మోడీ మెచ్చిన అన్నదమ్ముల 'మెగా'నుబంధం... చిరు ట్వీట్ వైరల్!

ఈ కార్యక్రమం సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ల చేతులు పట్టుకుని మోడీ వేదిక ముందుకు వచ్చారు.

Update: 2024-06-13 09:31 GMT

ఏపీలో కొత్త ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం కొలువుదీరిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా చంద్రబాబు ముఖ్యమంత్రిగా, పవన్ కల్యాణ్ తో పాటు మరో 23 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా, జేపీ నడ్డా లతోపాటు మెగాస్టార్ చిరంజీవి, రజనీకాంత్ దంపతులు హాజరయ్యారు.

ఈ కార్యక్రమం సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ల చేతులు పట్టుకుని మోడీ వేదిక ముందుకు వచ్చారు. అనంతరం ప్రజలకు అభివాదం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవితో మోడీ కాసేపు ముచ్చటించారు. అయితే ఆ ముచ్చట ఏమిటనేది చిరు పంచుకున్నారు.

అవును... ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన వేళ మెగాస్టార్ చిరంజీవి – పవర్ స్టార్ పవన్ కల్యాణ్ లతో కలిసి మోడీ ప్రజలకు అభివాదం తెలిపిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై చిరంజీవి ఆన్ లైన్ వేదికగా వెల్లడించారు. ఇందులో భాగంగా... తమతో మొడీ ఏమి మాట్లాడారనే విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్ట్ వైరల్ గా మారింది.

"ప్రధాని నరేంద్ర మోడీ గారు.. తమ్ముడు పవన్ కల్యాణ్ తోనూ, నా తోనూ వేదికపై ప్రత్యేకంగా కలిసి మాట్లాడినప్పుడు... ఎలక్షన్ ఫలితాల తర్వాత అద్భుత విజయం సాధించి, మొట్టమొదటి సారిగా పవన్ కల్యాణ్ ఇంటికొచ్చినప్పటి వీడియోను ఆయన చూశారని.. అది తనని భావోద్వేగానికి గురిచేసిందని చెప్పారు" అని చిరు వెల్లడించారు.

ఇదే సమయంలో.. "కుటుంబ సభ్యులు, ప్రత్యేకించి మా అన్నదమ్ముల మధ్య ఉన్న ప్రేమానుబంధాలను పంచుకున్న ఆ దృశ్యాలు.. మన సంస్కృతీ సంప్రదాయాల్ని, కుటుంబ విలువల్ని ప్రతిబింబించాయని, ఆ క్షణాలు ప్రతీ ఒక్క అన్నదమ్ములకీ ఆదర్శంగా నిలుస్తాయని అనడం నన్ను ఎంతగానో ఆనందపరిచింది" అని చెబుతూ.. "వారి సునిశిత దృష్టికి నా కృతజ్ఞతలు" అని చిరు తెలిపారు.

ఈ సందర్భంగా... "తమ్ముడి స్వాగతోత్సవం లాగే ఆయనతో ఈనాటి మా సంభాషణ కూడా కలకాలం గుర్తుండిపోయే ఓ అపురూప జ్ఞాపకం" అని రాస్తూ... ఆ సందర్భానికి సంబంధించిన వీడియోను చిరంజీవి ఎక్స్ లో పోస్ట్ చేశారు.

Tags:    

Similar News