లైట్‌గా కేటీఆర్‌లో మార్పు వ‌చ్చేస్తోందేంటి చెప్మా!

ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న కేటీఆర్, త‌న మేన‌బావ‌, పార్టీ ముఖ్య‌నేత హ‌రీశ్ రావుతో క‌లిసి మీడియాతో మాట్లాడారు

Update: 2024-07-09 23:30 GMT

బీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, తెలంగాణ మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న‌యుడు కేటీఆర్... త‌మ పార్టీ గురించి , ప‌రిపాల‌న గురించి వెల్ల‌డించే తీరును రాజ‌కీయాల ప‌ట్ల అవ‌గాహ‌న ఉన్న‌వారికి ప‌రిచ‌యం చేయ‌న‌క్క‌ర్లేదు. ప‌రిపాల‌న ప‌రంగా ఆయ‌న ఒక ప్ర‌త్యేక‌మైన ముద్ర సాధించ‌గా... వ్యక్తిగ‌తంగా మ‌రో ర‌క‌మైన `ఇమేజ్‌` సొంతం చేసుకున్నారు. వివిధ సంద‌ర్భాల్లో దీనిపై చ‌ర్చ‌లు జ‌రిగిన‌ప్ప‌టికీ దానిని ఆయ‌న తోచిపుచ్చేవారు. అయితే, తాజాగా త‌మ విధానాల‌పై కేటీఆర్ క్లారిటీ ఇచ్చారు. అయితే, ఈ ద‌ఫా ఆయ‌న వినిపించిన దాంట్లో తేడా సుస్ప‌ష్టంగా ఉందంటున్నారు.

ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న కేటీఆర్, త‌న మేన‌బావ‌, పార్టీ ముఖ్య‌నేత హ‌రీశ్ రావుతో క‌లిసి మీడియాతో మాట్లాడారు. అనంత‌రం వారితోనే ఇష్టాగోష్టిగా ముచ్చ‌టించారు. ఈ సంద‌ర్భంగా కేటీఆర్ ప‌లు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఈ చిట్ చాట్ సంద‌ర్భంగా ప్రజలతో త‌మకు గ్యాప్ వచ్చిందని కేటీఆర్ అంగీక‌రించారు. ఓట‌మి విష‌యంలో ప్రజలది తప్పు అనడమంటే..త‌మ‌దే తప్పు అవుతుంద‌ని అన్నారు. త‌మ వైఖరి మార్చుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. త‌మ విష‌యంలో జ‌రిగిన త‌ప్పుడు ప్ర‌చారం కూడా ఒక కార‌ణ‌మ‌ని అన్నారు.

తాము చేసిన అభివృద్ధిని స‌రిగా చెప్పుకోలేదని కేటీఆర్‌ వెల్ల‌డించారు. ఇందుకు హైదారాబాద్ లో అన్ని సీట్లు గెల‌వ‌డ‌మే సాక్ష్య‌మ‌ని అన్నారు. పార్టీ పేరులో తెలంగాణను తొల‌గించి బీఆర్ఎస్ అనే పేరు మార్చడం వల్ల ఓడిపోయామనడానికి ఆధారం లేదని కేటీఆర్ తెలిపారు. త‌మకు అహంకారం ఉందని కృత్రిమంగా సృష్టించారని కేటీఆర్ ఆవేద‌న వ్యక్తం చేశారు. ఆత్మవిశ్వాసం, అహంకారానికి తేడా కొంద‌రికి తెలియదని పేర్కొన్న కేటీఆర్... అభివృద్ధిలో త‌మతో పోటీ పడలేని వారే అహంకారం అని ప్రచారం చేశారని వ్యాఖ్యానించారు. డ‌బ్బు సంచులతో దొరికినవాడు సీఎం అయ్యాడ‌ని ఈ సంద‌ర్భంగా రేవంత్ రెడ్డిపై కేటీఆర్ మండిప‌డ్డారు.

ఈ సంద‌ర్భంగానే ఏపీలో ఎన్నిక‌ల విష‌యంలో కేటీఆర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. పేదలకు పెద్ద ఎత్తున పథకాలు ఇచ్చినప్ప‌టికీ, జగన్ ఓడిపోవడం ఆశ్చర్యం కలిగించింద‌ని కేటీఆర్ తెలిపారు. జ‌గ‌న్ ఓడిపోయిన‌ప్పటికీ, 40 శాతం ఓట్లు సాధించడం మాములు విషయం కాద‌ని విశ్లేషించారు. పవన్ క‌ళ్యాణ్ పొత్తు పెట్టుకోకుండా, సొంతంగా పోటీ చేసి ఉంటే ఫలితాలు మరో విధంగా ఉండేవని కేటీఆర్ అభిప్రాయ‌ప‌డ్డారు. ప్రతిరోజూ జనంలోకి వెళ్ళే కేతిరెడ్డి ఓడిపోవడం ఆశ్చ‌ర్యం క‌లిగించింద‌ని తెలిపారు. జగన్ ను ఓడించేందుకు షర్మిల ను ఒక వస్తువులా ఉపయోగించారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. అంతకు మించి షర్మిల చేసిందేమీ లేద‌ని కేటీఆర్ పేర్కొన్నారు.

Tags:    

Similar News