ఒక ప్రెస్‌ కాన్ఫరెన్స్.. గంటన్నరకు పైగా స్పీచ్.. రేవంత్ ఎందుకింత వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది..

మూసీ ప్రక్షాళన మీద బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు రోజురోజుకూ ఆరోపణలు తీవ్రతరం చేస్తున్నాయి. అంతేకాకుండా.. మూసీ ప్రక్షాళన పేరిట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేలాది కోట్లు వెనకేసుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.

Update: 2024-10-19 10:30 GMT

సాధారణంగా రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ కాకముందే మహా అయితే పది నిమిషాలు.. 15 నిమిషాల్లో ప్రెస్ కాన్ఫరెన్స్ ముగించే వారు. ఆ తరువాత పీసీసీ చీఫ్ అయ్యాక అరగంట దాటింది. అయితే.. గతంలో ఎన్నడూ లేనివిధంగా నిన్నటి ప్రెస్‌కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి గంటన్నరకు పైగా మాట్లాడడం ఆశ్చర్యానికి గురిచేసింది. అది కూడా ఒకటే అంశం మీద ఆయన అంతలా వివరణ ఇచ్చుకునే పరిస్థితి ఎందుకు వచ్చిందనేది ఎవరికీ అంతపట్టకుండా ఉంది.

మూసీ ప్రక్షాళన మీద బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు రోజురోజుకూ ఆరోపణలు తీవ్రతరం చేస్తున్నాయి. అంతేకాకుండా.. మూసీ ప్రక్షాళన పేరిట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేలాది కోట్లు వెనకేసుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. వచ్చిన డబ్బులను ఢిల్లీ తరలిచేందుకే ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారంటూ బీఆర్ఎస్ నేతలు, ముఖ్యంగా కేటీఆర్ పదే పదే ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా.. కేవలం 25వేల కోట్లతో పూర్తిచేస పనులను రూ.లక్షా 50వేల కోట్లతో చేపడుతున్నారని సంచలన ఆరోపణలు చేశారు.

దాంతో వాటన్నింటికీ చెక్ పెట్టేందుకు రేవంత్ పెద్ద ఎత్తున ప్రెస్‌కాన్ఫరెన్స్ నిర్వహించారు. అంతేకాదు.. ఎప్పుడూ తీసుకోని విధంగా గంటన్నర వరకు సమయం తీసుకొని మూసీ సుందరీకరణ, ప్రక్షాళనపై డిటైల్డ్‌గా వివరించారు. హైదరాబాద్‌ను భవిష్యత్తులో కాపాడేందుకే తాను మూసీ ప్రక్షాళనకు దిగినట్లు చెప్పుకొచ్చారు. మూసీ నదిలో స్వచ్ఛమైన నీరు పారేలా చేయడమే తన లక్ష్యమని చెప్పుకొచ్చారు. మూసీని సుందరీకరణ చేయడంతోపాటు.. అక్కడ అక్రమంగా నిర్మించిన ఇళ్లను తొలగించే ప్రయత్నం చేస్తున్నానని చెప్పుకొచ్చారు. నిర్వాసితులందరికీ డబుల్ బెడ్ రూములను ఇచ్చామని చెప్పుకొచ్చారు. అయితే.. తాము చేస్తున్న మంచిని కాకుండా చెడు చేస్తున్నట్లుగా ఎక్కువగా ప్రతిపక్షాలు ప్రచారం చేస్తున్నాయని ఫైర్ అయ్యారు.

మూసీ సుందరీకరణ పేరుతో నిర్వాసితులను ఇబ్బందులు పెడుతున్నామని తమను కార్నర్ చేసే ప్రయత్నం చేస్తున్నారని, కానీ.. వారిని అన్నివిధాలా ఆదుకున్న తరువాతనే సుందరీకరణ పనులు ప్రారంభం అవుతాయని రేవంత్ స్పష్టం చేశారు. మూసీ ప్రక్షాళనను వ్యతిరేకిస్తున్న వారు మూడు నెలల పాటు వచ్చి మూసీ ఏరియాలో ఉండాలని సవాల్ చేశారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే మాట్లాడుతున్నారని, భవిష్యత్తును ఏమాత్రం ఆలోచించడం లేదని చెప్పే ప్రయత్నం చేశారు. మూసీని ప్రక్షాళన చేస్తేనే భవిష్యత్తులో నల్లగొండకు ఇబ్బందులు లేకుండా ఉంటాయని తెలిపారు.

అయితే.. ఇవన్నీ చూశాకి రేవంత్ రెడ్డి విపక్షాల చర్యలపై తీవ్ర ఆవేదన, ఆగ్రహంతో ఉన్నారనేది స్పష్టం అవుతోంది. ఆయన ఆవేదన ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే ఆయన మీడియాతో మాట్లాడినట్లుగా తెలుస్తోంది. మరోవైపు ప్రతిపక్షాలు ప్రభుత్వంపై ఇంతలా ఆరోపణలు చేస్తున్నా.. ప్రభుత్వం తరఫున మంత్రులు కానీ మరెవ్వరు కానీ బీఆర్ఎస్ ఆరోపణలకు పెద్దగా కౌంటర్ ఇవ్వలేకపోయారు. దాంతో రోజురోజుకూ వారి ఆరోపణలు పెరిగిపోవడంతో నేరుగా ముఖ్యమంత్రినే రంగంలోకి దిగాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ అంశంలో కాంగ్రెస్‌లోని మిగితా పెద్దలు ప్రతిపక్షాల ఆరోపణలను తిప్పికొట్టడంలో ఫెయిల్ అయ్యారన్న అపవాదు కూడా ఉంది. గంటన్నరకు పైగా స్పీచ్‌లో మాట్లాడిన రేవంత్.. ప్రజల్లో ఉన్న అనుమానాలను తొలగించారన్న భరోసా ఇప్పుడు కాంగ్రెస్‌లో కనిపిస్తోంది.

Tags:    

Similar News