వైసీపీ వలంటీర్లపై కర్ణాటక అసెంబ్లీలో చర్చ!

ప్రతి 50 ఇళ్లకు ఒకరిని చొప్పున నియమించి పెద్ద ఎత్తున నిధులను దుర్వినియోగం చేశారని కర్ణాటక బీజేపీ సభ్యుడు ఆ రాష్ట్ర అసెంబ్లీలో ప్రస్తావించారు.;

Update: 2025-03-11 20:02 GMT

కర్ణాటక అసెంబ్లీలో ఏపీకి సంబంధించిన ఓ అంశంపై పెద్ద చర్చ జరిగింది. ఏపీలో గత ప్రభుత్వం అమలు చేసిన వలంటీర్ల వ్యవస్థపై కర్ణాటక బీజేపీ సభ్యుడు అసెంబ్లీలో ప్రస్తావించారు. దీనిపై అధికార, విపక్షాల మధ్య పెద్ద సంవాదమే నడిచింది. కర్ణాటకలో వలంటీర్ వ్యవస్థ లేకపోయినా, కాంగ్రెస్ కార్యకర్తలకు మేలు చేసేలా వలంటీర్ల మాదిరిగా ప్రజాధనంతో జీతాలు చెల్లిస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే అశోక్ రెడ్డి విమర్శించారు. దీంతో సభలో ఏపీలోని వైసీపీ అమలు చేసిన వలంటీర్ల వ్యవస్థను ఉదహరించడంతో సభలో ఆసక్తికర చర్చ జరిగింది.

ఏపీలో గత ప్రభుత్వం వలంటీర్ వ్యవస్థను పెద్ద ఎత్తున అమలు చేసింది. దాదాపు రెండున్నర లక్షల మంది వలంటీర్లను నెలకు రూ.5 వేల వేతనం చొప్పున నియమించారు. ప్రతి 50 ఇళ్లకు ఒకరిని చొప్పున నియమించి పెద్ద ఎత్తున నిధులను దుర్వినియోగం చేశారని కర్ణాటక బీజేపీ సభ్యుడు ఆ రాష్ట్ర అసెంబ్లీలో ప్రస్తావించారు. పార్టీ కార్యకర్తలకు ప్రజాధనాన్ని దోచిపెట్టే ఈ కార్యక్రమాన్ని ప్రజలు తిరస్కరిస్తూ గత ఎన్నికల్లో తీర్పునిచ్చారని చెప్పారు. కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా జగన్ తరహాలో కాంగ్రెస్ కార్యకర్తలకు ప్రజాధనాన్ని దోచిపెడుతోందని బీజేపీ ఎమ్మెల్యే ఆరోపించారు. కర్ణాటకలో కాంగ్రెస్ కార్యకర్తలకు జీతాలు ఇవ్వడంపై బీజేపీ అభ్యంతరం చెప్పడంతో ఏపీ వలంటీర్ల వ్యవస్థ ప్రస్తావనకు వచ్చింది.

ఇప్పటికే పథకాలకు, గ్యారెంటీ హామీలకు నిధులు లేవని ప్రభుత్వం చేతులెత్తేస్తోందని, మరోవైపు కాంగ్రెస్ కార్యకర్తలకు డబ్బు దోచిపెడుతున్నారని బీజేపీ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. అయితే కర్ణాటక కాంగ్రెస్ సీనియర్ నేత, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మాత్రం ఈ విషయాన్ని కొట్టిపడేశారు. గ్రామస్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరించేందుకు, లబ్ధిదారులతో నేరుగా టచ్ లో ఉండేందుకు కాంగ్రెస్ కార్యకర్తల కోసం ఓ వ్యవస్థను తీసుకువచ్చామని చెప్పారు. అయితే ఆ వ్యవస్థకు వలంటీర్లు అని పేరు పెట్టకపోవడం గమనార్హం.

Tags:    

Similar News