లోటు బడ్జెట్...జర జాగ్రత్త !

ప్రధానంగా లోటు బడ్జెట్ ఏపీకి ఉందని దానిని గ్రహించి మంత్రులు పనిచేయాలని బాబు ఒక రకంగా విలువైన సూచనలు చేశారు.

Update: 2024-07-16 15:39 GMT

ఏపీలో ఆదాయం అంతంతమాత్రం అని అందరికీ తెలిసిందే. ఖజానాకి పెద్ద చిల్లు పడింది. అప్పులు చూస్తే దాదాపుగా పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో అడుగు తీసి అడుగు వేయడమే కష్టంగా మారింది. అయితే చంద్రబాబు లాంటి సీనియర్ మోస్ట్ సీఎం గా ఉన్నారు కాబట్టి పరిస్థితి ఎప్పటికైనా దారికి వస్తుందని అందరి ఆశగా ఉంది.

ఇదిలా ఉండగా మంత్రిమండలి సమావేశాన్ని నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సందర్భంగా కొన్ని విషయాలలో దిశా నిర్దేశం చేసినట్లుగా తెలిసింది. మంత్రులు ఎలా వ్యవహరించాలి ఏమి చేయాలి ఏమి చేయకూడదు అన్న దాని మీద చంద్రబాబు చెప్పాల్సినవి అన్నీ చెప్పారు.

ప్రధానంగా లోటు బడ్జెట్ ఏపీకి ఉందని దానిని గ్రహించి మంత్రులు పనిచేయాలని బాబు ఒక రకంగా విలువైన సూచనలు చేశారు. ఎందుకంటే ఏపీలో నిధులకు కొరత ఉంది. మంత్రులు శాఖాపరంగా చేయాల్సినవి చాలా ఉన్నాయి. అయితే పనితీరు చూపించుకోవాలీ అంటే అన్నీ నిధులతో అవసరం లేదు. చాలా అంశాలు నిధులు లేకుండానూ చేయవచ్చు.

మంచి గవర్నెన్స్ ఇవ్వడానికి తమ శాఖలలో ఎప్పటికపుడు సమీక్షలు నిర్వహించడం ప్రస్తుతం జరుగుతున్న పనులను ఎప్పటికపుడు రివ్యూ చేసుకుంటూ ముందుకు సాగడం వంటివి చేయవచ్చు. ఇక తరచూ పర్యటనలు చేయడం కూడా వారి విచక్షత మీదనే ఉంది. అవసరం అనుకుంటే ఒకేసారి నాలుగు పనులూ చక్కబెట్టుకోవాలి అనుకుంటే పర్యటన చేయవచ్చు అని అంటున్నారు.

అదే విధంగా తమ క్యాంప్ ఆఫీసులతో పాటు తమ ఖర్చులకు బడ్జెట్ విషయంలోనూ పొదుపు పాటిస్తే ప్రభుత్వానికి ఈ కీలక సమయంలో మేలు అని అంటున్నారు. అదే విషయం చంద్రబాబు గుర్తు చేసారు అని అంటున్నారు.

ఇక ఉచిత ఇసుక విషయంలో మంత్రుల జోక్యం వద్దు అని ఖరాఖండీగా బాబు చెప్పేసారు. ఇసుక వల్ల ఎంతలా అప్రతిష్ట వైసీపీ మూటకట్టుకుందో అందరికీ తెలిసిందే. అందుకే బాబు వారిని ఆ విధంగా కోరారు అని అంటున్నారు.

ఇక శాఖాపరంగా పట్టు పెంచుకోవాలని కనీసం నెలకు ఒకసారి అయినా తమ తమ శాఖలలో సంపూర్ణమైన రివ్యూ నిర్వహించాలని కూడా బాబు కోరారని అంటున్నారు. మొత్తం మీద ఏపీ లోటులో ఉంది అని బాబు పదే పదే చెబుతున్నారు. ఆయన మీడియా ముందు చెబుతున్నారు. ఢిల్లీకి వెళ్ళి కేంద్ర పెద్దలను కలసినపుడు చెబుతున్నారు. అధికారుల సమావేశంలో చెబుతున్నారు. పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇస్తూ చెబుతున్నారు ఇపుడు మంత్రులకు కూడా చెబుతున్నారు.మరి దీనిని గమనించి మంత్రులు అంతా జాగ్రత్త వహించాలి అన్నదే ప్రభుత్వ ఉద్దేశంగా కనిపిస్తోంది అని అంటున్నారు.

Tags:    

Similar News