కారులో ఆరుగురు ఇంజనీరింగ్ స్టూడెంట్స్.. యాక్సిడెంట్.. ఇద్దరు మృతి

కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు ఇంజినీరింగ్ విద్యార్థుల్లో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మిగతా నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.;

Update: 2025-03-11 20:09 GMT

ఇటీవల యువకులు వాహనాలను అతివేగంగా నడిపి ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు వరుసగా చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా మూడు పోలీస్ కమిషనరేట్ పరిధిలో రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయని పోలీసులు పేర్కొంటున్నారు. బైక్‌లు, కార్లలో అధిక వేగంతో ప్రయాణించడం వల్ల ప్రమాదాలను అదుపు చేయలేక యువత తమ ప్రాణాలను పోగొడుకుంటున్నారు.

తాజాగా, తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఘోర ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు మరణించారు. హైదరాబాద్‌లోని నార్సింగ్ ప్రాంతంలో మూవీ టవర్ సమీపంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు ఇంజినీరింగ్ విద్యార్థుల్లో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మిగతా నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతులు MGIT కాలేజీలో బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థులుగా గుర్తించారు.

పోలీసుల వివరాల ప్రకారం, గండిపేట నుంచి కాలేజీకి వెళ్తుండగా కారు అదుపుతప్పి స్తంభాన్ని ఢీకొట్టింది. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు, గాయపడిన వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకెళ్లారు. మృతి చెందిన విద్యార్థుల కుటుంబాల్లో విషాదం నెలకొంది.

పోలీసులు మరోసారి హెచ్చరిస్తూ, యువత వాహనాలను అతి వేగంగా నడపడం ప్రమాదకరమని, రోడ్డుప్రమాదాలను తగ్గించేందుకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటించాలని సూచిస్తున్నారు.

Tags:    

Similar News