కేసీఆర్ దీక్షా దివస్ స్ఫూర్తితో సంకల్ప దీక్షలు.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

మరో సంకల్ప దీక్ష చేపట్టాల్సిన అవసరం ఉందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-11-24 08:30 GMT

నాటి తెలంగాణ కల.. మలిదశ ఉద్యమం.. సాధించిన తీరును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మరోసారి గుర్తుచేసుకున్నారు. అప్పటి ఉద్యమ స్మృతులను మీడియా ముఖంగా పంచుకున్నారు. మరో సంకల్ప దీక్ష చేపట్టాల్సిన అవసరం ఉందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.

2009, నవంబర్ 29న కేసీఆర్ నిరాహార దీక్ష ఉద్యమాన్ని మలుపుతిప్పిన రోజు అని కేటీఆర్ అన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ఏప్రిల్ 27, 2001న గులాబీ జెండాను ఎగరేసిన నాయకుడు కేసీఆర్ అని చెప్పుకొచ్చారు. 60 ఏళ్ల తెలంగాణ ఉద్యమ చరిత్రపై చెరిగిపోని సంతకం కేసీఆర్ అని.. మహానాయకుడు కేసీఆర్ అని పేర్కొన్నారు. అందుకే.. నవంబర్ 29, 2009ను తెలంగాణ రాష్ట్ర కల సాకారానికి పునాది వేసిన రోజుగా అభివర్ణించారు. ఆ సమయంలో 3 కోట్ల తెలంగాణ ప్రజలు తమ రాష్ట్రం తమకు కావాలని నినదించారని అన్నారు.

అలాగే.. కేసీఆర్ సచ్చుడే తెలంగాణ వచ్చుడో అన్న తెగువను ప్రదర్శించిన రోజది. ఈ నినాదంతో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ కదిలించిన సందర్భం దీక్షా దివస్ అని పేర్కొన్నారు. కేసీఆర్ స్ఫూర్తితో మళ్లీ కేంద్ర పార్టీల మెడలు వంచాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. స్వీయ రాజకీయ అస్తిత్వమే శ్రీరామ రక్ష అని అభిప్రాయపడ్డారు. అందుకే.. నవంబర్ 29న 33 జిల్లాల్లో పార్టీ కార్యాలయాల్లో పెద్ద ఎత్తున దీక్ష దివస్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కేసీఆర్ నాయకత్వం ఉద్యమంతోపాటు పరిపాలనలోనూ చెరగని ముద్ర వేసిందని కేటీఆర్ చెప్పుకొచ్చారు. 26న సన్నాహక సమావేశాలు ఉంటాయని, 29న నిమ్స్‌లో అన్నదానం ఉంటుందని పేర్కొన్నారు.

కాంగ్రెస్ వైఫల్యాలు ప్రజల్లోకి తీసుకెళ్లేలా కార్యాచరణ రూపొందిస్తున్నట్లుగానూ కేటీఆర్ పేర్కొన్నారు. అందులో భాగంగానే ఈనెల 29న దీక్షా దివస్‌ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాన్ని పార్టీ శ్రేణులు కదంతొక్కి విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. నవంబర్ 29న దీక్షా దివస్ చేపట్టి డిసెంబర్ 9న మేడ్చల్‌లో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణతో ముగిస్తామని వెల్లడించారు. తెలంగాణ తల్లికి ప్రణమిల్లుతూ ఈ ఉత్సవాలు జరుపుతామని, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రతీ నాయకుడూ భాగస్వామ్యులు కావాలని కోరారు.

Tags:    

Similar News