అటు లోకేష్-ఇటు పవన్... చంద్రబాబుకు సమ ఉజ్జీలా?
పాలనలో తన ముద్ర కనిపించేలా.. స్పీడుగా పనిచేసే అధికార యంత్రాంగాన్ని ఆయన నియమించుకుంటున్నారు.
టీడీపీ అధినేత, ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పీడు అందరికీ తెలిసిందే. రోజుకు 18 గంటల పాటు అవిశ్రాంతంగా కష్టించే ఆయన.. పాలనపై తనదైన ముద్ర వేసిన విషయం కూడా ఎరుకే. ఇప్పుడు కూడా అదే స్ఫూర్తితో ఆయన పని చేస్తున్నారు. పాలనలో తన ముద్ర కనిపించేలా.. స్పీడుగా పని చేసే అధికార యంత్రాంగాన్ని ఆయన నియమించుకుంటున్నారు. ఒక వైపు పెట్టుబడులు.. మరోవైపు అభివృద్ధి.. ఇంకోవైపు సంక్షేమం.. ఇలా ఈ మూడు అంశాల ప్రాతిపదికగా..చంద్రబాబు పాలన సాగించేందుకు రెడీ అవుతున్నారు.
అయితే.. ఇప్పుడు ఈయనకు సమ ఉజ్జీలుగా.. మంత్రివర్గంలో ఎవరున్నారు? అనేది ప్రశ్న. నిజానికి మంత్రి వర్గ కూర్పును చూసుకుంటే.. పార్టీలు ఏవైనా.. నాయకులు ఎవరైనా.. కూడా చంద్రబాబు యువతకు పెద్దపీట వేశారు. 50-55 ఏళ్ల వారినే ఎక్కువగా నియమించుకున్నారు. అదేవిధంగా 40-45 ఏళ్ల వారికి కూడా ప్రాధాన్యం ఇచ్చారు. దీంతో వారంతా పోటీ పడి తనతో పాటు పరుగెత్తుతారని చంద్రబాబు అంచనా వేసుకున్నారు. ఈ క్రమంలోనే సీనియర్లను ఆయన దాదాపు పక్కన పెట్టారు.
ఆనం రామనారాయణరెడ్డి వంటి ఒకరి ద్దరికి మాత్రం మినహాయింపు ఇచ్చి.. చంద్రబాబు తన మంత్రి వర్గంలో చోటు కల్పించారు. అయితే.. యువ మంత్రులు ఇంకా బాధ్యతలు చేపట్టాల్సి ఉంది. ఇక, ఇప్పటి వరకు బాధ్యతలు చేపట్టిన వారిలో.. అటు నారా లోకేష్, ఇటు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లు దూసుకుపోతున్నారు. నారా లోకేష్.. బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి.. ఉదయం 7 గంటలకే విధుల్లోకి దిగుతున్నారు. తన ఇంట్లోనే ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నారు. ఇది 10 గంటల వరకు ఉంటోంది. అనంతరం.. ఆయన సమీక్షలు చేస్తున్నారు.
ఉన్నతాధికారులతో మాట్లాడుతున్నారు. అదే సమయంలో విద్యార్థులకు అందాల్సిన సౌకర్యాలు కూడా అందించేలా నిర్ణయాలను వడి వడిగా తీసుకుంటున్నారు. రాత్రి 9 గంటల వరకు విధుల్లోనే ఉంటున్నా రు. ఇక, ఉప ముఖ్యమంత్రి, పంచాయతీ రాజ్ సహా ఇతర శాఖల మంత్రిగా బుధవారం బాధ్యతలు చేపట్టిన పవన్ కల్యాణ్ కూడా.. తొలి రోజే దూకుడు ప్రదర్శించారు. ఉదయం 10.53కు బాధ్యతలు చేపట్టిన ఆయన నిర్విరామంగా రాత్రి వరకు సమీక్షలు.. చర్చలతోనే గడిపారు.
అటవీ శాఖ, పంచాయతీ శాఖ సహా..తనకు కేటాయించిన నీటిసరఫరా శాఖల అధికారులతో సమీక్షలు నిర్వహించారు. అంతేకాదు.. కొన్ని ఆదేశాలు కూడా జారీ చేశారు. మొత్తంగా ఆయన కార్యాలయంలోనే 10గంటలపాటు ఉన్నారు. ఈ పరిణామాలు చూస్తే.. చంద్రబాబు స్పీడుకు.. అటు నారా లోకేష్, ఇటు పవన్‌లు సమ ఉజ్జీలుగా ఉన్నారని అంటున్నారు పరిశీలకులు.