చంద్రయాన్‌ - 3: భారత్‌ మరో రికార్డు!

చంద్రుడి దక్షిణ ధ్రువంపైన ల్యాండర్‌ ను దింపిన తొలి దేశంగా, చంద్రుడి ఉపరితలంపైన ల్యాండర్‌ ను దింపిన నాలుగో దేశంగా భారత్‌ రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే.

Update: 2023-09-04 09:45 GMT

చంద్రుడి దక్షిణ ధ్రువంపైన ల్యాండర్‌ ను దింపిన తొలి దేశంగా, చంద్రుడి ఉపరితలంపైన ల్యాండర్‌ ను దింపిన నాలుగో దేశంగా భారత్‌ రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా చంద్రుడిపై ల్యాండర్, ఆ తర్వాత కొన్ని గంటలకు దాని నుంచి రోవర్‌ బయటకు వచ్చాయి. ఆగస్టు 23న చంద్రుడిపైన దిగిన రోవర్‌ అనేక చిత్రాలను తీసి భూమికి పంపింది.

భూమి కాలమానం ప్రకారం.. మొత్తం చంద్రుడిపైన 14 రోజులు ఉండే రోవర్‌ కు సెప్టెంబర్‌ 4తో 14 రోజులు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో ల్యాండర్, రోవర్‌ ను ఇస్రో విశ్రాంతికి సిద్ధం చేసింది. ఇందులో భాగంగా తొలుత రోవర్‌ ను నిద్రాణ స్థితిలోకి పంపేసినట్లు సెప్టెంబర్‌ 2న ఇస్రో వెల్లడించిన సంగతి తెలిసిందే.

మళ్లీ సెప్టెంబర్‌ 22న చంద్రుడి ఉపరితలంపైన శివశక్తి పాయింట్‌ వద్ద సూర్యోదమవుతోందని, ఆ రోజున సూర్యకాంతిని అందుకునేలా రోవర్‌ ఫలకం దృక్కోణాన్ని మార్చినట్లు ఇస్రో వెల్లడించింది. దాని రిసీవర్‌ ను ఆన్‌ చేసినట్లు తెలిపింది. ఆ రోజు అది క్రియాశీలకం కాకుంటే.. చంద్ర మండలంపై ఎప్పటికీ ఉండిపోతుందని పేర్కొంది.

కాగా ఈ నేపథ్యంలో మరోసారి ల్యాండర్‌ ను చంద్రుడి ఉపరితలంపైన కొత్త ఎత్తుకు పైకి లేపి మళ్లీ సురక్షితంగా దిగే ప్రక్రియను చేపట్టగా విక్రమ్‌ ల్యాండర్‌ చంద్రుడి ఉపరితలంపైన మరోసారి సురక్షితంగా దిగిందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) వెల్లడించింది.

చంద్రయాన్‌–3 మిషన్‌ కోసం నిర్దేశించిన లక్ష్యాలను మించి విక్రమ్‌ ల్యాండర్‌ పనితీరును ప్రదర్శించిందని తెలిపింది. అది విజయవంతంగా ఇప్పటికే సగం పనిని పూర్తి చేసుకుందని పేర్కొంది. తాము ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా ల్యాండర్‌ తన ఇంజిన్లను మండించిందని ఇస్రో వివరించింది.

తాము అనుకున్న విధంగా 40 సెం.మీ గాల్లోకి లేచి, 30 నుంచి 40 సెం.మీ దూరంలో సురక్షితంగా ల్యాండర్‌ చంద్రుడిపై దిగిందని ఇస్రో వెల్లడించింది. జాబిల్లిపై నమూనాలను భూమి మీదకు తీసుకురావడానికి, మానవ సహిత యాత్రల విషయంలో ఇది మనకు ప్రోత్సాహాన్నిస్తుందని తెలిపింది. ఈ ల్యాండింగ్‌ తర్వాత కూడా అన్ని వ్యవస్థలు సక్రమంగా పనిచేస్తున్నాయి అని వివరించింది. ఈ మేరకు ఇస్రో ట్వీట్‌ చేసింది.

Tags:    

Similar News