పాకిస్తాన్ లో ఏకంగా రైలు హైజాక్.. బందీగా 100 మంది
ఈ సంఘటన క్వెట్టా నుంచి ఖైబర్ పఖ్తున్‌ఖ్వాలోని పెషావర్ వెళ్తున్న జాఫర్ ఎక్స్‌ప్రెస్‌పై చోటుచేసుకుంది.;
పాకిస్థాన్‌లో రైలు హైజాక్‌కు గురైన సంఘటన తీవ్ర కలకలం రేపుతోంది. బలోచిస్థాన్ ప్రావిన్స్‌లో వేర్పాటువాదులు ఒక ప్రయాణికుల రైలుపై దాడి చేసి, వందల మందిని బందీలుగా తీసుకున్నట్లు ప్రకటించారు. ఈ సంఘటన క్వెట్టా నుంచి ఖైబర్ పఖ్తున్‌ఖ్వాలోని పెషావర్ వెళ్తున్న జాఫర్ ఎక్స్‌ప్రెస్‌పై చోటుచేసుకుంది.
- భయానక దాడి
బలోచిస్థాన్ ప్రభుత్వ ప్రతినిధి షాహిద్ రిండ్ వెల్లడించిన వివరాల ప్రకారం.. బలోచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) మిలిటెంట్లు రైలుపై భారీస్థాయిలో కాల్పులు జరిపారు. తమ దాడిని ముందుగానే ప్లాన్ చేసిన మిలిటెంట్లు, రైల్వే ట్రాక్‌ను పేల్చివేయడంతో జాఫర్ ఎక్స్‌ప్రెస్ నిలిచిపోయింది. దాంతో వారు రైలును తమ నియంత్రణలోకి తీసుకుని ప్రయాణికులందరినీ బందీలుగా మార్చారు. ఈ దాడిలో ఆరుగురు మిలిటరీ సిబ్బంది మరణించారని BLA ప్రకటించింది.
- భద్రతా చర్యలు, ప్రభుత్వ స్పందన
పాక్ భద్రతా బలగాలు ఘటనాస్థలికి చేరుకుని బందీలను రక్షించేందుకు చర్యలు తీసుకుంటున్నాయి. అయితే, తమపై ఏదైనా మిలిటరీ ఆపరేషన్ జరిపితే, బందీలను హతమార్చుతామని మిలిటెంట్లు హెచ్చరించారు. ఈ దాడిలో రైలు డ్రైవర్ గాయపడినట్లు సమాచారం.
-బలోచిస్థాన్‌లో ఆందోళనలు, వరుస దాడులు
బలోచిస్థాన్ వేర్పాటువాదులు గత కొన్ని సంవత్సరాలుగా పాకిస్థాన్‌లో అనేక దాడులకు పాల్పడుతున్నారు. పోలీస్ స్టేషన్లు, రైల్వే లైన్లు, వాహనాలను లక్ష్యంగా చేసుకుని వరుసగా దాడులు చేస్తున్నారు. ప్రధాన హైవేలను అడ్డుకొని, బస్సులలోని ప్రయాణికులను దింపి వారి గుర్తింపు కార్డులను పరిశీలించి కాల్చివేసిన ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి.
BLA 2000 సంవత్సరం నుండి పాక్ సైన్యంపై దాడులు చేస్తూ వస్తోంది. అమెరికా, యూకే సహా పాకిస్థాన్ కూడా ఈ గ్రూపును ఉగ్రవాద సంస్థగా గుర్తించింది.
-చైనా-పాకిస్థాన్ ఆర్థిక నడవా (CPEC).. ప్రధాన కారణం
బలోచిస్థాన్ ప్రాంతం పాకిస్థాన్ నైరుతి భాగంలో ఉండి, ఇరాన్, అఫ్గానిస్థాన్ సరిహద్దులకు సమీపంగా ఉంది. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చైనా-పాకిస్థాన్ ఆర్థిక నడవా (CPEC) ఈ ప్రాంతం ద్వారా వెళ్తోంది. పాక్ ప్రభుత్వం దీన్ని దేశ ఆర్థిక వృద్ధికి ప్రధానమైన ప్రాజెక్టుగా చూస్తున్నప్పటికీ, స్థానికులు దీన్ని తమ వనరుల దోపిడీగా అభివర్ణిస్తున్నారు.
CPEC ప్రాజెక్టులకు వ్యతిరేకంగా బలోచ్ మిలిటెంట్లు వరుస దాడులకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా చైనా సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని దాడులు పెరుగుతున్నాయి. పాకిస్థాన్ ప్రభుత్వం ఉక్కుపాదంతో అణచివేయాలని చూస్తుండటంతో పరిస్థితులు మరింత సంకీర్ణంగా మారుతున్నాయి.
- మానవహక్కుల ఉల్లంఘనలు
ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ నివేదిక ప్రకారం, 2011 నుండి దాదాపు 10,000 మంది బలోచ్ ప్రజలు అదృశ్యమయ్యారు. ప్రభుత్వం వారిని గుట్టుగా నిర్బంధిస్తోందని ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో బలోచిస్థాన్‌లో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారనుంది.