అక్కడ ఆయనే సీఎం ?
సీఎం రమేష్ ఉంటే ఢిల్లీలో లేకపోతే అనకాపల్లిలో అన్నట్లుగా గత నాలుగు నెలలుగా వ్యవహరిస్తున్నారు. ఆయన తన పార్లమెంట్ పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలను తరచుగా పర్యటిస్తున్నారు.
ఎక్కడ కడప మరెక్కడ అనకాపల్లి. ఎక్కడ రాయలసీమ మరెక్కడ ఉత్తరాంధ్రా. అయినా ఈ రెండింటికీ వారధి వేసి మరీ తన రాజకీయ పడవను ఢిల్లీలోని పార్లమెంట్ దాకా నడిపించిన ఘనతను సీఎం రమేష్ సాధించారు. ఆయన వ్యూహ రచనా చాతుర్యం ముందు వైసీపీ లోకల్ నినాదం వెలవెలపోయింది. పార్టీ బలం కూడా తేలిపోయింది. స్థానికంగా ఉన్న కూటమిలోని ఇతర నాయకులు సైతం సీఎం రమేష్ తోనే అన్నట్లుగా మారిపోయారు. అదంతా సీఎం రమేష్ రాజకీయ చాతుర్యం అని అంటున్నారు.
ఆయన కూటమి తరఫున ఉమ్మడి జిల్లా రాజకీయాలను దాదాపుగా శాసిస్తున్నారు అని అంటున్నారు. దశాబ్దాల పాటు ఆయన టీడీపీలో ఉన్నారు. చంద్రబాబుకు కుడి భుజంగా ఉన్నారు. ఇపుడు చూస్తే ఆయన మిత్రపక్షం అయిన బీజేపీ నుంచి అనకాపల్లి నుంచి లోక్ సభకు నెగ్గారు.
దాంతో మిత్రుడిగా ఉన్నా టీడీపీతోనూ మంచి సంబంధాలను కొనసాగిస్తున్నారు. అలాగే ఆయనకు జనసేన అధినాయకత్వం తో సన్నిహిత పరిచయాలు ఉన్నాయి. దాంతో ఆ విధంగా ఆయన మూడు పార్టీలకు ముచ్చటైన నేతగా మారిపోయారు.
సీఎం రమేష్ ఉంటే ఢిల్లీలో లేకపోతే అనకాపల్లిలో అన్నట్లుగా గత నాలుగు నెలలుగా వ్యవహరిస్తున్నారు. ఆయన తన పార్లమెంట్ పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలను తరచుగా పర్యటిస్తున్నారు. అక్కడ సమస్యలు తెలుసుకుంటున్నారు. వైసీపీ నుంచి నేతలను తీసుకుని వచ్చి కూటమిలో చేర్చుకుంటున్నారు.
అదే విధంగా కూటమి నేతలలో ఏమైనా ఇబ్బందులు ఉంటే తానే పరిష్కరిస్తున్నారు. ఎవరైనా పార్టీలకి ఇబ్బందిగా మారితే ఆయా అధినాయకత్వాలకు చూచాయగా చేరవేయాల్సింది చేరుస్తున్నారు అని ప్రచారంలో ఉంది. దాంతో అంతా అలెర్ట్ అవుతున్నారు. ఒక్క లెక్కన సర్దుకుంటున్నారు.
ఈ విధంగా సీఎం రమేష్ ఇపుడు అంతా తానై అన్నట్లుగానే ఉన్నారు. ఆయన కేంద్ర మంత్రి కాదు కానీ దానికి మించి అన్నట్లుగానే ఆయన హవా ఉంది అని అంటున్నారు. టీడీపీలో ఎంతో మంది సీనియర్లు ఉన్నారు. అలాగే బీజేపీలో కూడా ఉన్నారు. జనసేనలో మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ లాంటి దిగ్గజ నేతలు ఉన్నారు.
వీరందరినీ కోఆర్డినేట్ చేసుకుంటూ కేంద్ర బిందువుగా సీఎం రమేష్ మారిపోయారు అని అంటున్నారు. దాంతో ఆయన పేరులోనే కాదు ఆయన రాజకీయంలోనూ సీఎం కనిపిస్తున్నారు అని కూటమి నేతలు చలోక్తిని విసురుతున్నారు.
జిల్లకు ఎవరు ఇంచార్జి మంత్రిగా ఉన్నా ఎవరు మంత్రి అయినా ఎవరు సీనియర్ అయినా కూడా అంతా తానై నడిపిస్తున్న సీఎం రమేష్ జమిలి ఎన్నికల నేపధ్యంలో అనకాపల్లిని అట్టేబెట్టుకుకుని కలియతిరుగుతున్నారు. మరోసారి ఎన్నికలు వచ్చినా తానే నెగ్గాలన్న పట్టుదల్తో ఆయన ఉన్నారని అంటున్నారు. అంగబలం అర్ధబలం నిండుగా ఉన్న సీఎం రమేష్ ఒక విధంగా చెప్పాలీ అంటే రాజకీయ చక్రమే గిరగిరా తిప్పేస్తున్నారు.