క్రౌడ్ స్ట్రైక్ ఎఫెక్టు డ్రాగన్ దేశం మీద ఎందుకు పడలేదు?

విండోస్ లో క్రౌడ్ స్ట్రైక్ అప్డేట్ తో ఈ సాంకేతిక సమస్య తలెత్తటం తెలిసిందే.

Update: 2024-07-22 04:38 GMT

మైక్రోసాఫ్ట్ విండోస్ లో తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగా ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్ని ఎంతలా ఆగమాగం చేశాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యావత్ ప్రపంచం కాసేపు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. మొత్తంగా గంటల వ్యవధిలోనే ఈ దారుణ పరిస్థితిని అధిగమించినప్పటికి అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. విమాన సర్వీసులు మొదలుకొని వాణిజ్య సేవల వరకు ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లోని కంప్యూర్లు పని చేయకపోవటం తెలిసిందే.

విండోస్ లో క్రౌడ్ స్ట్రైక్ అప్డేట్ తో ఈ సాంకేతిక సమస్య తలెత్తటం తెలిసిందే. మైక్రోసాఫ్ట్ సంస్థకు అమెరికాకు చెందిన క్రౌడ్ స్ట్రైక్ అనే సైబర్ సెక్యూరిటీ సంస్థ సేవల్ని అందిస్తూ ఉంటుంది. దీనికి క్లయింట్లుగా మైక్రోసాఫ్ట్ తో సహా బోలెడు దిగ్గజ సంస్థలకు సైబక్ సెక్యురిటీ సేవల్ని అందిస్తూ ఉంటుంది. సదరు సంస్థ తాజాగా విడుదల చేసిన అప్డేట్ తో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో.. కంప్యూటర్లలో బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఎర్రర్ దర్శనమిచ్చి.. కంప్యూటర్లు పని చేయటం ఆగిపోయాయి. యుద్ధ ప్రాతిపదికన రంగంలోకి దిగిన మైక్రోసాఫ్ట్.. సమస్యను గుర్తించి.. వెంటనే సిస్టంను ఏం చేయాలో చెప్పటం ద్వారా.. నష్టనివారణ చేపట్టింది. అప్పటికే జరగాల్సిన భారీ డ్యామేజ్ జరిగిపోయింది.

ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో ఈ సమస్య చోటుచేసుకుంటే.. డ్రాగన్ దేశం చైనాలో మాత్రంఇందుకు భిన్నమైన పరిస్థితి నెలకొంది. ఎందుకిలా? అంటే.. ఆ దేశం అనుసరిస్తున్న విధానాలే అని చెప్పాలి. అమెరికాతో సహా పలు దేశాలు అనుసరించే విధానాలకు చైనా అమలు చేసే విధానం భిన్నంగా ఉంటుంది. చైనాలోని మైక్రోసాఫ్ట్ క్లౌడ్ సర్వీసులను స్థానిక భాగస్వామిగా ఉన్న 21 వయానెట్ నిర్వహిస్తోంది. చైనాలోని నిబంధనల ప్రకారం గ్లోబల్ క్లౌడ్ సర్వీసులను స్థానిక సంస్థలే నిర్వహిస్తూ ఉంటాయి. అందుకే మైక్రోసాఫ్ట్ క్లౌడ్ సేవల్ని 21 వయానెట్ కు అప్పగించింది.

దీంతో.. మిగిలిన దేశాలన్ని తాజా అప్డేట్ తో ఇబ్బంది పడితే.. చైనాకు మాత్రం ఎలాంటి సమస్యలు ఎదురుకాలేదు. కాకుంటే.. చైనాలోని కొన్ని అమెరికా సంస్థలు మాత్రమే క్రౌడ్ స్ట్రైక్ సేవల్ని తీసుకుంటున్నాయి. వాటిల్లోనే కాస్తంత ఇబ్బందిని ఎదుర్కొన్నాయే తప్పించి.. చైనా వ్యాప్తంగా మాత్రం ఎలాంటి ఎఫెక్టు లేని పరిస్థితి. మొత్తంగా చూస్తే.. ఇతర దేశాల్లో సైబర్ ముప్పు.. టెక్నాలజీ సమస్యలు ఎదురైనా చైనాకు మాత్రం ఇబ్బంది ఉండదు.కారణం.. మిగిలిన దేశాలకు భిన్నంగా చైనా తనదైన ఏర్పాట్లు చేసుకోవటమే. ఇదే ఇప్పుడు చైనాలో ఎలాంటి సమస్యలు ఎదురుకాని పరిస్థితి నెలకొంది.

Tags:    

Similar News