'గ్యాప్' పెంచేలా చంద్రబాబు బిహేవ్ చేస్తున్నారా?

పాలనాపరమైన అంశాల్లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఏం చేయాలి? ఏం చేయకూడదన్న విషయాన్ని ఆయనకు చెప్పాల్సిన అవసరం లేదు

Update: 2024-07-17 05:30 GMT

పాలనాపరమైన అంశాల్లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఏం చేయాలి? ఏం చేయకూడదన్న విషయాన్ని ఆయనకు చెప్పాల్సిన అవసరం లేదు. పాలనాపరమైన అనుభవం ఆయనకు చాలా ఎక్కువ. నిజానికి.. ప్రజాపాలకుడిగా కంటే కూడా అత్యుత్తమ కార్యనిర్వాహకుడిగా ఆయనకు పేరుంది. గతంలో ఆయన తనను తాను ముఖ్యమంత్రి అనిపించుకునే కన్నా.. ఏపీకి సీఈవో అనిపించుకోవటానికే ఆసక్తి చూపేవారు. ఎప్పుడైతే వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారో.. ఆయన్ను ప్రజాపాలకుడిగా ప్రజల్లో తెచ్చుకున్న పేరును చూసిన తర్వాత మాత్రం చంద్రబాబుకు సీఈవో ఇమేజ్ కంటే ప్రజాపాలకుడి గుర్తింపు మీద ఆసక్తి పెరిగిందని చెప్పాలి.

పదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన 2014లో చంద్రబాబు ప్రజాపాలకుడన్న ఇమేజ్ కోసం ప్రయత్నించారు. పెద్దగా వర్కువుట్ కాలేదనే చెప్పాలి. కానీ.. ఈసారి మాత్రం ఆయనలో మార్పు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. ప్రజానేతగా పేరు తెచ్చుకునే ఏ చిన్న అవకాశాన్ని ఆయన వదలట్లేదు. ఇదంతా చూస్తే.. ప్రజా నాయకుడన్న ఇమేజ్ కోసం ఆయన తీసుకుంటున్న జాగ్రత్తలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. ఇదంతా ఒక ఎత్తు. అన్ని విషయాల్లోనూ ఆచితూచి అన్నట్లుగా వ్యవహరిస్తూ జాగ్రత్తలు తీసుకుంటున్న చంద్రబాబు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ విషయంలో మరికొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు.

ఈ ఇద్దరు అధినేతల మధ్యనున్న బంధం బలంగా ఉందని.. గ్యాప్ వచ్చే అవకాశం లేదన్న మాట వినిపిస్తోంది. చంద్రబాబును పవన్ కల్యాణ్ ఎంతగా గౌరవిస్తారో.. అందుకు రెట్టింపు అన్న రీతిలో పవన్ ను చంద్రబాబు అభిమానిస్తున్నారు. తన స్థాయిని పట్టించుకోకుండా పవన్ ను చంద్రబాబు అక్కున చేర్చుకునే తీరు చాలా సందర్భాల్లో టచింగ్ గా ఉంటోంది. మొన్నటికి మొన్న ఒక కార్యక్రమంలో పవన్ వేరుగా ఉంటే.. ఆయన వద్దకు వెళ్లిన చంద్రబాబు భుజం తట్టి మరీ పలుకరించిన వైనం.. దానికి సంబంధించిన వీడియో పెద్ద ఎత్తున వైరల్ గా మారింది.

పవన్ కు చంద్రబాబు ఎంతటి మర్యాద ఇస్తారన్న దానికి సదరు వీడియో ఒక నిదర్శనంగా చెబుతుంటారు. అయితే.. కొన్ని అంశాల్లో చోటు చేసుకునే పరిణామాలు కొత్త చర్చకు తెర తీస్తున్నాయి. అందులో ముఖ్యమైనది..కొన్ని కీలక భేటీలకు చంద్రబాబు తనతో పవన్ కల్యాణ్ ను ఎందుకు తీసుకెళ్లటం లేదన్నది ప్రశ్నగా మారింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విషయానికి వస్తే.. ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసేందుకు వెళ్లే వేళలోనూ తన డిప్యూటీ ముఖ్యమంత్రిని తనతో తీసుకెళుతున్నారు. అంతెందుకు.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ సందర్భంలోనూ ఉప ముఖ్యమంత్రి భట్టిని తనతో కూర్చోబెట్టుకోవటం చూశాం.

అయితే.. ఇదే భేటీలో చంద్రబాబు వెంట పవన్ కల్యాణ్ లేకపోవటాన్ని పలువురు ప్రస్తావించటంతో పాటు.. ఎందుకిలా? జరుగుతోందన్న చర్చ మొదలైంది. అయితే.. రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ ఇంట జరిగిన పెళ్లికి బాబుతో పాటు పవన్ వెళ్లటంతో ఈ చర్చకు తాత్కాలికంగా పుల్ స్టాప్ పడింది.

తాజాగా ఢిల్లీకి వెళ్లిన సీఎం చంద్రబాబు.. మంత్రుల్లో పయ్యావులు కేశవ్ తో పాటు మరికొందరిని వెంట తీసుకెళ్లారు సరే.. జనసేనాని పవన్ ను ఎందుకు వెంట తీసుకెళ్లలేదన్న ప్రశ్న మళ్లీ తెర మీదకు వచ్చింది. దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబు.. కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా బాబుతో పవన్ లేకపోవటాన్ని పలువురు ప్రస్తావిస్తున్నారు. అంతేకాదు.. ఇలాంటి నిర్ణయాలు రాబోయే రోజుల్లో ఇద్దరి మధ్య గ్యాప్ కు బీజాలు పడే వీలుందంటున్నారు. ఈ అంశంలో చంద్రబాబు కేర్ ఫుల్ గా ఉండాలంటున్నారు. ఒకవేళ అలాంటి వాదనలపై ఏదైనా సమాధానం ఉంటే..అధినేతలు క్లారిటీ ఇస్తే.. అనవసర చర్చకు తెర పడే వీలుంది.

Tags:    

Similar News