రిచెస్ట్ పార్టీ బీఆర్ఎస్.. పూరెస్ట్ పార్టీ వైసీపీ..

ఈ మేరకు ఏ పార్టీ వద్ద ఎన్ని విరాళాలు ఉన్నాయి..? ఏ పార్టీ గత ఎన్నికల్లో ఎంత ఖర్చు చేసింది..? తదితర వివరాలన్నింటినీ తన అధికారిక వెబ్‌సైట్‌లో పెట్టారు.

Update: 2024-11-24 06:01 GMT

దేశంలోని రాజకీయ పార్టీలు సేకరిస్తున్న విరాళాలు, ఖర్చుల వివరాలను ఏటా భారత ఎన్నికల సంఘానికి సమర్పించాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా గత లోక్‌సభ ఎన్నికల్లో ఖర్చు చేసిన వివరాలను ఇటీవల అన్ని రాజకీయ పార్టీలు కేంద్ర ఎన్నికల సంఘానికి అందించాయి. ఆయా పార్టీలు అందించిన ఆడిట్ లెక్కలను ఈసీ పరిశీలించింది. ఈ మేరకు ఏ పార్టీ వద్ద ఎన్ని విరాళాలు ఉన్నాయి..? ఏ పార్టీ గత ఎన్నికల్లో ఎంత ఖర్చు చేసింది..? తదితర వివరాలన్నింటినీ తన అధికారిక వెబ్‌సైట్‌లో పెట్టారు.

దేశంలో జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ వద్ద భారీగా నిధులు ఉండడం సహజం. అయితే.. బీజేపీ ఎప్పటి నుంచో ఈ విషయంలో టాప్ ప్లేసులో కొనసాగుతూనే ఉంది. దేశవ్యాప్తంగా ఆ పార్టీకి వస్తున్న విరాళాలతో ఆ పార్టీ వద్ద వేల కోట్ల నిధులు ఉన్నాయి. అయితే.. ప్రాంతీయ పార్టీలకు వచ్చే సరికి ఏ పార్టీ వద్ద డబ్బులు ఎక్కువగా ఉన్నాయో అంచనా వేయలేం. ఎందుకంటే దేశంలో వేల సంఖ్యలో ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. ఒక్కో రాష్ట్రంలో నాలుగైదు ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి.

అయితే.. తాజాగా ఎన్నికల సంఘానికి ఆడిట్ లెక్కల సమర్పించగా.. అందులో ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. తెలంగాణలోని బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్‌టాపిక్ అయింది. దేశంలోనే అత్యధిక నిధులు ఉన్న పార్టీగా బీఆర్ఎస్ ఘనత సాధించింది. ఇదే విషయాన్ని తన ఆడిట్ లెక్కల్లో చూపించింది. ఈ లెక్కల ప్రకారం ఏ ప్రాంతీయ పార్టీ కూడా బీఆర్ఎస్‌కు కనీసం దరిదాపుల్లో కూడా లేవు. ఏ పార్టీ వద్ద కూడా రూ.500 కోట్ల బ్యాంక్ బ్యాలెన్స్ కూడా లేదు.

ఈసీకి అందించిన నివేదిక ప్రకారం బీఆర్ఎస్ వద్ద ప్రస్తుతం రూ.1,449 కోట్ల నిధులు ఉన్నాయి. ఈ నిధులన్నీ ఇప్పుడు ఆ పార్టీ ఖాతాలోనే ఉన్నాయి. దీంతో ఆ పార్టీనే దేశంలోని ప్రాంతీయ పార్టీల్లో రిచెస్ట్ పార్టీగా నిలిచింది. ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికలు ప్రారంభం అయ్యే సమయంలో బీఆర్ఎస్ ఖాతాలో రూ.1,519 కోట్లు ఉన్నాయని వెల్లడించింది. ఎన్నికల ప్రకటనలోగా మరో రూ.47.56 కోట్ల విరాళాలు వచ్చాయి. ఇక.. ప్రచార ఖర్చు కోసం రూ.120 కోట్లు ఖర్చు చేసింది. ఎన్నికల ప్రచార సామగ్రి కోసం రూ.34.68 కోట్లు, బహిరంగ సభలు, ఊరేగింపులు, ర్యాలీల కోసం రూ.20.37 కోట్లు ఖర్చు చేసింది. ఇతర ప్రచారాల కోసం రూ.34.39 కోట్లు వ్యయం చేసింది. ఇక 17 లోక్‌సభ స్థానాల్లోని అభ్యర్థులకు ఒక్కో అభ్యర్థికి రూ.95 లక్షల చొప్పున రూ.16.15 కోట్లు ఫండింగ్ ఇచ్చింది.

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ముఖ్యంగా బీఆర్ఎస్, టీడీపీ, వైసీపీలు ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. అయితే.. బీఆర్ఎస్ ఇంత పెద్ద మొత్తంలో నిధులు ఉన్నప్పుడు ఆయా పార్టీల వద్ద కూడా నిధులు బాగానే ఉండొచ్చని అందరం అనుకుంటాం. టీడీపీ పరిస్థితి ఏమో కానీ వైసీపీ దుస్థితి మాత్రం అధ్వానంగా ఉంది. దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ టాప్ ప్లేసులో ఉంటే.. తర్వాతి స్థానంలో సమాజ్ వాదీ పార్టీ రూ.340 కోట్లతో ఉంది. తమిళనాడు అధికార పార్టీ డీఎంకే రూ.338 కోట్లతో ఆ తరువాతి స్థానంలో ఉంది. ఇక.. ఏపీలోని తెలుగుదేశం పార్టీ రూ.272 కోట్ల నగదు నిల్వ కలిగి ఉంది. అయితే.. ఇక్కడ మరో ఆస్తికర విషయం ఏంటంటే.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వద్ద కేవలం రూ.27 కోట్లు మాత్రమే ఉండడం గమనార్హం. ఐదేళ్లపాటు అధికారంలో ఉన్న వైసీపీకి ఇంత తక్కువ మొత్తంలో నిధులు ఉండడం ఆశ్చర్యం కలిగించింది. దేశవ్యాప్తంగా ఎన్నో ఆరోపణలు ఎదుర్కొన్న వైసీపీ వద్ద ఈ స్థాయి నిధులు ఉండడాన్ని ఎవరూ ఊహించలేకపోయారు.

Tags:    

Similar News