‘స్మైల్ ప్లీజ్’.. తొలిసారిగా విక్రమ్ ను ఫొటో తీసిన రోవర్!
14 రోజుల పాటు చంద్రుడి ఉపరితలాన్ని ప్రజ్ఞాన్ రోవర్ పరిశోధించనుంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఏడు రోజులు పూర్తయ్యాయి
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రయోగించిన చంద్రయాన్-3 సూపర్ సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. అనుకున్నట్టుగానే ఆగస్టు 23న ల్యాండర్.. అందులో నుంచి రోవర్ చంద్రుడి దక్షిణ ధ్రువంపై కాలు మోపాయి.
ఇప్పటికే రోవర్ తన పని మొదలుపెట్టేసింది. ఇందులో భాగంగా చంద్రుడిపై రోవర్ లోని లేజర్-ప్రేరిత బ్రేక్‌డౌన్ స్పెక్ట్రోస్కోప్ (LIBS ) పరికరం దక్షిణ ధ్రువంలోని చంద్రుడి ఉపరితలంపై సల్ఫర్ (S) ఉనికి పుష్కలంగా ఉన్నట్లు గుర్తించింది. అలాగే చంద్రుడిపై ఆక్సిజన్ ఆనవాళ్లు కూడా పుష్కలంగా ఉన్నటు నిర్ధారించింది. అదేవిధంగా క్రోమియం (Cr), టైటానియం (Ti), కాల్షియం (Ca), మాంగనీస్ (Mn), సిలికాన్ (Si), అల్యూమినియం (Al ), ఇనుము (Fe) వంటి మరికొన్ని ఖనిజాలు కూడా ఉన్నట్లు వెల్లడించింది. హైడ్రోజన్ కోసం ఇంకా రోవర్ పరిశోధిస్తోంది.
14 రోజుల పాటు చంద్రుడి ఉపరితలాన్ని ప్రజ్ఞాన్ రోవర్ పరిశోధించనుంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఏడు రోజులు పూర్తయ్యాయి. మరో ఏడు రోజులు సమయం మాత్రమే మిగిలి ఉంది. రోవర్ పరిశీలించిన విశ్లేషణను ఇస్రో ఎప్పటికప్పుడు విడుదల చేస్తోంది. అలాగే అక్కడ రోవర్ తీసిన చిత్రాలను కూడా షేర్ చేస్తోంది.
ఈ నేపథ్యంలో రోవర్.. తొలిసారి విక్రమ్ ల్యాండర్ ఫొటోలు తీసింది. ఆగస్టు 30 బుధవారం ఉదయం 7.35 గంటలకు రోవర్ నావిగేషన్ కెమెరా ఈ ఫోటోలు తీసింది. ఇస్రో ఈ మేరకు ట్వీట్ చేసింది. 'స్మైల్ ప్లీజ్' అంటూ రోవర్.. ల్యాండర్ ను ఫొటో తీసిందంటూ సరదాగా రాసుకొచ్చింది.
'ఈ రోజు ఉదయం విక్రమ్ ల్యాండర్ ను రోవర్ ఫొటోలు తీసింది. రోవర్ కు అమర్చిన నావిగేషన్ కెమెరాలు ఈ ఫొటోలు తీశాయి' అని ఇస్రో తన ట్వీట్ లో పేర్కొంది. రోవర్ లో వాడిన కెమెరాలను బెంగుళూరులోని ఎలక్ట్రో–ఆప్టిక్స్ సిస్టమ్స్ ల్యాబ్‌లో తయారు చేశారని తెలిపింది.
ఈ మేరకు రోవర్.. ల్యాండర్ ను తీసిన ఫొటో ఇస్రో షేర్ చేయగానే అది వైరల్ గా మారింది. సోషల్ మీడియాలో నెటిజన్లు దానికి లైకులు, షేర్లతో హోరెత్తిస్తున్నారు.