లడ్డూ ప్రసాదం వివాదం.. స్పందించిన చిలుకూరు అర్చకులు
తాజాగా.. చిలుకూరు బాలాజీ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు రంగరాజన్ భక్తులతో ప్రత్యేక ప్రదక్షిణలు చేశారు.
తిరుమల తిరుపతి లడ్డూ వివాదం చిలికిచిలికి గాలివానలా మారుతోంది. కేవలం ఒక్క రాష్ట్రానికి ఒక్క ప్రాంతానికే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. జాతీయ స్థాయిలోనూ పార్టీలకతీతంగా నేతలు స్పందిస్తున్నారు. రాజకీయంగానూ ఈ వ్యవహారం పెను సంచలనంగా మారింది.
ఇప్పటికే ఈ అపాచారాన్ని సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం టీటీడీకి పలు ఆదేశాలు జారీ చేసింది. ఆలయ ప్రసాదం విషయంలోనూ పలు జాగ్రత్తలు సూచించింది. అటు లడ్డూ ప్రసాదం విషయంలోనూ పలు మార్పులు తీసుకొచ్చింది. ఆలయ శుద్ధి కోసం కూడా పలు ఆదేశాలు జారీ చేసింది.
ఇక ఈ విషయంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇప్పటికే ఆయన ప్రాయశ్చిత్త దీక్షను తీసుకున్నారు. దేవుడా క్షమించమంటూ ఆయన 11 రోజుల పాటు ఈ దీక్షలో కొనసాగనున్నారు. అయితే.. ఈ సెగ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి సైతం తాకింది. రాష్ట్రవ్యాప్తంగా హిందువులు, అర్చకులు పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. తిరుమల శ్రీవారి లడ్డూ అపవిత్రం అయిందని, క్షమించు దేవుడా అంటూ కోరుతున్నారు.
తాజాగా.. చిలుకూరు బాలాజీ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు రంగరాజన్ భక్తులతో ప్రత్యేక ప్రదక్షిణలు చేశారు. వారితో ప్రత్యేక ప్రార్థనలూ చేయించారు. తిరుమలలో ఇలాంటి ఘటన జరగడం ఎంతో బాధాకరమని అన్నారు. నిజానిజాలు తేల్చాలంటూ కోరారు. మరోవైపు.. ఇరు రాష్ట్రాల్లోనూ వైష్ణవాలయాల్లో క్షమించాలంటూ వేంకటేశ్వరుడికి పూజలు చేస్తున్నట్లు తెలుస్తోంది.