ఎన్నిక‌ల వేళ‌కు.. అంద‌రినీ తిప్పుకునేలా!

ఈ సారి కూడా ఎలాగైనా విజ‌యం సాధించి మూడోసారి సీఎంగా ప్ర‌మాణ స్వీకారం చేయాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉన్న కేసీఆర్ అందుకు త‌గ్గ‌ట్లుగా క‌స‌ర‌త్త‌లు చేస్తున్నారు

Update: 2023-08-05 15:30 GMT

అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల సంక్షేమం కోసం హామీలు.. చ‌ర్య‌లు.. పార్టీలోని నేత‌ల‌కు టికెట్ల విష‌యంలో స్ప‌ష్ట‌త‌.. అసంతృప్తి నేత‌ల బుజ్జ‌గింపులు.. ఇప్పుడు తెలంగాణలోని అధికార బీఆర్ఎస్ చేస్తుంది ఇదే. ఎన్నిక‌ల ఏడాదిలో బీఆర్ఎస్ జోరు ప్ర‌ద‌ర్శిస్తోంది. ఈ సారి కూడా ఎలాగైనా విజ‌యం సాధించి.. మూడోసారి సీఎంగా ప్ర‌మాణ స్వీకారం చేయాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉన్న కేసీఆర్ అందుకు త‌గ్గ‌ట్లుగా క‌స‌ర‌త్త‌లు చేస్తున్నారు. ఒక్కో వ‌ర్గాన్ని త‌న‌వైపు తిప్పుకుంటూ.. ప్ర‌త్య‌ర్థుల‌కు ఎలాంటి అవ‌కాశం ఇవ్వ‌కుండా చెక్ పెడుతున్నార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై ప్ర‌శ్నిస్తూ కేసీఆర్ ప్ర‌భుత్వాన్ని ఇర‌కాటంలో పెట్టాల‌ని విప‌క్ష పార్టీలు ప్రయ‌త్నిస్తున్నాయి. కానీ ఎప్ప‌టిక‌ప్పుడూ త‌న‌దైన ప్ర‌ణాళిక‌ల‌తో సాగుతున్న కేసీఆర్‌.. విప‌క్షాల చేతికి ఏ అస్త్రం దొర‌క‌కూడ‌ద‌ని జాగ్ర‌త్త‌ప‌డుతున్న‌ట్లే క‌నిపిస్తున్నారు. మొద‌ట నిరుద్యోగుల కోసం ప్ర‌త్య‌ర్థి పార్టీలు నోరెత్తాయి. వ‌రుస‌గా నోటిఫికేష‌న్లు, రిక్రూట్‌మెంట్ల‌తో కేసీఆర్ ఆ ఇబ్బందిని దాటారు. ఆపై దివ్యాంగుల పెన్ష‌న్‌ను రూ.3,016 నుంచి రూ.4,016కు పెంచారు. ఇత‌ర ఆస‌రా ఫించ‌న్ల‌ను కూడా పెంచుతార‌నే ప్ర‌చారం సాగుతోంది.

మ‌రోవైపు జూనియ‌ర్ పంచాయ‌తీ కార్య‌ద‌ర్శుల‌ను క్ర‌మ‌బ‌ద్ధీక‌రించాల‌ని నిర్ణ‌యించారు. వీఆర్ఏల స‌మ‌స్య‌ల‌ను తీర్చి ఇత‌ర ప్ర‌భుత్వ శాఖ‌ల్లో స‌ర్దుబాటు చేసేందుకు ఉత్త‌ర్వులు ఇచ్చారు. తాజాగా ఆర్టీసీని ప్ర‌భుత్వంలో విలీనం చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. ఇక మొన్న‌టివ‌ర‌కూ రైతు రుణ‌మాఫీ అంశంపై ప్ర‌త్య‌ర్థి పార్టీలు గొడ‌వ చేశాయి. ఇప్పుడు రుణ‌మాఫీని పూర్తిస్థాయిలో అమ‌లు చేయాల‌ని కేసీఆర్ నిర్ణ‌యించారు. ప్ర‌భుత్వ ఉద్యోగాల డిమాండ్ల‌పైనా ఇప్పుడు కేసీఆర్ దృష్టి సారించిన‌ట్లు తెలుస్తోంది. పీఆర్‌సీపై క‌మిష‌న్ ఏర్పాటు, మ‌ధ్యంత‌ర భృతి త్వ‌ర‌లోనే ప్ర‌క‌టించ‌డం త‌దిత‌ర విష‌యాల గురించి సీఎంను ఉద్యోగ సంఘాల నేత‌లు క‌లిశారు. ఈ సంద‌ర్భంగా సీఎం సానుకూలంగా స్పందించారు. ఇలా ఒక్కొక్క వ‌ర్గాన్ని త‌న‌వైపు తిప్పుకుంటూ పోతున్న కేసీఆర్‌.. మూడోసారి అధికార పీఠం ఎక్క‌డం ఖాయ‌మ‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు.

Tags:    

Similar News