తెలుగు పాలిటిక్స్ 2024 : రామ్మోహన్ ని విమానమెక్కించిన ఇయర్
ఉత్తరాంధ్ర జిల్లాలలో ఎందరో రాజకీయ దిగ్గజాలు కనిపిస్తారు. వర్తమానంలో చూసుకుంటే దివంగత ఎర్రన్నాయుడు తనదైన ముద్ర వెశారు.
ఉత్తరాంధ్ర జిల్లాలలో ఎందరో రాజకీయ దిగ్గజాలు కనిపిస్తారు. వర్తమానంలో చూసుకుంటే దివంగత ఎర్రన్నాయుడు తనదైన ముద్ర వెశారు. ఆయన 1996 నుంచి 2009 దాకా పదమూడేళ్ళ పాటు లోక్ సభకు శ్రీకాకుళం నుంచి ప్రాతినిధ్యం వహించడమే కాక కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా, రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ గా తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా కీలకమైన బాధ్యతలు నిర్వహించారు.
ఆయన మరణంతో ఆ స్థాయి నేత ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి లేరు అన్న లోటు అయితే ఉంది. దానిని భర్తీ చేసే విధంగా ఆయన కుమారుడు ఉన్నత విద్యావంతుడు కింజరాపు రామ్మోహన్ నాయుడు 2014 ఎన్నికలతో అరంగేట్రం చేశారు. కేవలం 27 ఏళ్ళ వయసులో ఆయన ఎంపీ అయ్యారు. అత్యంత పిన్న వయసులో ఆయన పార్లమెంట్ లో పెద్దల మన్నన అందుకున్నారు. ముఖ్యంగా 2018లో టీడీపీ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం మీద ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంలో రామ్మోహన్ మాట్లాడిన తీరు బీజేపీ పెద్దలకే ఆశ్చర్యం వేసేలా సాగింది.
ఇక 2019లో టీడీపీ నుంచి గెలిచిన ముగ్గురు ఎంపీలలో ఆయన ఒకరుగా నిలిచారు అయిదేళ్ల పాటు ఆయన ఏపీ నుంచి ప్రజా సమస్యలను ప్రస్తావిస్తూ తన సత్తా చాటారు. 2024లో బీజేపీతో పొత్తు కుదరడంతో రామ్మోహన్ ని కేంద్ర కేబినెట్ లో బెర్త్ దక్కింది. కేవలం 37 ఏళ్ళ వయసులో ఆయన కేబినెట్ మంత్రి అయిపోయారు. అత్యంత కీలకమైన పౌర విమాన యాన శాఖల మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
ఒక యువ నేతగా ఎగిసిపడే కెరటంగా రామ్మోహన్ జాతీయ రాజకీయాల్లో తన ప్రతిభను చాటుకుంటున్నారు. ఉత్తరాంధ్రాలో బీసీ వర్గాల నుంచి వచ్చిన సమర్ధ నాయకుడిగా కూడా సత్తా చాటుతున్నారు. తెలుగుదేశం పార్టీ అందించిన భవిష్యత్తు తరం నేతగా కూడా ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు.
వరసగా మూడు సార్లు గెలిచి హ్యాట్రిక్ విజేత అయిన రామ్మోహన్ తన తండ్రి రికార్డుకు ఒక అడుగు దూరంలో ఉన్నారు. ఎర్రన్నాయుడు వరసగా నాలుగు సార్లు అదే సీటు నుంచి గెలిచారు. ఇక ఎర్రన్నాయుడు కేంద్ర మంత్రి అయ్యేనాటికి వయసు 39 కాగా రామ్మోహన్ వయసు 37 మాత్రమే. ఎర్రన్నాయుడు కేబినెట్ మంత్రిగా పార్లమెంట్ లో ముందు వరసలో కూర్చున్నప్పటికీ మొదటి వరసలో అయిదవ సీటులో కూర్చోవడం ద్వారా రామ్మోహన్ తండ్రిని మించిన మంత్రిగా కూడా నిలిచారు
గడచిన ఆరు నెలల కాలంగా ఆయన తన మంత్రిత్వ శాఖలో కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు కదులుతున్నారు. అదే విధంగా ఆయన తన డైనమిక్ లీడర్ షిప్ క్వాలిటీస్ తో మరింత ఫ్యూచర్ తనకు ఉందని చెప్పకనే చెబుతున్నారు. అందుకే ఆయన పుట్టిన రోజు వేళ దేశ ప్రధాని మోడీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయనకు గ్రేట్ ఫ్యూచర్ ఉండాలని బ్లెస్సింగ్స్ ఇచ్చారు.
ఇక చూస్తే రామ్మోహన్ రాజకీయ జీవితంలో 2024 మరపురాని ఇయర్ గా ఉంటుందని అంటున్నారు. ఆయనను ఏకంగా విమానమెక్కించి కేంద్ర స్థాయిలో నిలబెట్టిన ఈ ఏడాదిని ఆయన కానీ ఆయన అభిమానులు కానీ మరచిపోయే ప్రసక్తే లేదని అంటున్నారు. ఇదే ఉత్సాహంతో మరిన్ని కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టేందుకు రామ్మోహన్ 2025లో అడుగుపెడుతున్నారు. అలా తెలుగు రాజకీయాల్లో ఒక సమర్ధవంతమైన యువనేతను అందించిన ఇయర్ గా కూడా 2024ని అంతా చూస్తున్నారు.