కలకలం రేపిన హెచ్ఎంపీవీ వైరస్.. చైనా ఏమన్నదంటే..?
తాజాగా.. హెచ్ఎంపీవీపై చైనా స్పందించింది. ఆసుపత్రుల్లో రద్దీ పెరిగిందని లీక్ అయిన వార్తలను చైనా ప్రభుత్వం ఖండించింది.
చైనాలో కొత్త వైరస్ మరోసారి భయాందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే కరోనాతో ప్రపంచమంతా అల్లకల్లోలం అయిపోయింది. కరోనాకు కేంద్రబిందువు సైతం చైనానే. అదే డ్రాగన్ దేశంలో తాజాగా ‘హ్యూమన్ మెటానిమో వైరస్ (హెచ్ఎంపీవీ)’ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇదే వార్త సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతోంది.
వైరస్ బారిన పడిన చాలా మంది ఆస్పత్రుల బాట పడుతున్నారు. వేలాది సంఖ్యలో ఆస్పత్రుల్లో చేరుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. హెచ్ఎంపీవీతోపాటే ఇన్‌ఫ్లూయెంజా, మైకోప్లాస్మా, నిమోనియా, కోవిడ్-19 వైరస్‌లు కూడా వ్యాప్తి చెందుతున్నట్లుగా చాలా పోస్టులు కనిపిస్తున్నాయి. చైనాలో పేషెంట్లతో కిటకిటలాడుతున్న ఆస్పత్రుల వీడియోలు లీక్ అయ్యాయి. ముఖ్యంగా జలుబు, జ్వరం, దగ్గు, ముక్కు కారడం వంటి లక్షణాలతో ఆస్పత్రులకు వెళ్తున్నారు. ఓ అంతర్జాతీయ వార్తా సంస్థ తాజాగా విడుదల చేసిన ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చినట్లయింది. గుర్తుతెలియని నిమోనియా తరహా వైరస్ మూలాలను కనుగొనేందుకు చైనా వ్యాధి నియంత్రణ సంస్థ ఓ వ్యవస్థను ప్రారంభించిందని ఆ నివేదిక ద్వారా తెలిపారు. గత నెల డిసెంబర్ 16 నుంచి 22 వరకు చైనాలో అంటువ్యాధులతో బాధపడుతున్న వారి సంఖ్య భారీగా పెరిగినట్లు తెలుస్తోంది.
తాజాగా.. హెచ్ఎంపీవీపై చైనా స్పందించింది. ఆసుపత్రుల్లో రద్దీ పెరిగిందని లీక్ అయిన వార్తలను చైనా ప్రభుత్వం ఖండించింది. ఈ కథనాలు పూర్తిగా నిరాధారం అని, ప్రజలు ఎలాంటి భయాందోళన చెందాల్సిన అవసరం లేదని చైనా విదేశాంగ శాఖ పేర్కొంది. చలికాలంలో సాధారణంగా శ్వాసకోశ వ్యాధుల తీవ్రతనే ఎక్కవగా ఉంటుందని, కానీ గతేడాదితో పోలిస్తే పరిస్థితి కొంచెం మెరుగ్గానే ఉందని పేర్కొంది. చైనాలో విదేశీయులు భద్రంగానే ఉండొచ్చని, కొత్త వైరస్ వ్యాప్తి చెందినట్లు వస్తున్న వార్తలో ఎలాంటి నిజాలు లేవని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని విదేశాంగ శాఖప్రతినిధి మావోనింగ్ వెల్లడించారు.
ప్రజల ఆరోగ్యంపై తమ దేశం ప్రత్యేక శ్రద్ధ పెట్టిందని, నేషనల్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ మార్గదర్శకాలను సైతం పాటిస్తున్నామని మావోనింగ్ తెలిపారు. హైచ్ఎంపీవీ లక్షణాలు ఇతర శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్ల మాదిరిగానే ఉంటాయని తెలిపారు. మరోవైపు.. ఈ వైరస్‌పై వైద్యులు సైతం స్పందించారు. వైరస్ బారిన పడిన వారి వద్దకు ఎక్కువగా వెళ్లడం, చేతులు కలపడం ద్వారా ఇది వ్యాప్తి చెందుతుందని వైద్యులు హెచ్చరించారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు ఈ వైరస్ బారిన పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ వైరస్‌కు ప్రత్యేక టీకా అంటూ ఇంకా లేదని తెలిపారు.