చంద్రబాబు సంతకాలే కీలక ఆధారాలు అంటున్న సీఐడీ
ఈ కేసు విషయంలో ఏమి జరిగింది అన్న దాని మీద సీఐడీ చీఫ్ సంజయ్ మీడియాకు పూర్తిగా వివరించారు
ఏపీలో ఇపుడు స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ కుంభకోణం హాట్ టాపిక్ గా మారింది. ఈ కేసులో చంద్రబాబుని పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ కి తరలిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. ఇక హైకోర్టులో క్వాష్ పిటిషన్ కొట్టివేయడంతో ఈ కేసు విచారణ అన్నది మంగళవారం నాటికి వాయిదా పడింది.
ఈ నేపధ్యలో రాజకీయ హడావుడి బాగా పెరిగింది. టీడీపీ అయితే వీధులలోకి వచ్చి మరీ నిరసనలు చేస్తోంది. మరో వైపు చూస్తే ఇది పూర్తిగా రాజకీయ కక్ష సాధింపు చర్య అని టీడీపీ అంటోంది. ఇది పూర్తిగా ఆధారాలతో పెట్టిన కేసు అనుమానంతో పెట్టిన కేసు కానే కాదు అంటున్నారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రిష్ణారెడ్డి.
ఈ క్రమలో ఏపీ సీఐడీ మరోసారి మీడియా ముందుకు వచ్చింది. ఈ కేసు విషయంలో ఏమి జరిగింది అన్న దాని మీద సీఐడీ చీఫ్ సంజయ్ మీడియాకు పూర్తిగా వివరించారు. ఈ కేసులో చంద్రబాబు పాత్ర ఉన్నట్లుగా ఆధారాలు ఉన్నాయని అన్నారు. ఏకంగా పదమూడు చోట్ల ఆయన సంతకాలు పెట్టారని సంజయ్ చెప్పడం విశేషం.
క్యాబినేట్ అనుమతి లేకుండా రూల్స్ కి విరుద్ధంగా స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ ని ఏర్పాటు చేశారని అన్నారు. ప్రైవేట్ వ్యక్తిగా ఉన్న గంటా సుబ్బారావుకు బాధ్యతలు ఇవ్వడం కూడా ఈ కేసులో మరో కీలక పరిణామం అని ఆయన తెలిపారు. ఆయన నుంచే 241 కోట్ల రూపాయల ప్రభుత్వ నిధులను షెల్ కంపెనీలకు మళ్ళించారని సంజయ్ ఆరోపించారు.
ఇక చంద్రబాబు ఈ కార్పోరేషన్ కి నిధుల కోసం బడ్జెట్ అనుమతికి సంతకం చేశారని, అలాగే గంటా సుబ్బారావుకు మరో రెండు పదవులు ఇస్తూ సంతకం చేశారని, అంతే కాకుండా ఈ కేసులో ప్రతీ సందర్భంలోనూ అవసరం అయిన చోట ఫైల్ మువ్ అయిన చోట చంద్రబాబు సంతకం ఉందని అన్నారు.
ఇక అప్పటి కార్మిక మంత్రి అచ్చెన్నాయుడు సంతకాలు కూడా మరో అయిదు చోట్ల ఉన్నాయని చెప్పారు. ఇలా ఈ కేసులో పూర్తి ఆధారాలు ఉన్నాయని ఆయన అన్నారు. వీటి కంటే ముఖ్య విషయం ఏంటి అంటే కార్పోరేషన్ ఏర్పాటు కాక ముందే నిధులు పూర్తిగా చేతులు మారాయని ఆయన చెప్పడం గమనార్హం. ముఖ్యమంత్రి అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చెప్పడం వల్లనే ఆర్ధిక శాఖ నిధులు విడుదల చేసినట్లుగా ఆయన తెలిపారు.
అలాగే, కార్పోరేషన్ ఆరు చోట్ల కస్టర్లు ఏర్పాటు చేస్తామని చెప్పి ఎక్కడా ఏర్పాటు చేయలేదని ఆయన అన్నారు. అద్నుకే ఈ కేసులో లోతైన దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. చంద్రబాబు పదమూడు చోట్ల పెట్టిన సంతకాలు అన్నీ కూడా ఫైల్ చదువుతూ సంజయ్ వివరించడం విశేషం. బాబు సంతకాలు ఉన్నాయన్న సీఐడీ సంచలన ప్రకటనతో ఈ కేసు మరో మలుపు తిరిగింది అని అంటున్నారు.