జగన్ కి నచ్చిన పేరు పెట్టుకోండంటూ బాబు ఆఫర్ !

జలగ అని సోషల్ మీడియాలో నామకరణం చేసింది టీడీపీ అనుకూల నెటిజన్లే అని అంటారు.

Update: 2024-08-02 01:30 GMT

చంద్రబాబు తన నోట జగన్ పేరు చెప్పేందుకు ఇష్టపడడం లేదా. ఆయన శ్రీశైలం పర్యటనలో భాగంగా జరిగిన సభలో ప్రసంగిస్తూ అయిదేళ్ల పాటు ఏపీని సర్వనాశనం చేశారు అని నిందించారు. ఆయన పేరు నేను చెప్పను. మీరు మీకు నచ్చిన పేరు పెట్టుకోండి అని సెటైర్లు పేల్చారు.

నిజానికి జగన్ కి టీడీపీ పెట్టినన్ని పేర్లు ఎవరూ పెట్టలేదు. సైకో అని ఆయనకు బిరుదు ఇచ్చిందే టీడీపీ. జలగ అని సోషల్ మీడియాలో నామకరణం చేసింది టీడీపీ అనుకూల నెటిజన్లే అని అంటారు. ఈ రెండే కాదు తాడేపల్లి పిల్లి అని కూడా అన్నారు. అయితే జగన్ పేరు ఎత్తకుండా చంద్రబాబు తాజా పర్యటనలో విమర్శలు గుప్పించారు. ఏపీని వినాశనం చేసిన ఆయనకు ఏ పేరు పెట్టుకుంటారో మీ ఇష్తం అని జనాలకే ఆఫర్ ఇచ్చారు.

తాను ఏపీ అభివృద్ధి కోసం కష్టపడుతూంటే ఏమీ చేయలేదు అని అంటున్నారని బాబు అసహనం వ్యక్తం చేశారు. పేద వారి కోసమే తన తపన అని అన్నారు. జగన్ అయిదేళ్లలో పేదలకు ఏమి చేశారు అని ఆయన నిలదీసారు. ఆయన హయాంలో రైతులకు చేసిన మేలు కూడా ఏదీ లేదని అన్నారు. 2014 నుంచి 2019 దాకా ఉన్న తమ ప్రభుత్వమే రైతాంగానికి పెద్ద ఎత్తున ఆదుకుని కార్యక్రమాలు చేసిందని అన్నారు.

తాను పీపీపీ విధానంలో పేదలకు పెద్దలకు మధ్య అంతరం లేకుండా చూడాలని అనుకుంటున్నానని చెప్పారు. ఇది బృహత్తరమైన కార్యక్రమమని బాబు చెప్పారు. డబ్బున్న పది మంది కలిసి తమ వంతుగా పేదలను ఆదుకుంటే ఏదో నాటికి పూర్తిగా పేదరికం పోతుందన్నది తన ఆలోచన అని అది ఆచరణలో సక్సెస్ ఫుల్ గా చేసి చూపిస్తామని బాబు అన్నారు.

రాయలసీమకు తాను ఎంతో చేశానని ఇపుడు కూడా పెద్ద పీట వేస్తున్నామని చెప్పారు. కరవు సీమ కాకుండా రతనాల సీమగా తీర్చిదిద్దుతామని అన్నారు.అన్ని వర్గాలు అన్ని ప్రాంతాలు అభివృద్ధి కావాలన్నదే తన ధ్యేయమని బాబు అన్నారు. మొత్తానికి జగన్ ని ఏమీ అనడానికి తమకు మాటలు లేవని ప్రజలే ఆయన పాలన పట్ల తేల్చుకుని వారికి నచ్చిన పేరు పెట్టాలన్నట్లుగా బాబు తాజా వ్యాఖ్యలు ఉన్నాయని అంటున్నారు.

ఏపీ సీఎం చంద్రబాబు బహుముఖమైన వ్యూహాలతో వైసీపీని దాని అధినేతను రాజకీయంగా బదనాం చేస్తున్నారు అని అంటున్నారు. ఈసారి ఎన్నికల్లో ఓడినా ఇక మీదట లేవకుండా ఉండేలా జనం నుంచే వైసీపీని నిరసలను వచ్చేలా ఆయన పాలనలో తొలి అడుగుల నుంచే మొదలెట్టారని అంటున్నారు. మరి జనాలు ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది.

Tags:    

Similar News