టార్గెట్ ఈటల.. కాంగ్రెస్ కు బీఆర్ఎస్ సహకారం?
రాజకీయాల్లో శాశ్వత శత్రువులు.. శాశ్వత మిత్రులు ఉండరని అంటుంటారు. అదే సమయంలో శత్రువుకి శత్రువు మిత్రుడవుతారని కూడా చెబుతారు.
రాజకీయాల్లో శాశ్వత శత్రువులు.. శాశ్వత మిత్రులు ఉండరని అంటుంటారు. అదే సమయంలో శత్రువుకి శత్రువు మిత్రుడవుతారని కూడా చెబుతారు. ఈ రెండు విషయాలు తెలంగాణ పాలిటిక్స్ లో నిజమని రుజువు చేస్తున్నాయి. బీజేపీ సీనియర్ నేత మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ టార్గెట్ గా ప్రభుత్వం పావులు కదుపుతుండటం, అందుకు బీఆర్ఎస్ సహకరించే పరిస్థితి కనిపిస్తుండటమే ఇప్పుడు హీట్ పుట్టిస్తోంది. ఈటలపై కాంగ్రెస్ యాక్షన్ తీసుకుంటే.. వాటిని బీఆర్ఎస్ స్వాగతించాల్సిన తప్పనిసరి పరిస్థితిని క్రియేట్ చేయడం ప్రభుత్వ పెద్దల పక్కా వ్యూహం అంటున్నారు. గతంలో ఈటలపై భూ కబ్జా ఆరోపణలు చేసింది బీఆర్ఎస్ పార్టీ. అదే అంశాన్ని తాజాగా తెరపైకి తెచ్చి ఈటలతోపాటు బీఆర్ఎస్ నేతలను లక్ష్యంగా చేసుకుంటోంది కాంగ్రెస్. దీంతో బీఆర్ఎస్ కక్కలేక, మింగలేని పరిస్థితిని ఎదుర్కొంటోంది అంటున్నారు. ఏదైనా సరే ఈటల విషయంలో కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ సహకరించే పరిస్థితి కనిపిస్తోందని పరిశీలకులు చెబుతున్నారు.
తెలంగాణ రాజకీయంలో వేసవి సెగ అప్పుడే మొదలైంది. అధికార పార్టీని టార్గెట్ చేస్తున్న బీజేపీ నేత, మల్కాజిగిరి ఎంపీ ఈటలపై చర్యలకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోందని టాక్ వినిపిస్తోంది. ఈటలను దృష్టిలో పెట్టుకునే దేవాదాయ భూములను ఆక్రమించిన వారిపై త్వరలో చర్యలు తీసుకుంటామని మంత్రి కొండా సురేఖ చేసిన హెచ్చరికలు చేశారంటున్నారు. దీనికి ప్రధాన కారణం కాంగ్రెస్ ప్రభుత్వంపై ఈటల చేస్తున్న పోరాటాలే అంటూ టాక్ వినిపిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న హైడ్రా, కుల గణన కార్యక్రమాలపై ఈటల ఎక్కువగా మాట్లాడుతుండటం ప్రభుత్వానికి చికాకుగా మారిందని అంటున్నారు. దీంతో ఆయనపై గతంలో వచ్చిన భూ కబ్జా ఆరోపణలపై తాజాగా చర్యలకు రంగం సిద్ధం చేస్తున్నట్లు చెబుతున్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆరోగ్యశాఖ మంత్రిగా పనిచేసిన ఈటల రాజేందర్ భూఆక్రమణలకు పాల్పడ్డారని అప్పట్లోనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఈ అంశాలను ప్రస్తావిస్తూ ఆయనను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే రాజకీయంగా తనను తొక్కేయాలనే ఆలోచనతోనే బీఆర్ఎస్ తనపై కబ్జా ఆరోపణలు చేస్తోందని ఈటల అప్పుడే వివరణ ఇచ్చారు. తాను కొనుగోలుచేసిన భూములు కబ్జా చేశారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని వివరణ ఇస్తూ వస్తున్నారు. ఈ విషయంపై ఆయన కోర్టును సైతం ఆశ్రయించారు. అయితే ఇటీవల కాలంలో దూకుడు పెంచిన ఈటలకు కళ్లెం వేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కబ్జా అస్త్రాన్నే వాడుకోవాలని భావిస్తుండటం చర్చనీయాంశమవుతోంది.
మేడ్చల్ జిల్లా శామీర్‌పేట మండలం దేవరయాంజల్ గ్రామంలో సీతరామ స్వామి ఆలయ భూములను ఈటల ఆక్రమించారని గతంలో ఆరోపణలు వెల్లువెత్తాయి. గత బీఆర్ఎస్ సర్కారులో ఈ అంశంపై విచారణకు ఓ కమిటీ వేశారు. ఆ తర్వాత ఈ వ్యవహారం కోర్టు మెట్లెక్కడంతో వివాదం తాత్కాలికంగా సర్దుమణిగింది. వాస్తవానికి దేవరయాంజల్ భూముల వ్యవహారం కొత్తగా బీఆర్ఎస్ సర్కారు మాత్రమే బయటపెట్టలేదు. 1995 నుంచే ఈ భూములపై వివాదాలు ఉన్నాయని చెబుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ హయాంలో కూడా ఆ భూములపై విచారణకు కమిటీ వేసిన విషయాన్ని పలువురు గుర్తుచేస్తున్నారు. 1975 వరకు దేవుని మన్యాలుగా ఉన్న భూమి 1995 తర్వాత ప్రైవేటు వ్యక్తుల కబ్జాల్లోకి వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ భూముల కబ్జా లెక్క తేల్చాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించడం మరోమారు చర్చకు తావిస్తోంది.
అయితే ఈ విషయంలో కాంగ్రెస్ సర్కారుకు బీఆర్ఎస్ పార్టీ సహకరిస్తుందా? లేదా? అనేది రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. బీజేపీ రూపంలో తమకు ముప్పు పొంచి వుండటంతోపాటు గతంలో తాము చెప్పిన విషయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నిజం చేస్తే ఆ క్రెడిట్ తమకే దక్కుతుందని బీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఈటలపై చర్యలకు తాము సహకరిస్తే.. తమ పార్టీ నేతల ఆధీనంలో ఉన్న మిగతా భూమి సంగతేంటి అనేది హీట్ పుట్టిస్తోంది.
కాగా, మంత్రి సురేఖ స్టేట్‌మెంట్‌పై ఇప్పటివరకు ఈటల రాజేందర్ స్పందించలేదు. ఆయన అనుచరులు మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని రాద్ధాంతం చేయాలని చూస్తోందని ఆరోపిస్తున్నారు. రేవంత్ ప్రభుత్వ విధానాలపై ఈటల మడమతిప్పని పోరాటం చేస్తుండటం వల్ల ఆయన దృష్టి మరల్చేలా ప్లాన్ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇలా మొత్తంగా ఈటల భూముల చుట్టూ వివాదం రేగుతుండటం తెలంగాణలో పొలిటికల్ హీట్ పెంచుతోంది.