బాబు వీక్ నెస్...వారితోనే టీడీపీకి తంటా...?

కానీ చంద్రబాబు మాత్రం అలా కాదు. తన మనసుకు నచ్చిన వారిని ఓడినా చేరదీస్తారు

Update: 2023-08-02 02:45 GMT

చంద్రబాబునాయుడుకు మొహమాటాలు ఎక్కువ. ఆయన మాటలలో ఎవరినీ ఉపేక్షించను అంటారు కానీ తీరా ఆచరణలోకి వచ్చేసరికి మాత్రం క్షమించేసి వారికే అన్నీ ఇస్తూ ఉంటారు. బాబు నైజం కనిపెట్టిన చాలా మంది నేతలు పార్టీ విడిచి వెళ్ళి మళ్లీ వచ్చి పెత్తనం చేస్తున్నారు. అలాగే టీడీపీలో గెలుపు అన్న దానిని మరచిపోయిన నేతలు కూడా ఇప్పటికీ బాబుని అడ్డం పెట్టుకుని చక్రం తిప్పుతున్నారు.

అలాంటి వారిని పక్కన పెట్టుకుంటే 2024లో పార్టీకి విజయం ఎలా దక్కుతుంది బాబు గారూ అని అంటున్నారు కొత్త తరం తమ్ముళ్ళు. ఒక వైపు బలమైన మరో ప్రాంతీయ పక్షంగా వైసీపీ ఉంది. దాని అధినాయకుడు జగన్ అయితే మొమహాటాలు అన్నవి అసలు లేవు అనేస్తున్నారు టికెట్ కోసం ఆయన సర్వేలను ఇతరత్రా నమ్ముకుని అన్నీ కుదిరితేనే ఇస్తున్నారు.

కానీ చంద్రబాబు మాత్రం అలా కాదు. తన మనసుకు నచ్చిన వారిని ఓడినా చేరదీస్తారు. అలా చూసుకుంటే 2004 నుంచి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో కీలకమైన నియోజకవర్గంగా ఉంటున్న తునిలో యనమల ఫ్యామిలీ అయిదు సార్లు ఓడింది. యనమల 2004లో ఓడితే ఆయన తమ్ముడు క్రిష్ణుడు 2009, 2014, 2019లలో మూడు సార్లు ఓడారు. అయినా యనమల హవా అయితే గోదావరి జిల్లాలలో తగ్గలేదు.

మరోసారి ఆ కుటుంబానికే తుని టికెట్ అని అంటున్నారు. దీంతో ఆశావహులు ఇలా అయితే ఎలా సారూ అని పెదవి విరుస్తున్నారుట. ఇక యనమలకు 2025 వరకూ ఎమ్మెల్సీ పదవి ఉంది. 2024లో టీడీపీ అధికారంలోకి వస్తే ఆయనే మరోసారి ఆర్ధిక మంత్రి అని కూడా వినిపిస్తున్న మాట. ఇదే తీరున నెల్లూరు జిల్లాలో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హవా చలాయిస్తున్నారు అని అంటున్నారు. ఆయన కూడా వరసబెట్టి అయిదుసార్లు ఓటమి పాలు అయ్యారు.

ఆయన 2004 నుంచి ఇప్పటిదాకా తన సర్వేపల్లి నియోజకవర్గంలో గెలిచింది లేదు. అయినా చంద్రబాబు 2014లో అధికారంలోకి వస్తే ఆయన్ని ఎమ్మెల్సీని చేసి మరీ మంత్రిగా నియమించారు. ఇపుడు కూడా ఆయనకే నెల్లూరు జిల్లా పెత్తనం అప్పగించారు అని తమ్ముళ్ళు సణుగుతున్నారు. వచ్చే ఎన్నికల్లో మరోసారి సోమిరెడ్డికి టికెట్ ఖాయమని, పార్టీ అధికారంలోకి వస్తే మంత్రి పదవీ ఖాయమని అంటున్నారు.

ఇంకో వైపు ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడు కూడా పార్టీని శాసిస్తున్నారు. ఆ మధ్యన పార్టీ లేదు బొక్కా లేదు అన్న నోట్లోనే ఆయన ఇపుడు తెగ పొగుడుతున్నారు. ఇక ఆయన ఇంట్లో ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ ఉన్నారు. ఈసారి కూడా ఉన్న టికెట్లకు అదనంగానే టికెట్లు తీసుకుంటారేమో కానీ ఈ సంఖ్య తగ్గదని అంటున్నారు.

అదే విధంగా చూసుకుంటే ఇదే మాదిరిగా సీనియర్లుగా చెప్పుకునే కీలక నేతలు కొందరు టీడీపీలో ఈ రోజుకీ చక్రం తిప్పుతున్నారు అని అంటున్నారు. వీరిని ఎవరైనా ఎదిరిస్తే క్రమశిక్షణా చర్యల పేరిట వారి మీద యాక్షన్ స్టార్ట్ అవుతుందని. అంతలా అధినాయకత్వానికి చేరువ అయ్యారని ప్రచారం సాగుతోంది.

ఈసారి కాకపోతే మరెప్పుడూ టీడీపీని గెలిపించలేమని భావించి లోకేష్ ఒక వైపు పాదయాత్ర చేస్తూంటే చంద్రబాబు జిల్లాల టూర్లు చేస్తున్నారు. పార్టీ గెలుపు కోసం అంతలా కష్టపడుతుంటే యువ రక్తాన్ని కొత్త వారిని కూడా ప్రోత్సహిస్తే పార్టీకి మేలు జరుగుతుంది తప్ప సీనియర్ల పేరుతో కొందరికే అందలం అంటే పార్టీలోని ఆశావహులు ఆందోళన చెందుతారు అని అంటున్నారు.

Tags:    

Similar News