ఆలసించిన ఆశాభంగం: పోస్ట్ పెడితే రూ.770... డేట్ కి వెళ్తే రూ.11,650!

జననాల రేటు పడిపోతుండటంతో.. పెళ్లిల్లు చేసుకోండి, పిల్లల్ని కనండి అంటూ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి ఆయా దేశాలు.

Update: 2024-11-20 08:30 GMT

ఒకప్పుడు అత్యధిక జనాభా ఉంటే ఎన్నో సమస్యలని చెబుతూ.. కుటుంబ నియంత్రణలను ప్రోత్సహించేవి ప్రభుత్వాలు. ఒక్కరు ముద్దు ఇద్దరు వద్దు అనే టైపు ప్రచారాలు చేసేవి. అయితే ఇప్పుడు అది పూర్తిగా రివర్స్ అయ్యింది. జననాల రేటు పడిపోతుండటంతో.. పెళ్లిల్లు చేసుకోండి, పిల్లల్ని కనండి అంటూ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి ఆయా దేశాలు.

ఈ సమయంలో... లంచ్ బ్రేక్ లో పార్ట్ నర్ తో సన్నిహితంగా ఉండొచ్చని ఓ కంపెనీ చెబుతుంటే... పెళ్లి చేసుకుంటే ప్రమోషన్, పిల్లల్ని కంటే ఇంక్రిమెంట్ అన్న స్థాయిలో మరికొన్ని సంస్థలు ప్రకటనలు గుప్పిస్తున్నాయని అంటున్నారు. ఈ క్రమంలో డేటింగ్ యాప్ లో అవతలివారు ఇంప్రస్ అయ్యేలా పోస్టులు పెడితే ఇంతా, డేటింగ్ కి వెళ్తే ఇంత అంటూ నగదు ఆఫర్లు ప్రకటించింది.

అవును... దక్షిణ చైనాలోని షెన్ జెన్ లోని ఓ టెక్ కంపెనీ తాజాగా ఓ ఆసక్తికర ఆఫర్ ను ప్రకటించింది. ఇందులో భాగంగా... ఆ సంస్థకు చెందిన డేటింగ్ యాప్ లో కంపెనీలోని సింగిల్స్ ఆకర్షితులయ్యేలా పోస్టులు పెడితే.. అందుకు గానూ 66 యువాన్లు (రూ.770) ఇస్తామని ప్రకటించింది. ఇక ఆ వ్యక్తితో డేటింగ్ కు వెళ్తే ఇంకా పెద్ద ఆఫరే ప్రకటించింది.

ఇందులో భాగంగా... పోస్టులతో ఇంప్రెస్ అయిన తర్వాత ఆ వ్యక్తితో మూడు నెలల పాటు డేటింగ్ కొనసాగించాలి. దీనికిగానూ ఒక్కొక్కరికీ 1000 యువాన్లు (రూ.11,650) రివార్డును అందిస్తారు. దీంతో.. ఈ ప్రకటన ఇప్పుడు వైరల్ గా మారగా... నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

కాగా.. గతంలో ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశాల జాబితాలో ఫస్ట్ ప్లేస్ ఉన్న చైనా ఇప్పుడు రెండు రకాల జనాభా సంక్షోభాలను ఎదుర్కోంటుంది. ఇందులో భాగంగా.. సంతానోత్పత్తి రేటు క్రమంగా తగ్గిపోతుండగా.. మరోవైపు వృద్ధ జనాభా పెరిగిపోతుంది. ఈ క్రమంలోనే 2030 నాటికి 60 ఏళ్లు పైబడిన వారి సంఖ్య 30 కోట్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు.

మరోపక్క యువత పెళ్లిల్లు చేసుకోవడం లేదు.. చేసుకున్నా పిల్లల్ని కనడం లేదు.. ఫలితంగా జననాల రేటు తీవ్రంగా పడిపోతుందని అంటున్నారు. ఈ క్రమంలో 2023లో దేశవ్యాప్తంగా 90 లక్షల జననాలు చోటు చేసుకోగా... 1949 నుంచి ఇంత తక్కువగా నమోదు కావడం ఇదే తొలిసారని అంటున్నారు. దీంతో తమ వంతు ప్రయత్నంగా పలు కంపెనీలు ఈ విధమైన ఆఫర్లు ప్రకటిస్తున్నాయి.

Tags:    

Similar News