కూడా అధ్యక్షురాలు కాలేకపోయారు.
దీంతో బీజేపీ ఈసారి జాతీయ అధ్యక్ష పదవిని మహిళలకు ఇవ్వాలని చూస్తోందిట. దాంతో చిన్నమ్మ పేరుని ప్రముఖంగా పరిశీలిస్తోంది అని అంటున్నారు. ఆమెకు కనుక ఇస్తే దక్షిణ భారత దేశంలో బీజేపీ మరింతగా వికసిస్తుందని అందునా రెండు తెలుగు రాష్ట్రాలలో కాషాయ పతాకం రివ్వున ఎగిరేందుకు వీలు ఉంటుందని భావిస్తున్నారని టాక్.
ఇక పురంధేశ్వరి లెజెండరీ పర్సనాలిటీ అయిన ఎన్టీఆర్ కుమార్తె కవడం బలమైన సామాజిక నేపథ్యం తో పాటు ఆమె రెండు దశాబ్దాలుగా రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకోవడంతో ఆమె ఈ పదవికి తగిన వారుగా భావిస్తున్నారుట.
ఇక ఆమె ఏపీ సీఎం చంద్రబాబుకు స్వయాన వదినగారు. ఎన్డీయేలో టీడీపీ కీలకంగా ఉంది. అలా ఈ బంధం మరింత గట్టి పడాలీ అంటే పురంధేశ్వరికి ఈ పదవి ఇవ్వడం మేలు అని అంటున్నారు. బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండగా మహిళా బిల్లుని ఆమోదించింది. ఆ విధంగా తాము మహిళా పక్షం అని చాటి చెప్పింది. వచ్చే ఎన్నికలలో మహిళా రిజర్వేషన్ ని అమలు చేయాలని చూస్తోంది.
ఈ క్రమంలో ముందుగా తమ పార్టీలో మహిళలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పుకోవడానికి అన్నట్లుగా శిఖరాయమానమైన పదవికే వారికి అప్పగించాలని చూస్తున్నారు అని అంటున్నారు. దాంతో పురంధేశ్వరికి ఈ పదవి దక్కితే మాత్రం తెలుగు నాట వెంకయ్యనాయుడు, బంగారు లక్ష్మణ్ తరువాత మరో తెలుగు వారికి ఈ అతి పెద్ద అవకాశం దక్కినట్లు అవుతుందని అంటున్నారు.
ఇక ఏపీ నుంచి చూసుకుంటే వెంకయ్యనాయుడు తరువాత ఈ కీలక పదవిని అధిరోహించిన రెండవవారుగా ఆమె ఉంటారని అంటున్నారు. మొత్తానికి చూస్తే ఎంతో మంది పేర్లను జాతీయ అధ్యక్ష పదవి కోసం చూస్తున్న బీజేపీ దగ్గుబాటి పురంధేశ్వరి దగ్గర ఆగి సీరియస్ గానే పరిశీలిస్తోంది అని అంటున్నారు. చూడాలి మరి ఈ సంచలన ప్రకటన ఎపుడు వెలువడుతుందో. ఈ వార్తలలో ఎంత వాస్తవం ఉందో.