ఎక్స్ లో ఢిల్లీ రణరంగం ఆధునిక టెక్నాలజీతో ఎన్నికల యుద్ధం
అయితే గత ఎన్నికలకు భిన్నంగా ఈ సారి మూడు పార్టీలు ఆధునిక టెక్నాలజీని వాడుకుని ప్రత్యర్థులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
ఢిల్లీ ఎన్నికలకు టైం దగ్గరపడుతోంది. ఎన్నికల సంఘం నుంచి ప్రకటన రావడమే ఆలస్యం. నేడో రేపో షెడ్యూల్ వస్తుందని పార్టీలు అంచనా వేస్తున్నాయి. ఇదే సమయంలో తమ ఎన్నికల యుద్ధాన్ని ముమ్మరం చేశాయి. ప్రధాన పార్టీలైన ఆప్, బీజేపీ, కాంగ్రెస్ ఎన్నికల వ్యూహాలను దూకుడుగా రూపొందిస్తున్నాయి. అయితే గత ఎన్నికలకు భిన్నంగా ఈ సారి మూడు పార్టీలు ఆధునిక టెక్నాలజీని వాడుకుని ప్రత్యర్థులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ విషయంలో ఆప్, బీజేపీ మధ్య పోటాపోటీ యుద్ధం జరుగుతోంది. ఇరుపార్టీలు సోషల్ మీడియా యుద్ధానికి ‘ఎక్స్’ వేదిక అవుతోంది.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు సమీపించిన వేళ.. రాజకీయం ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా ఈ సారి అన్నిపార్టీలు సోషల్ మీడియాను వేదికగా చేసుకుని రణరంగానికి సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం ఎన్నికల ప్రచారానికి ఎక్కువగా సోషల్ ప్లాట్ ఫాంలనే పార్టీలు వాడుకుంటున్నాయి. దీంతో ఆన్ లైన్ వేదికగా రణరంగం నడుస్తున్నట్లు కనిపిస్తోంది. పోటాపోటీ వీడియోలు, ఏమోజీలతో ప్రత్యర్థులపై విమర్శలు దాడి చేయడంలో ప్రధాన పార్టీలు పోటీపడుతున్నాయి.
వచ్చే నెలలో ఢిల్లీ అసెంబ్లీ గడువు పూర్తవుతోంది. దీంతో ఏ క్షణమైనా ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉందంటున్నారు. దీంతో ప్రధాన పార్టీలు అభ్యర్థుల ఎంపికపై ఫోకస్ పెట్టాయి. ఈ విషయంలో ఢిల్లీలో అధికార పార్టీ ఆప్ ఓ అడుగు ముందునే ఉంది. ఇప్పటికే 70 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన ఆ పార్టీ సారథి అరవింద్ కేజ్రీవాల్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. మరోవైపు బీజేపీ కూడా 29 మంది అభ్యర్థులతో తొలి జాబితా విడుదల చేసింది. ఇంకోపక్క ప్రధాని మోదీతో బహిరంగ సభ నిర్వహించి ఎన్నికల శంఖారావం పూరించింది. ఇక కాంగ్రెస్ కూడా అభ్యర్థుల ఎంపికలో తలమునకలైంది.
అయితే ఈ సారి ఎన్నికల్లో మూడు పార్టీలు ఆధునిక టెక్నాలజీపై ఎక్కువగా ఆధారపడినట్లు కనిపిస్తోంది. ఢిల్లీ మహానగరంలో ప్రతి ఓటరునూ చేరుకోవడం భౌతికంగా సాధ్యమయ్యే పని కానందున, ఆన్ లైన్ ద్వారా పార్టీలు తమ ప్రచారాన్ని ఉధ్రుతం చేస్తున్నాయి. ముఖ్యంగా ఆర్టిఫిషీయల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ద్వారా వీడియోలు తయారు చేయించి ప్రత్యర్థులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ఈ వీడియోలు ఓటర్లను అమితంగా ఆకట్టుకుంటుండటంతో అన్ని పార్టీలు ఇదే పంథాను ఎంచుకున్నాయి.
ఈ ఆన్ లైన్ ప్రచారంలో ఆప్, బీజేపీ దూసుకుపోతున్నాయి. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత కేజ్రీవాల్ గతంలో ప్రకటించిన GOAT (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్), సన్ ఆఫ్ ఢిల్లీ వంటి నినాదాలకు ఏఐ వీడియోలు జోడించి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారాన్ని అడ్డుకోడానికి బీజేపీ కూడా ఏఐ వీడియోలను తయారు చేయించి ‘అరవింద్ కేజ్రీవాల్ మోసగాడు’ అంటూ ప్రచారం చేస్తోంది. బీజేపీ తన ప్రచారానికి తగ్గట్టు కొన్ని సినిమా సన్నివేశాలను వాడుకుంటోంది. బిగ్ బి అమితాబ్ సినిమా ‘బాగ్ బాస్’లో ఎంతో చెమటోడ్చి తమను పెంచిన తల్లిదండ్రులను పిల్లలు పట్టించుకోని సన్నివేశాన్ని వాడుకుంటున్న బీజేపీ.. ఆ సినిమాలోని పాత్రలకు కేజ్రీవాల్ ఫొటో జోడించి ఇలాంటి వారే సన్ ఆఫ్ ఢిల్లీ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తోంది. ఏరు దాటాక తెప్ప తగలేసే రకాలంటూ ఆప్ అధినేత కేజ్రీవాల్, ముఖ్యమంత్రి ఆతిశీలను ‘ఎక్స్’ వేదికగా విమర్శిస్తోంది బీజేపీ.
ఈ ఆరోపణలు ప్రత్యారోపణలు వీడియోలతో ‘ఎక్స్’లో ట్వీట్ వార్ జరుగుతోంది. తమ ప్రభుత్వంలో చేపట్టిన పనులను వివరిస్తూ ఆప్ వీడియోలు పెడుతుంటే, వాటిని విమర్శిస్తూ బీజేపీ వీడియోలను విడుదల చేస్తోంది. మరోవైపు ఇండి కూటమిలోని భాగస్వామి అయిన కాంగ్రెస్ పైనా ఆప్ వదలడం లేదు. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీకి ఏం మిగల్లేదు. గత ఎన్నికల్లో ఒక్క సీటు గెలుచుకోని కాంగ్రెస్ పార్టీకి మళ్లీ అలాంటి ఫలితాలే వస్తాయంటూ విమర్శలు గుప్పిస్తోంది ఆప్. మొత్తానికి అధికారాన్ని నిలబెట్టుకోడానికి ఆప్, ఆ పార్టీని గద్దెదించి కాషాయ జెండా ఎగురవేయడానికి బీజేపీ, ఉనికి చాటుకోవాలని కాంగ్రెస్ ఢిల్లీలో విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి.