ఆ వీడియోకు ప్రధాని కూడా ముచ్చటపడ్డారట

అంతే కాక ఆ సమయంలో ప్రధానికి, తనకు మధ్య జరిగిన సంభాషణను కూడా వెల్లడించాడు చిరు.

Update: 2024-06-13 10:22 GMT

నిన్నటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, మంత్రుల ప్రమాణ స్వీకారంలో హైలైట్ అంటే ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన ప్రధాని నరేంద్ర మోడీ.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను స్టేజ్ మీద కలిసినపుడు.. తన చేయి పట్టుకుని వచ్చి చిరంజీవి దగ్గరికి వచ్చి ఇద్దరితో ఆప్యాయంగా మాట్లాడుతూ చేతులు పైకెత్తి అభివాదం చేసిన దృశ్యమే. ఆ సమయంలో మెగా అన్నదమ్ముల సంబరం అంతా ఇంతా కాదు. తమ్ముడి రాజకీయ ఎదుగుదలను చూసుకుని చిరు ఆ సందర్భంలో ఎంత మురిసిపోయారో.. పవన్ కళ్యాణ్ సైతం ఎంత సంతోషించాడో స్పష్టంగా కనిపించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. దీన్ని చిరు సైతం తన ట్విట్టర్ హ్యాండిల్లో పంచుకున్నారు. అంతే కాక ఆ సమయంలో ప్రధానికి, తనకు మధ్య జరిగిన సంభాషణను కూడా వెల్లడించాడు చిరు.

పవన్ ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం చిరు ఇంటికి రాగా.. అప్పుడు వాళ్లిద్దరి మధ్య ఆప్యాయత, మెగా ఫ్యామిలీలో వెల్లివిరిసిన సంతోషాలకు సంబంధించి ఒక వీడియో కొన్ని రోజుల కిందట ఎంత వైరల్ అయిందో తెలిసిందే. ఆ వీడియోను ప్రధాని సైతం చూశారని.. దాని గురించి తనతో మాట్లాడారని చిరు తాజాగా వెల్లడించారు. దీని గురించి ఆయన వివరిస్తూ.. ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు,తమ్ముడు పవన్ కళ్యాణ్ తోనూ,నాతోనూ ఈ రోజు వేదిక పైన ప్రత్యేకంగా కలిసి మాట్లాడినప్పుడు, 'ఎలక్షన్ ఫలితాల తరువాత అద్భుత విజయం సాధించి మొట్టమొదటి సారి పవన్ కళ్యాణ్ ఇంటికొచ్చినప్పటి వీడియోను ఆయన చూసారనీ, అది తనని భావోద్వేగానికి గురిచేసిందని చెప్పారు. కుటుంబ సభ్యులు, ప్రత్యేకించి మా అన్నదమ్ముల మధ్య వున్న ప్రేమానుబంధాలని పంచుకున్న ఆ దృశ్యాలు, మన సంస్కృతీ సంప్రదాయాల్ని, కుటుంబ విలువల్ని ప్రతిబింబించాయని, ఆ క్షణాలు ప్రతి ఒక్క అన్నదమ్ములకి ఆదర్శం గా నిలుస్తాయి' అనటం నన్ను ఎంతగానో ఆనందపరిచింది. వారి సునిశిత దృష్టికి, నా కృతజ్ఞతలు! 🙏🙏 తమ్ముడి స్వాగతోత్సవం లాగే ఆయనతో ఈనాటి మా సంభాషణ కూడా కలకాలం గుర్తు ఉండిపోయే ఓ అపురూప జ్ఞాపకం!!’’ అని చిరు తన పోస్టులో పేర్కొన్నారు.

Tags:    

Similar News