పాలనలో పట్టు కోసం.. 'బీసీ' వ్యాక్సిన్!

తాజాగా తెలంగాణలో చేపట్టిన కులగణనలో 50 శాతం కంటే ఎక్కువగా బీసీలు ఉండటంతో ఆ రాష్ట్రంలో బీసీల ఐక్యతకు కొందరు ఉద్యమించే సూచనలు కనిపిస్తున్నాయి.;

Update: 2025-03-11 22:30 GMT

కోవిడ్ వ్యాక్సిన్ వినే ఉంటారు. మరి ఈ బీసీ వ్యాక్సిన్ ఏంటి అనుకుంటున్నారా? నిజమే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో బీసీ వ్యాక్సిన్ కి మంచి ఆదరణ లభిస్తోంటి. టు తెగులు స్టేట్స్ లో జరిగిన ఎన్నికల్లో పార్టీలు బీసీలకు పెద్ద పీట వేయడం ద్వారా తమ భవిష్యత్తు వ్యూహాన్ని చాటిచెప్పాయి. క్రమంగా బీసీ జనాభా పెరుగుతుండటం, బీసీ హక్కుల కోసం ఉద్యమానికి కొందరు రంగం సిద్ధం చేస్తుండటంతో పార్టీలు బీసీ కార్డును సొంతం చేసుకోడానికి చురుగ్గా పావులు కదుపుతున్నాయంటున్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు రాష్ట్రాల్లోని ప్రధాన పార్టీలు బీసీలకే ఎక్కువ పదవులు కట్టబెట్టడం చర్చనీయాంశమవుతోంది.

ఏపీలో ఐదు ఖాళీలకు టీడీపీ రెండు స్థానాలను బీసీలకు కేటాయించగా, తెలంగాణ అధికార కాంగ్రెస్ ఒకటి, బీఆర్ఎస్ మరొక స్థానం చొప్పున బీసీ నేతలకు ఎంపిక చేశాయి. మొత్తంగా రెండు రాష్ట్రాల్లో నలుగురు బీసీలు, ముగ్గురు ఎస్సీలు, ఒక ఎస్టీ, ఇద్దరు ఓసీ నేతలకు ఎమ్మెల్సీ చాన్స్ లభించింది. తెలంగాణలో ఒక్క ఓసీ నేతకూ ఎమ్మెల్సీ స్థానం ఇవ్వకపోవడం విశేషంగా చెబుతున్నారు. దీనికి ప్రధాన కారణం ఆ రాష్ట్రంలో బీసీ ఉద్యమానికి రంగం సిద్ధమవడమే అంటున్నారు. ఇక ఏపీలోనూ అధికార టీడీపీ ఒక్క అగ్రవర్ణ నేతకు ఎమ్మెల్సీ అవకాశం ఇవ్వలేదు. టీడీపీ అంటే బీసీ పక్షపాతి అంటూ మరోమారు నిరూపించుకున్నామని ఆ పార్టీ చెప్పుకుంటోంది.

అయితే ప్రధానంగా బీసీ నేతలకు ఎక్కువ అవకాశం ఇవ్వడం ఈ సారి ఎక్కువ చర్చకు దారితీస్తోంది. దీనికి అనేక కారణాలు ఉన్నాయంటున్నారు. ప్రధానంగా రాజకీయంగా బీసీలు పట్టుసాధించే అవకాశం ఉండటంతో బీసీలను ప్రోత్సహించాలని పార్టీలు నిర్ణయించుకున్నాయంటున్నారు.

తాజాగా తెలంగాణలో చేపట్టిన కులగణనలో 50 శాతం కంటే ఎక్కువగా బీసీలు ఉండటంతో ఆ రాష్ట్రంలో బీసీల ఐక్యతకు కొందరు ఉద్యమించే సూచనలు కనిపిస్తున్నాయి. దీన్ని ముందుగా పసిగట్టిన కాంగ్రెస్, బీఆర్ఎస్ బీసీ కార్డును ఉపయోగించుకునేందుకు బీసీలకే ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చింది. కాంగ్రెస్ లో రెడ్డి, వెలమ సామాజిక వర్గంతోపాటు ముస్లిం మైనార్టీలు ఎందరో ఎమ్మెల్సీ స్థానం కోసం ఒత్తిడి చేసినా, చివరికి బీసీ మహిళ కోటాలో విజయశాంతికి అవకాశం ఇచ్చారు. అదేవిధంగా బీఆర్ఎస్ కూడా ఓసీ నేతలను కాదని బీసీ సామాజికవర్గానికి చెందిన శ్రవణ్ కుమార్ కు అవకాశం ఇచ్చింది.

ఇక ఏపీలో టీడీపీ తొలి నుంచి బీసీలకు పెద్దపీట వేస్తున్నట్లు చెప్పుకుంటుంది. ప్రస్తుతం కూడా ఐదు ఖాళీలకు మిత్రపక్షాలకు రెండు వదిలేసి మిగిలిన మూడింట్లో రెండింటిని బీసీ నేతలకు కేటాయించింది. దీనిద్వారా తమ పార్టీ వారసత్వం కొనసాగిస్తున్నట్లు ప్రచారం చేసుకుంటోంది. అంతేకాకుండా ఈ ఏడాది బడ్జెట్ లోనూ బీసీలకు ప్రాధాన్యమిచ్చామని చెబుతోంది. బలహీన వర్గాల ఇళ్ల నిర్మాణం, ఆదరణ పథకం ఇలా బీసీ సంక్షేమానికి ప్రత్యేకంగా నిధులు, కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెబుతోంది. మొత్తానికి రెండు రాష్ట్రాలు బీసీ జపం చేస్తుండటం విశేషంగా చెబుతున్నారు.

Tags:    

Similar News