బాబు చెప్పింది చేయరని ఎవరన్నారు? వచ్చేసింది.. ఎన్టీఆర్ భరోసా!

వృద్ధులు.. వితంతువులు.. ఒంటరి మహిళలు.. ఇతర వర్గాలకు అందే పింఛన్ లను భారీగా పెంచేస్తూ చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో హామీలు ఇవ్వటం తెలిసిందే.

Update: 2024-06-14 04:19 GMT

విశ్వసనీయత లేని అధినాయకుడు ఎవరైనా ఉన్నారంటే అందులో ముందుంటుంది తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పేరు. ఇది ఆయన రాజకీయ ప్రత్యర్థులు తరచూ చేసే ఆరోపణ. ఎన్నికల వేళలో హామీ ఇవ్వటమే కానీ అమలు మీద అస్సలు ఫోకస్ చేయరని.. మాట ఇవ్వటమే కానీ అమలును పట్టించుకోని అధినేతగా ఆయన్ను అదే పనిగా ఆడిపోసుకోవటం కనిపిస్తుంది. గతం సంగతి ఎలా ఉన్నా.. వర్తమానంలో మాత్రం చంద్రబాబు.. తన మీద విమర్శనాస్త్రాల్ని ఎక్కు పెట్టే వారికి సమాధానం ఇచ్చేలా నిర్ణయాల్ని వరుస పెట్టి తీసేసుకుంటున్నారు.

వృద్ధులు.. వితంతువులు.. ఒంటరి మహిళలు.. ఇతర వర్గాలకు అందే పింఛన్ లను భారీగా పెంచేస్తూ చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో హామీలు ఇవ్వటం తెలిసిందే. గత ప్రభుత్వం ఇస్తున్న దానికి మించి తమ ప్రభుత్వంలో ఇస్తామన్న ఆయన.. అందుకు తగ్గట్లు పెద్ద ఎత్తున హామీ ఇవ్వటం తెలిసిందే. వృద్ధులు.. వితంతువులు.. ఒంటరి మహిళలు.. ఇతర వర్గాలకు నెలకు అందే పింఛన్ ను రూ.4వేలకు పెంచేయటం.. దివ్యాంగులకు రూ.3 వేల నుంచి రూ.6వేలకు.. వీల్ ఛైర్.. తీవ్ర అనారోగ్యంతో మంచాన ఉన్న వారికి రూ.15వేలు.. కిడ్నీ.. తలసీమియా బాధితులకు రూ.10వేలు చొప్పున సాయాన్ని నెల వారీగా అందిస్తామని మాట ఇవ్వటం తెలిసిందే.

ఇందుకు తగ్గట్లే.. ఈ ఫించన్లకు ఎన్టీఆర్ భరోసా పేరును నిర్ణయించారు. ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టినంతనే తాను ఎన్నికల వేళలో ఇచ్చిన హామీలకు తగ్గట్లే సామాజిక భద్రత పింఛన్ల పెంపు ఫైల్ మీద సంతకం చేశారు. గత ప్రభుత్వంలో పింఛన్ పథకానికి పెట్టిన ఎన్టీఆర్ భరోసా పేరునే ఇప్పుడు కూడా కొనసాగించాలని నిర్ణయించారు. సీఎం హోదాలో చంద్రబాబు సంతకం చేసిన మూడో ఫైల్ ఇదే కావటం గమనార్హం.

గత ప్రభుత్వంలో రూ.3 వేలు అందుతున్న పింఛన్ ను రూ.4వేలకు పెంచారు.ఈ పెంపును ఏప్రిల్ నుంచి పెంచేలా అమలు చేయనున్నారు. అంటే.. వచ్చే నెల 1న (జులై 1) ఈ వర్గాల వారికి పింఛన్ ను రూ.7వేలుగా ఇస్తారు. కొత్త పింఛన్ రూ.4 వేలు.. ఏప్రిల్ నుంచి జులై వరకు ఉన్న తేడా వెయ్యి మూడు నెలలకు కలిపి ర.3వేలు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో 65.39 లక్షల మంది పింఛన్ దారులు ఉన్నారు. ప్రస్తుతం ఈ పింఛన్ల కోసం నెలకు రూ.1939 కోట్లు ఖర్చు అవుతోంది. పెంచిన పింఛన్ అమలుకు రూ.4408 కోట్లు కానుంది. మూడు నెలల ఎరియర్స్ మొత్తం కలిపి రూ.1650 కోట్లు కానుంది. మొత్తంగా ఈ పెంచిన పింఛన్ల అమలుకు ఏడాదికి రూ.33,099 కోట్లు అవసరమవుతుందని లెక్కేశారు. బడ్జెట్ లెక్కల్లో ఇదో పెద్ద పద్దుగా మారనుంది.

Tags:    

Similar News