బాబు నెల రోజుల పాలన.. జనాన్ని మెప్పించారా?
చంద్రబాబు అధికారం చేపడుతూనే.. కీలక ప్రాజెక్టులైన పోలవరం, అమరావతి రాజధాని ప్రాంతాల్లో పర్యటన చేశారు
ఏపీలో కూటమి ప్రభుత్వం బాధ్యతలు తీసుకుని నేటికి(గురువారం) నెల రోజులు పూర్తయింది. జూలై 12న రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా(వ్యక్తిగతంగా నాలుగోసారి) చంద్రబాబు ప్రమాణస్వీకారం చేశారు. అనంత రం.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఇలా.. ఆ రోజుతో ప్రారంభమైన ఏపీ నూతన ప్రభుత్వ పాలనకు గురువారంతో నెల రోజులు పూర్తయ్యాయి. మరీ ఈ 30/31 రోజుల పాలనలో చంద్రబాబు ప్రజలను మెప్పించారా? మురిపించారా? చూద్దాం.
చంద్రబాబు అధికారం చేపడుతూనే.. కీలక ప్రాజెక్టులైన పోలవరం, అమరావతి రాజధాని ప్రాంతాల్లో పర్యటన చేశారు. తద్వారా.. ఆయన తన ప్రాధాన్యాలను చెప్పకనే చెప్పారు. అనంతరం.. ఆయన రాష్టానికి తేవల్సిన పెట్టుబడులు, అభివృద్ధిపై.. రోజు వారీ సమీక్షలు నిర్వహించారు. కేంద్రానికి కొన్ని నివేదికలు తీసుకుని వెళ్లారు. త్వరలో ప్రవేశ పెట్టనున్న కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి కేటాయించాల్సిన నిధుల విషయంపై చర్చలు జరిపారు. ఇది అభివృద్ధి దిశగా వేసిన అడుగు.
ఇక, జూలై 1.. అంటే.. చంద్రబాబు సర్కారు బాధ్యతలు చేపట్టిన 18 రోజుల తర్వాత వచ్చిన నెల ఫస్ట్‌నే రాష్ట్ర వ్యాప్తంగా 65 లక్షలమందికి పైగా సామాజిక భద్రతా పింఛన్ల పింపిణీ చేపట్టారు. అప్పటి వరకు ఉన్న రూ.3000 పింఛనును రూ.4000లకు పెంచడంతోపాటు.. ఏప్రిల్-జూన్ మధ్య ఉన్న బకాయిలను కూడా కలిపి రూ.7000 చొప్పున అందించారు. దీంతో సంక్షేమ పథకాలపై చంద్రబాబుపై ఉన్న అనేక సందేహాలను పటాపంచలు చేశారు.
ఇక, ఉద్యోగాలకు సంబంధించిన డీఎస్సీ 16 వేల ఉద్యోగాలకు సంబంధించి కూడా.. చర్యలు తీసుకున్నా రు. తొలి సంతకాన్ని అమలు చేసేందుకు సిద్ధమయ్యారు. అదేవిధంగా ఉద్యోగుల బదిలీలు, కీలక స్థానా ల్లో ఉన్నవారికి స్థాన చలనంతో పాటు.. తన వేగానికి తగిన విధంగా పనిచేసే అధికారులు ఎక్కడ ఉన్నా.. తెచ్చుకుంటున్నారు. మరీ ముఖ్యంగా గత ఐదేళ్ల పాలనలో జగన్ పలు ప్రాజెక్టుల విషయంలో అనుసరించిన తీరును ప్రజలకు వివరిస్తూ.. శ్వేతపత్రాలు తీసుకురావడం.. చంద్రబాబు నెల రోజుల పాలనలో కీలకమని చెప్పొచ్చు.
ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు సైతం ఆయన నెల రోజుల్లో కొంత మేరకు దృష్టి సారించారు. ఇక, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఉచిత ఇసుక పథకాన్ని తిరిగి తీసుకువచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 20 జిల్లాల్లో దీనిని ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. దీంతోభవన నిర్మాణ రంగం పుంజుకునేందుకు చంద్రబాబు చోదక శక్తులు అందించినట్టయింది. ఇతమిత్థంగా చూస్తే.. తొలి నెల రోజుల్లో ఆయన అభివృద్ధి-సంక్షేమం రెండింటినీ సమపాళ్లలో ముందుకు తీసుకువెళ్లడం గమనార్హం.
కొసమెరుపు ఏంటంటే.. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న దశాబ్దం కిందటి సమస్యలను కూడా సీఎం చంద్రబాబు పరిష్కరించే ప్రయత్నం చేయడం. తనే చొరవ తీసుకుని తెలంగాణ సీఎంరేవంత్‌తో భేటీ అయ్యారు. దీంతో అపరిష్కృత సమస్యలు పరిష్కారం అవుతాయనే విశ్వాసం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కల్పించగలిగారు.