వైసీపీలోకి కాంగ్రెస్ మాజీ ఎంపీ...కండిషన్స్ అప్లై ?
అయితే హర్షకుమార్ కూడా వైసీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని ప్రచారం సాగుతోంది. ఆయన వైసీపీని వెనకేసుకుని రావడం అందుకోసమే అంటున్నారు.;
వైసీపీలోకి ఒక మాజీ కాంగ్రెస్ ఎంపీ రావాలనుకుంటున్నారా. ఆయనకు ఫ్యాన్ పార్టీ మీద మమకారం పెరిగిందా అంటే ఏమో అన్న మాట అయితే వినిపిస్తోంది. ఇంతకీ ఆయన ఎవరో కాదు 2004, 2009లో వరుసగా అమలాపురం నుంచి రెండు సార్లు కాంగ్రెస్ నుంచి గెలిచిన జీవీ హర్షకుమార్. ఆయన కాంగ్రెస్ లో ఫైర్ బ్రాండ్ ఎంపీగా ఉంటూ వచ్చారు. ఒక విధంగా చెప్పాలీ అంటే వైఎస్సార్ వ్యతిరేక శిబిరంలో ఉండేవారు అంటారు. ఆయనకు తెలంగాణా కాంగ్రెస్ సీనియర్ వీ హనుమంతరావుతో మంచి రిలేషన్స్ ఉన్నాయి. అలా వైఎస్ యాంటీ బ్యాచ్ గానే గుర్తింపు పొందారు.
ఉమ్మడి ఏపీ రెండుగా చీలిన తరువాత ఏపీలో కాంగ్రెస్ పార్టీ చతికిలపడిన నేపథ్యంలో కూడా హర్షకుమార్ కూడా రాజకీయ నిర్ణయం తీసుకున్నారు. ఆయన టీడీపీలోకి వెళ్ళారు తప్ప వైసీపీ వైపు చూడలేదు. ఆ తర్వాత ఆయన టీడీపీ నుంచి బయటకు వచ్చినా కూడా వైసీపీ ఊసు తలవలేదు. అటువంటిది ఇపుడు హర్షకుమార్ వైసీపీ వైపు వస్తారని ఒక్కటే ప్రచారం మోతగా సాగుతోంది.
హర్షకుమార్ కూడా దీనికి తగినట్లుగా వైసీపీ అనుకూల వాదం వినిపిస్తున్నారు. ఆయన ఇటీవల సోషల్ మీడియా వేదికగా విడుదల చేస్తున వీడియో బైట్స్ లో వైసీపీని వెనకేసుకుని వస్తున్నట్లే కనిపిస్తోంది. కూటమి నేతలు ఎంతసేపూ వైసీపీని విమర్శించడమేంటని ఆయన కస్సుమంటున్నారు. మీకంటే వారు బాగానే సంక్షేమ పధకాలు ఇచ్చారు కదా సాకులు చెప్పలేదు కదా అని మాట్లాడుతున్నారు.
పాలన చేయండని ఎంతసేపూ గత ప్రభుత్వం అని విరుచుకుపడకండి అని ఆయన హితవు పలికారు. ఇక ఇటీవలే పీసీసీ మాజీ చీఫ్ సాకే శైలజానాధ్ వైసీపీలో చేరాక మాజీ కాంగ్రెస్ నేతలు చాలా మంది వైసీపీ వైపు వస్తారని ప్రచారం సాగింది. అందులో భాగంగా ఎక్కువగా హర్షకుమార్ పేరు వినిపిస్తోంది.
అయితే హర్షకుమార్ కూడా వైసీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని ప్రచారం సాగుతోంది. ఆయన వైసీపీని వెనకేసుకుని రావడం అందుకోసమే అంటున్నారు. దళిత వర్గాల్లో మంచి పేరున్న నోరున్న నేతగా హర్షకుమార్ కి గుర్తింపు ఉంది. ఆయన కనుక వైసీపీలో చేరితే ఆ పార్టీకి బలమైన గొంతుకగా ఉంటారు. అంతే కాదు ఏపీలో కూటమి ప్రభుత్వాన్ని తెగనాడడానికి ఆయన సరైన ఆయుధంగా మారుతారు అని అంటున్నారు.
అయితే హర్షకుమార్ వైసీపీలో చేరడానికి సుముఖమే కానీ అదంతా తన కుమారుడి కోసమే అని అంటున్నారు. తన కుమారుడికి 2029 ఎన్నికల్లో అమలాపురం ఎంపీ టికెట్ ఇస్తే కనుక తాను తన కుమారుడూ వైసీపీ కండువా కప్పుకోవడానికి రెడీ అని ఆయన ఒక సందేశం పంపించారు అని అంటున్నారు.
తన రాజకీయ వారసుడిని చట్టసభలలో చూసుకోవాలని హర్షకుమార్ బలంగా కోరుకుంటున్నారు. ఇటీవల జరిగిన గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన కుమారుడుని పోటీకి పెట్టారు కూడా. దాంతో వైసీపీ నాయకత్వం ఇపుడు ఆలోచనలో పడింది అని అంటున్నారు. హర్షకుమార్ అయితే బలమైన నేతగా ఉంటారని ఆశిస్తోంది. మరి ఆయన కుమారుడికి టికెట్ అంటే వైసీపీ పెద్దలు ఆలోచిస్తారని అంటున్నారు. ఏది ఏమైనా గోదావరి జిల్లాలలో వైసీపీ సామాజిక బలం తగ్గిపోతోంది. అక్కడ రాజకీయంగా సామాజికపరంగా టీడీపీ జనసేన పైచేయి సాధించి ఉన్నాయి.
అంతమాత్రం చేత గ్రౌండ్ ఖాళీగా లేకపోలేదు. ఆ బలమైన సామాజిక వర్గానికి ప్రతిగా ఉన్న మిగిలిన వర్గాలను కలుపుకుంటే వైసీపీ రాజకీయం సాఫీగా సాగవచ్చు. దాని కోసం హర్షకుమార్ లాంటి నేతల అవసరం ఎంతో ఉంది. సో ఆ విధంగా చూస్తే కనుక హర్షకుమార్ చేరికను ఆ పార్టీ స్వాగతిస్తుంది అని అంటున్నారు. ఆయనను పార్టీలో కీలక బాధ్యతలు అప్ప్గించి ముందున పెట్టవచ్చు అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరగనుందో.