పసుపు సైన్యం కన్నీళ్లకు ఇంత భావదారిద్ర్యం ఏంది బాసూ?
వయసు మీద పడుతున్న వేళ.. యంగ్ బ్లడ్ ను పార్టీలోకి తెచ్చే విషయంలో జరిగిన పొరపాటు ఎంత ఎక్కువన్న విషయం అర్థమవుతుంది
చంద్రబాబు అరెస్టు ఎపిసోడ్ మొత్తాన్ని పార్టీలకు అతీతంగా.. రాజకీయాల మీద ఆసక్తి.. అనురక్తి ఉన్న ఒక మూడో మనిషిగా చూసినప్పుడు అర్థమయ్యేదేమంటే.. తెలుగుదేశం పార్టీ బలహీనతలు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తాయి. తెలుగుదేశం పార్టీని వేధిస్తున్న నాయకత్వ లేమి ఎంతన్న విషయం అర్థమవుతుంది. అంతేకాదు.. పార్టీకి దన్నుగా ఉన్నామని చెప్పుకునే నేతలు ఎంత అవుడేటెడ్ అన్నది అర్థమవుతుంది. టీడీపీకి చంద్రబాబు అవసరం ఎంతన్నది మరింత బాగా అర్థమవుతుంది. ఏడుపదుల వయసు దాటేసిన తర్వాత కూడా ఆయన మీద ఆధారపడిన తీరు చూస్తే.. షాక్ కు గురి కాక మానదు.
వయసు మీద పడుతున్న వేళ.. యంగ్ బ్లడ్ ను పార్టీలోకి తెచ్చే విషయంలో జరిగిన పొరపాటు ఎంత ఎక్కువన్న విషయం అర్థమవుతుంది. శుక్రవారం రాత్రి ఎనిమిది గంటల వేళలో మొదలైన అరెస్టు అంశం.. రాత్రి పన్నెండు వరకు క్లారిటీ లేకుండా సాగింది. ఎట్టకేలకు అర్థరాత్రి ఒంటిగంటకు ఆయన్ను సీఐడీ అదుపులోకి తీసుకుంటున్న విషయంపై స్పష్టత వచ్చినప్పటి నుంచి ఆయన్ను రాజమండ్రి జైలుకు తరలించే వరకు సాగిన గంటల సమయంలో తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా చేతులు ఎత్తేసిన తీరు కనిపిస్తుంది.
చంద్రబాబు అరెస్టును తప్పు పడుతూ.. 'అంత మనిషిని అన్యాయంగా అరెస్టు చేస్తారా?' అన్న ప్రశ్నను ప్రశ్నించే తీరులోనూ.. తమకు జరిగిన అన్యాయాన్ని ఆవేదన భరితంగా ప్రదర్శించే వీడియో ఒకటి ఎట్టకేలకు బయటకు వచ్చింది. అరెస్టు చేసిన మూడున్నర రోజుల తర్వాత యూట్యూబ్ లో అప్ లోడ్ చేసిన వీడియో మరింత షాకింగ్ గా మారింది. కారణం.. ఇప్పటి పరిస్థితుల్ని చాటుతూ.. వేదనను అక్షరబద్ధంగా చేసినట్లుగా ఉన్న పాట నాలుగేళ్ల క్రితం నాటిది కావటం గమనార్హం.
అప్పట్లో చంద్రబాబు ఓడిన సమయాన సిద్ధం చేసిన వీడియోను.. ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా ఎడిట్ చేసి మళ్లీ వదిలారు. చంద్రబాబు అరెస్టుపై విడుదలైన పాట..విన్నంతనే వేదనతో కళ్లు చమర్చేలా ఉన్నప్పటికీ.. అదంతా పాత వీడియోను కాస్తంత ఎడిట్ చేసిన వదిలిన తీరును చూస్తే.. ఇదెక్కడి భావదారిద్ర్యం అనుకోకుండా ఉండలేం.
ఈ వీడియోలో తన అరెస్టుపై చంద్రబాబు వ్యాఖ్యలతో మొదలు పెట్టి.. వేదనా స్వరంతో.. ''శిల మోసే గాయాలు కావా శిల్పాలు.. నీ సహనం చూస్త్తుంటే ఉలికైనా కన్నీళ్లు.. శిధిలాలే సదనాలై సాగిన దారుల్లో.. నిలువెల్లా బలై చేసే కుట్రల కేంద్రాలు.. నిన్ను చీల్చినా.. నీ వెన్ను వణుకదు.. నువ్వు ఉండగా ఈ మన్ను తొణకదు.. చంద్రన్నా.. చంద్రన్నా.. నువ్వు చెమ్మగిల్లనివ్వవు ఏ కన్నైనా. నిన్నుకమ్ముతున్న కష్టాలపాలైనా'' అంటూ సాగింది.
చంద్రబాబు అరెస్టుపై సామాన్యుడి రియాక్షన్ కు సంబంధించి.. ఒక పెద్దాయన పెద్ద ఎత్తున అరుస్తూ.. 'మహానుభావుడ్రా.. ఆయన.. మహానుభావుడ్రా' అన్న మాటలు మాత్రం ఎవరో కొరడా పెట్టినట్లు కొట్టినట్లుగా ఉలిక్కిపడేలా ఉంది. పాత పాటకు తాజా పరిస్థితులకు తగ్గట్లుగా మార్పులు చేశారు. అందులో భాగంగా చంద్రబాబు అరెస్టుకు ఆయన ప్రత్యర్థులే కారణమన్న విషయాన్ని చెప్పే క్రమంలో.. 'రాజ్యకాంక్షతో రాష్ట్ర ద్రోహులు..' అంటూ సాగే వేళ.. చూపించిన ఫోటోలు ఓకే కానీ ఒరిజినల్ వీడియోలో కేసీఆర్.. మోడీ ఫోటోలు కూడా ఉంటే.. తాజా వీడియోలో మాత్రం వాటిని డిలీట్ చేశారు.
తెలుగుదేశం పార్టీ అభిమానుల్ని విపరీతంగా కనెక్టు చేసే వీడియోను రీ ఎడిటింగ్ చేసి.. రీరిలీజ్ చేయటం ఒక ఎత్తు అయితే.. దానికి మూడున్నర రోజులు తీసుకోవటం మరో ఎత్తు. ఇదంతా చూస్తే.. తెలుగుదేశం పార్టీ ప్రచార విభాగం మరీ ఇంత భావదారిద్ర్యంతో ఇబ్బంది పడుతుందా? అని మాత్రం అనుకోకుండా ఉండలేం.