బాబు ఢిల్లీ టూర్లు వర్కౌట్ అవుతున్నాయా ?
ఆయన ఎన్డీయేలో కీలక భాగస్వామిగా ఉన్నారు. అదే టైం లో ఏపీ అన్ని విధాలుగా ఇబ్బందులో ఉంది.
ఏపీ సీఎం చంద్రబాబు వరసబెట్టి ఢిల్లీ పర్యటనలు చేస్తున్నారు. ఆయన సీఎం కాక ముందు అయిన తరువాత చూసుకుంటే ఇప్పటికి బాగానే హస్తిన ప్రయాణం కట్టినట్లుగా కనిపిస్తోంది. చంద్రబాబు ఢిల్లీ టూర్లు వెళ్లడం వెనక అనేక వ్యూహాలు ఉన్నాయి. ఆయన ఎన్డీయేలో కీలక భాగస్వామిగా ఉన్నారు. అదే టైం లో ఏపీ అన్ని విధాలుగా ఇబ్బందులో ఉంది.
దాంతో స్వామి కార్యక్రం స్వకార్యం అన్నట్లుగా కేంద్రం వద్ద తన పలుకుబడిని వాడి మరీ ఏపీకి నిధులు తెచ్చుకోవాలని చూస్తున్నారు. నిధులతో పాటు భారీ ఎత్తున రుణాలను కూడా తెచ్చుకోవాలని బాబు చూస్తున్నారు. కేంద్రంలో మూడవసారి కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయింది.
తొలి బడ్జెట్ ని ప్రవేశపెట్టింది. అయితే ఏపీకి ఏమి ఇచ్చింది. అమరావతి రాజధానికి 16 వేల కోట్ల ప్రపంచ బ్యాంక్ రుణం. దానికి కేంద్రం గ్యారంటీ ఉంటుంది. ఇటీవల అమరావతికి ప్రపంచ బ్యాంక్ టీం వచ్చి వెళ్ళింది. రుణాలు ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంక్ కి అభ్యంతరం ఏమీ ఉండదు. అయితే ష్యూరిటీ గట్టిగా ఉండాలి. దీని మీద చర్చించేందుకు కూడా బాబు ఢిల్లీ వెళ్తున్నారు.
అలాగే బడ్జెట్ లో పెట్టనిది పోలవరం ప్రాజెక్ట్ విషయం. దానికి మేమే పూర్తి చేస్తామని కేంద్ర ఆర్ధిక మంత్రి చెప్పారు కానీ ఎపుడూ ఎలాగా అన్నది మాత్రం స్పష్టం చేయలేదు. పోలవరం ప్రాజెక్ట్ కి దండీగా నిధులు అవసరం అవుతాయి. మరీ ముఖ్యంగా డయాఫ్రం వాల్ మరమ్మత్త్రులకు అంతర్జాతీయ నిపుణుల బృందం సిఫార్స్ చేసింది. ఇంకా సేఫ్టీ కావాలీ అంటే కొత్తగా కట్టినా ఓకే అన్నట్లుగా చెప్పింది. ఏది చేసినా ఈ సీజన్ లో చేయాలి. అంటే అక్టోబర్ తరువాత అన్న మాట. దానికి నిధులు కావాలి.
అలాగే కేంద్రం వెనకబడిన ఏపీ ఏడు జిల్లాలకు ఆర్ధిక సాయం అని బడ్జెట్ లో ఒక మాట చెప్పింది. మరి దాని వివరాలు కూడా తెలుసుకోవడం వీలైనంతవరకూ ఆ నిధులను కూడా తెచ్చుకోవాలని బాబు చూస్తున్నారు. వైసీపీ హయాంలో రుణాలు తీసుకునేందుకు ఉదారంగా కేంద్రం సాయం చేసింది. దాని వల్ల టీడీపీకి ఇపుడు రుణాలు తీసుకోవడం కష్టంగా ఉంది. పైగా తడిసి మోపెడు అయ్యేలా ఉంది.
దాంతో వైసీపీ హయాంలో రుణాలను రీ షెడ్యూల్ చేయమని కేంద్రాన్ని ఏపీ సర్కార్ కోరుతుంది అని అంటున్నారు. అంటే ఆ భారాన్ని కొంతకాలం పాటు వాయిదా వేసుకోవడం అదే సమయంలో కొత్త రుణాలు తీసుకోవడం అన్నది బాబు వ్యూహం. ఇలా అనేక రకాలైన ఆలోచనలు ప్రతిపాదనలు విన్నపాలతో బాబు ఢిల్లీ ఫ్లైట్ ఎక్కారు.
అయితే బాబు ఢిల్లీ ఫ్లైట్ ఎక్కి కేంద్రం పెద్దలతో భేటీలు వేసినా ఆయన అనుకున్న దాంట్లో ఎన్ని అమలు లోకి వస్తాయన్నది చూడాలని అంటున్నారు. కేంద్రం అయితే జాతీయ రహదారులు రైల్వే లైన్స్ అని ఏపీకి అన్నీ చేస్తున్నామని చెబుతోంది. చేతికి మాత్రం నిధులు అయితే రావడం లేదు. ఇక ఈ ఏడాదికి 43 వేల కోట్ల దాకా రుణాలు తీసుకోవచ్చు. కానీ అందులో సగానికి పైగా ఇపుడే వైసీపీ ప్లస్ టీడీపీ కలసి తెచ్చేశారు. మరి మిగిలిన సగం రుణాలతో ఎలా గడుస్తుంది అన్నది చర్చ. అలాగే ప్రతీ నెలా పెన్షన్ పధకానికే ఎక్కువ నిధులు ఖర్చు అవుతున్న నేపథ్యం ఉంది.
ఉద్యోగులకు ఠంచనుగా నెలలో ఒకటవ తేదీన జీతాలు చెల్లించాల్సి ఉంటుంది. తడిసి మోపెడుగా ఖర్చులు ఉన్నాయి. దాంతో కేంద్రం నుంచి రుణమా లేక మరో రకామా అన్నది కాదు కానీ ఏదో విధంగా కాసులు చేతిలో పడితేనే ఏపీలో బండి నడిచేలా ఉంది. మరి ఈ విషయంలో చంద్రబాబు నెలలో ఒకటి కాదు రెండు సార్లు అయినా ఢిల్లీ ఫ్లైట్ ఎక్కడానికి రెడీగా ఉన్నారు.
విభజన హామీలు బడ్జెట్ హామీలు ఇలా అన్నీ కలిపి ప్రస్తావిస్తున్నారు. మరి బాబు ఢిల్లీ టూర్లు వర్కౌట్ అవుతున్నాయా అంటే ఇప్పటికి అయితే ఏదో చిన్న కదలిక అయితే ఉంటోంది తప్ప ఏపీ నుంచి కేంద్రానికి అందుతున్న రాజకీయ సాయానికి అలాగే ఏపీ విభజన హామీలకు సంబంధించి నెరవేర్చాల్సిన దానికి తీసుకుంటే మాత్రం పెద్దగా లేదు అనే అంటున్నారు. చూడాలి మరి ఈసారి బాబు టూర్ తో ఏ రకమైన రిజల్ట్ వస్తుందో.