టెన్షన్ పుట్టిస్తున్న మహా సీఎం ఎంపిక.. ఫడ్నవీస్ కు నో ఛాన్స్?

అంచనాలకు మించిన విజయాన్ని సొంతం చేసుకోవటం ద్వారా మహా ఆనందంగా ఉంది బీజేపీ అగ్రనాయకత్వం.

Update: 2024-11-25 06:30 GMT

అంచనాలకు మించిన విజయాన్ని సొంతం చేసుకోవటం ద్వారా మహా ఆనందంగా ఉంది బీజేపీ అగ్రనాయకత్వం. దేశంలో సంపన్న రాష్ట్రాల్లో ఒకటి.. దేశ ఆర్థిక రాజధాని నగరానికి ప్రాతినిధ్యం వహించే మహారాష్ట్ర అధికార పగ్గాలు చేతికి రావటం దేశ రాజకీయాల్ని ఎంతలా ప్రభావితం చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభుత్వాన్ని సొంతంగా ఏర్పాటు చేసేందుకు అవసరమైన మెజార్టీని బీజేపీ సొంతం చేసుకున్నా.. ముఖ్యమంత్రి ఎంపిక విషయంలో మాత్రం ఆచితూచి అన్నట్లుగా వ్యవహరిస్తోంది. మహాయుతి కూటమిలోని మూడు పార్టీల నేతలు సీఎం కుర్చీ కోసం పోటీ పడుతున్నారు.

బీజేపీ సీనియర్ నేత.. గతంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా వ్యవహరించిన దేవేంద్ర ఫడ్నవీస్ కు మాత్రం అవకాశం దక్కేది లేదని స్పష్టం చేస్తున్నారు. ఆయన్ను ఉప ముఖ్యమంత్రి పదవిని కట్టబెడతారని చెబుతున్నారు. ముఖ్యమంత్రి రేసులో ప్రస్తుత సీఎం శివసేన (షిండే) అధినేత ఏక్ నాథ్ షిండే మరోసారి తనకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాన్ని కల్పించాలని కోరుతున్నారు. అదే సమయంలో.. ఎన్సీపీ చీఫ్ కం ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ కూడా ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్నారు.

ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు ముఖ్యమంత్రి అవుతారని చెబుతున్నారు. అత్యధిక సీట్లను సొంతం చేసుకున్నప్పటికీ.. ముఖ్యమంత్రి పదవిని తమ పార్టీకి చెందిన నేతకు కట్టబెట్టే విషయంలో బీజేపీ అగ్ర నాయకత్వం సుముఖంగా లేనట్లుగా తెలుస్తోంది. ఒకవేళ.. ఆ దిశగా నిర్ణయం తీసుకుంటే మాత్రం రాజకీయ సంచలనంగా మారుతుందని చెబుతున్నారు. తమ పార్టీకి చెందిన మాజీ ముఖ్యమంత్రి.. డిప్యూటీ సీఎంగా ఉన్న దేవేంద్ర ఫడ్నవీస్ ను మరోసారి ఉప ముఖ్యమంత్రి పదవికి ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది.

ఈ రోజు (సోమవారం) జరిగే మహాయుతి ఎమ్మెల్యేల భేటీ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తుననారు. ఈ సమావేశంలోనే తదుపరి సీఎం ఎవరన్న దానిపై క్లారిటీ వస్తుందని చెప్పక తప్పదు. ప్రస్తుత అసెంబ్లీ గడువు మంగళవారంతో ముగియనుండటంతో.. ఈ రోజు సీఎం ఎవరన్న దానిపై తేల్చేస్తారని.. అధికారిక ప్రకటన వెలువడుతుందని చెబుతున్నారు. కొత్త ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం మంగళవారం వాంఖడే స్టేడియంలో జరగనున్నట్లు తెలుస్తోంది. ఏమైనా ఈ రోజు సాయంత్రానికి మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై క్లారిటీ వస్తుందని చెప్పక తప్పదు.

Tags:    

Similar News