బాబు మొదట్లోనే కుండబద్ధలు కొట్టేశారా ?
ఇదిలా ఉంటే పెద్దలు చెప్పినట్లుగా చంద్రబాబు కూడా ఆలోచిస్తున్నారు అని అంటున్నారు.
తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాలుగో సారి సీఎం అయిన తరువాత ఆయనలో మార్పు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. ఈసారి అధికారాన్ని కేవలం అయిదేళ్లకే పరిమితం కాకుండా మరిన్ని సార్లు గెలవాలని బాబు చూస్తున్నారు అని అంటున్నారు. దానికి తగినట్లుగానే ఆయన డే వన్ నుంచి యాక్షన్ ప్లాన్ ని సిద్ధం చేసుకుని పనిచేస్తున్నారు.
ఇదిలా ఉంటే పెద్దలు చెప్పినట్లుగా చంద్రబాబు కూడా ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. అదేంటి అంటే అంత్య నిష్టూరం కంటే ఆది నిష్టూరం నయం అన్నది. ఇది ముతక సామెత. ఏ విషయం అయినా తాను చేయలేను అని మొదట్లో చెప్పేస్తే జనాలు తిట్టుకున్నా అదే తరువాత ప్లస్ అవుతుంది. అలా కాకుండా నానుస్తూ పోతే ఆశలు పెరిగి పెద్దవై అసలుకే ఎసరు తెచ్చి పెడుతుంది.
ఇది చంద్రబాబు 2014 నుంచి 2019 మధ్యలో కనిపించింది. ఆయన అప్పట్లో కూడా చాలా హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. అయితే ఆయన హామీల అమలు విషయంలో ఎప్పుడూ నో చెప్పలేదు. మేము అమలు చేస్తామని చెబుతూ అలా సాగదీస్తూ ముందుకు పోయారు. చివరికి అవే అతి పెద్ద మైనస్ గా మారి పార్టీ కొంప ముంచాయి. రైతులకు రుణ మాఫీ దెబ్బ కొట్టింది.
అలాగే నిరుద్యోగ యువతకు భృతి కూడా చివరికి పార్టీకే షాక్ ఇచ్చింది. డ్వాక్రా మహిళలకు రుణాల మాఫీ ఇలా అనేక అంశాలలో హామీలు అమలు సరిగ్గా చేయలేక టీడీపీ చతికిలపడింది. దానిని ఆసరాగా చేసుకుని వైసీపీ రాజకీయంగా ఎదిరిగింది. ప్రతీసారి జనంలో చర్చకు పెట్టి టీడీపీ మీద రాజకీయంగా ఒత్తిడి తెచ్చింది. చివరికి 2019లో ఎలాంటి ఫలితాలు వచ్చాయో అంతా చూశారు.
అయితే ఈసారి మాత్రం చంద్రబాబు పాత రూట్ లో అసలు వెళ్ళ దలచుకోలేదు అని అర్ధం అవుతోంది. మామూలుగా చూసినా చంద్రబాబు సహజ రాజకీయ స్వభావం గురించి ఆలోచించినా ఆయన ఏ విషయమూ అంత తొందరగా తేల్చరు. కాలానికి విడిచిపెడుతూ చూద్దాం అని వెళ్లదీస్తూంటారు. కానీ ఈసారి మాత్రం ఎందుకో బాబు మొదట్లోనే కుండబద్ధలు కొట్టారు. ఈ విషయంలో ఆయన ఆది నిష్టూరమే నయం అని అనుకున్నారు అంటున్నారు.
అదేలా అంటే చంద్రబాబు అనేక హామీలను ఎన్నికల్లో ఈసారి ఇచ్చారు. వైసీపీ కంటే కూడా రెట్టింపు హామీలు ఇచ్చారు. వాటికి సూపర్ సిక్స్ అని పేరు పెట్టారు. నిజానికి వాటికి ఆకర్షితులు అయ్యే జనాలు ఈ వైపునకు టర్న్ అయ్యారని విశ్లేషణలు ఉన్నాయి. ఇక బంపర్ మెజారిటీతో చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఇచ్చిన మాట ప్రకారం వృద్ధులు దివ్యాంగులకు ఇతర వర్గాలకు సామాజిక పెన్షన్లు నాలుగు వేల రూపాయలు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకున్నారు. దానిని ఏప్రిల్ నుంచి అమలు చేస్తూ జూలైలో ఏడు వేల రూపాయల పెన్షన్ ని కూడా ఇచ్చారు.
