ఎమ్మెల్యేగా కూడా బాబు అనర్హుడు... కుప్పం ఒప్పుకున్నట్లేనా...!?
టీడీపీ అధినేత చంద్రబాబు రాజకీయం అంతా వ్యూహాలు ఎత్తులు జిత్తులు అదృష్ట్రాల మధ్య సాగింది అని ఆయన ప్రత్యర్ధులు అంటారు
టీడీపీ అధినేత చంద్రబాబు రాజకీయం అంతా వ్యూహాలు ఎత్తులు జిత్తులు అదృష్ట్రాల మధ్య సాగింది అని ఆయన ప్రత్యర్ధులు అంటారు. ఆయన మద్దతుదారులు మాత్రం ఆయనది చాణక్య రాజకీయం అంటారు. చంద్రబాబు ఉమ్మడి ఏపీలో ఎవరూ పాలించనన్ని ఏళ్ళు సీఎం గా పాలించారు. అంతే కాదు కుప్పంలో ఎవరూ ఎన్నిక కానన్ని సార్లు ఎన్నిక అయ్యారు. ఆయన ఏకంగా ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అంటే అక్షరాలా మూడున్నర దశాబ్దాలు అన్న మాట.
మరి ఆయన కుప్పం ఎమ్మెల్యేగా ఉన్నపుడే సీఎం గా ముమ్మారు ఉన్నారు. కుప్పం ఎలా ఉంది ఎలా ఉండాలి ఇది జగన్ కుప్పం ప్రజలకు వేసిన సూటి ప్రశ్న. కుప్పానికి ఏమీ చేయని వారు, కుప్పంలో కనీసం ఇల్లు కూడా కట్టుకోలేని వారు అయిన ఎమ్మెల్యే మీకు అవసరమా అని జగన్ డైరెక్ట్ గానే కుప్పం ప్రజలను ప్రశ్నించారు. కుప్పానికి క్రిష్ణమ్మ నీరు తీసుకుని వచ్చింది జగన్ అని ఆయన చెప్పారు. కుప్పం ని మునిసిపాలిటిగా మార్చినా రెవిన్యూ డివిజన్ ఇచ్చినా, పోలీస్ సబ్ డివిజన్ ఇచ్చినా కూడా అది జగనే అని ఆయన చెప్పుకొచ్చారు.
చిత్తూరు డైరీని తెరిపించామని, వెల్లూరు మెడికల్ కాలేజీని ఇచ్చామని, కుప్పం అభివృద్ధిలో అడుగడుగునా భాగం అయ్యామని జగన్ చెప్పారు. తాను కుప్పానికి ఎంతో మేలు చేయడమే కాదు చంద్రబాబుని ఎమ్మెల్యేగా చేసిన ప్రజలను కూడా నా వాళ్లూ అనుకున్నాను అని జగన్ చెప్పారు.
చంద్రబాబు 1989 నుంచి కుప్పంలో గెలుస్తూ ఉన్నారని ఏమి చేసారని నిలదీయాలని జగన్ కుప్పం ప్రజలను కోరారు. అసలు ఈయన ఎమ్మెల్యేగా కూడా అర్హుడేనా అని జగన్ ప్రశ్నించారు. తనను ఇంతలా ఆదరించిన ప్రజలకు మేలు చేయాల్సింది పోయి సమస్యలతో కుప్పాన్ని విడిచిపెడితే తాను వచ్చాకనే అభివృద్ధి అన్నది జరిగిందని జగన్ చెప్పారు.
చంద్రబాబుకు తన మీద కోపం వస్తే పులివెందులను కడప ప్రజలను తిడతారని, ఇంకా ఎక్కువ కోపం వస్తే రాయలసీమ ప్రాంతాన్నే తిడతారని జగన్ గుర్తు చేశారు. తాను మాత్రం కుప్పం ప్రజలను తన గుండెల్లో పెట్టుకున్నానని, కుప్పానికి మేలు చేయడమే తన ఆలోచన అని జగన్ చెప్పారు.
కుప్పం ప్రజలు కానీ అమరావతి ప్రజలు కానీ ఇచ్చాపురం ప్రజలు కానీ ఎవరైనా తనకు ఒక్కటే అని అన్నారు. తాను కులం మతం ప్రాంతం, పార్టీలు చూడకుండా అటు సంక్షేమం ఇటు అభివృద్ధి రెండూ చేసి చూపిస్తున్నాను అని జగన్ చెప్పుకొచ్చారు. కుప్పం ప్రజలకు తాము చేసిన మేలు చూపించామని ఇక ప్రజలు ఎవరికి ఓటు వేయాలో నిర్ణయించుకోవాలని అన్నారు. చంద్రబాబు ఎమ్మెల్యేగా అనర్హుడు అని చెప్పడం ద్వారా ఆయనను ఓడించాలని జగన్ ఇండైరెక్ట్ గా పిలుపు ఇచ్చారు.
కుప్పం వైసీపీ ఖాతాలో పడాలని ఆ పార్టీ చూస్తోంది. దీని మీద గత అయిదేళ్ళుగా కూడా వైసీపీ గట్టి ప్రయత్నాలే చేస్తోంది. సరిగ్గా ఎన్నికల ముందు హంద్రీ నీవా నీటిని కుప్పానికి తరలించడం ద్వారా జగన్ తాను చేసింది చెప్పుకునే అవకాశం వచ్చింది అని అంటున్నారు. మరి లోకల్ బాడీ ఎన్నికల్లో ప్రజలంతా టీడీపీని ఓడించారు అదే 2024 ఎన్నికల్లో కూడా రిపీట్ అవుతుందని వైసీపీ నేతలు చెబుతున్నారు.