దాంతో బాబు వరసబెట్టి అన్ని హామీలను అమలు చేస్తారు అని అంతా అనుకున్నారు. కానీ అక్కడే బాబు రాజకీయ చాణక్యం ప్రదర్శించారు. అన్ని హామీలను అమలు చేస్తే కనుక బడ్జెట్ లో ఏడాదికి అదనంగా మరో లక్షన్నర కోట్ల ఆర్ధిక భారం పడుతుంది. అప్పుల కోసం తిప్పలు పడాలి. ఇప్పటికే ఏపీ అన్ని రకాలుగా కునారిల్లింది. ఏ విధంగా చూసినా అప్పులు కూడా పుట్టే పరిస్థితి లేదు.
దాంతో బాబు తర్జన భర్జన పడిన అనంతరం అసెంబ్లీ వేదికగా చేసుకుని ప్రజలకు ఒక సందేశం పంపించారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితులను వివరిస్తూ ఆయన విడుదల చేసిన శ్వేత పత్రం కూడా దానికి బలం చేకూర్చేదిగా ఉంది. అన్నీ చెబుతూ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చిన బాబు సూపర్ సిక్స్ విషయంలో కుండబద్దలు కొట్టారు. రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ బాగాలేనందు వల్ల తాను ముందుకు వెళ్ళలేని పరిస్థితి ఉందని అన్నారు. ప్రజలు అర్ధం చేసుకోవాలని ఆయన కోరడం విశేషం.
అయితే దీని మీద జనంలో అనుకున్నంతగా వ్యతిరేకత అయితే రాలేదు అనే చెప్పాలి. ఒక్క వైసీపీ తప్ప విపక్షం నుంచి రియాక్షన్లు కూడా లేవు. ఎందుకంటే అందరికీ రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి తెలుసు. ఇక ప్రజలు అయితే ఏదో నాటికి బాబు ఇస్తారు అన్న ఆశతో ఉన్నారు అనుకోవాలి. దాంతో చంద్రబాబు ప్రకటన తరువాత చూస్తే పెద్దగా వ్యతిరేకత రాలేదని అంటున్నారు.
ఇదిలా ఉంటే చంద్రబాబు ఈ స్టేట్మెంట్ ఇవ్వడంలో వ్యూహాత్మకంగానే వ్యవహరించారు అని అంటున్నారు. ఏపీలో పధకాలు ఖర్చు చేస్తూ పోతే దానికే అప్పులు తెస్తే అభివృద్ధి అన్నది ఉండదు. వైసీపీ గత అయిదేళ్లలో అదే చేసింది. దానికి బదులుగా అమరావతి రాజధాని పోలవరం పూర్తి చేయడం టీడీపీ కూటమి ప్రయారిటీగా పెట్టుకుంది అని అంటున్నారు.
సంక్షేమ పధకాల విషయంలో ఆర్ధికంగా భారం కాని వాటినే అమలు చేస్తూ మిగిలిన వాటిని పక్కన పెడతారు అని అంటున్నారు. ఈ అయిదేళ్ళలో ఆర్ధికంగా పుంజుకుంటే కనుక చివరి రెండేళ్లలో సూపర్ సిక్స్ ని అమలు చేసినా చేయవచ్చు అని అంటున్నారు. దాంతో బాబు ప్రకటన పట్ల రాజకీయ విశ్లేషకులు కూడా స్వాగతిస్తున్నారు. అప్పులు చేసి పధకాలు ఇవ్వడం దండుగ మారి వ్యవహారం అనే అంటున్నారు.
ఇక బాబు అయితే రానున్న రోజులలో జనంలోకి తానూ మంత్రులు వెళ్ళి కన్విన్స్ చేసే ప్రయత్నం ఎటూ చేస్తారు. ఇంకా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు నెలలే అయింది కాబట్టి అయిదేళ్ళ నాటికి ఈ అసంతృప్తి ఉండకుండా అభివృద్ధి చేసి చూపించడం ద్వారా ప్రజాదరణ పొందవచ్చు అన్న ప్లాన్ బీ కూడా కూటమి పెద్దలకు ఉందని అంటున్నారు. మొత్తానికి బాబు కుండబద్దలు కొట్టేశారు అని అది కూటమికి ఎంతో మేలు చేసే వ్యవహారం అని అంటున్నారు.