పీవీకి నాడు అవమానం..... నేడు గౌరవం

ఆయన ఇందిరాగాంధీ కాలం నుంచి సోనియా గాంధీ జమానా వరకూ అందులో కీలకంగా పనిచేశారు.

Update: 2025-01-16 13:30 GMT

చరిత్రలో కొన్ని సార్లు తప్పులు అలా జరిగిపోతూంటాయి. వాటిని చక్కదిద్దుకోవడమే నేతలు చేయాల్సిన పని. కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో ఉద్ధండులు అయిన నాయకుడు పీవీ నరసింహారావు. ఆయన ఇందిరాగాంధీ కాలం నుంచి సోనియా గాంధీ జమానా వరకూ అందులో కీలకంగా పనిచేశారు.

ఇక 1991లో రాజీవ్ గాంధీ అనూహ్యంగా మానవ బాంబు దాడిలో మరణించడంతో పీవీ కాంగ్రెస్ కి పెద్ద దిక్కు అయ్యారు. ఎనభయ్యేళ్ల వయోభారాన్ని సైతం లెక్కచేయకుండా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రెండు బాధ్యతలను తన భుజాల మీద వేసుకుని ఒంటి చేత్తో నడిపించారు. మైనారిటీ ప్రభుత్వాన్ని అయిదేళ్ళూ ఏ చీకూ చికాకూ లేకుండా నడపడమే కాకుండా ఆర్ధిక సంస్కరణల ద్వారా దేశానికి కొత్త దిశా నిర్దేశం చేశారు.

కాంగ్రెస్ పార్టీకి పునర్జీవనం కలిగించారు. అయితే పీవీకి సోనియాకు మధ్య గ్యాప్ క్రియేట్ చేయడంలో కొంతమంది ఉత్తరాది పాత కాంగ్రెస్ నేతలు సక్సెస్ అయ్యారు. దాని ఫలితంగా చివరి రోజులలో పీవీ ఒంటరిగా ఉండిపోవాల్సి వచ్చింది. అంతే కాదు ఆయన 2004లో మరణించినపుడు ఆయన పార్ధిక కాయాన్ని ఏఐసీసీ ఆఫీసులోపలికి అనుమతించలేదని ఆయన అంత్యక్రియలు ఇతర మాజీ ప్రధానుల మాదిరిగా ఢిల్లీలో జరిపించలేదని విమర్శలు ఉన్నాయి.

అప్పట్లో కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా పీవీకి అన్యాయం జరిగిందని దీని వెనక కోరి చేశారు అని ప్రచారం కూడా ఉంది. మొత్తానికి తెలుగు బిడ్డ ఈ జాతి నుంచి తొలిసారి ప్రధాని అయిన వారు అయిన పీవీకి మాత్రం అలా తీరని అవమానమే జరిగింది.

మరి దానికి బదులు తీర్చుకోవడమో లేక గతంలో జరిగిన తప్పులను సవరించుకోవడమో తెలియదు కానీ మొత్తానికి కాంగ్రెస్ పార్టీ మాత్రం పీవీని గౌరవించింది. ఢిల్లీలో కొత్తగా ఆరు అంతస్తులతో ఏర్పాటు చేసిన బ్రహ్మాండమైన కాంగ్రెస్ జాతీయ పార్టీ ఆఫీసులో పీవీ చిత్ర పటాన్ని ఏర్పాటు చేయడం ద్వారా కాంగ్రెస్ ఆయన రుణం తీర్చుకుంది అని అంటున్నారు.

ఢిల్లీలోని కోట్ల మార్గ్ లో కాంగ్రెస్ పార్టీ నూతన జాతీయ ప్రధాన కార్యాలయంలో వరసబెట్టి ఉన్న కాంగ్రెస్ మాజీ ప్రధానుల సరసన పీవీకి కూడా చోటు కల్పించారు. ఆ వరస చూస్తే కనుక జవహర్ లాల్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, పీవీ నరసింహారావు, మన్మోహన్ సింగ్ ఉన్నారు. వీరంతా కాంగ్రెస్ పార్టీలో నుంచి ఎదిగి ప్రధానులు అయ్యారు. వీరిలో ఒక్క లాల్ బహుదూరు శాస్త్రి, మన్మోహన్ సింగ్ తప్ప మిగిలిన వారు అంతా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులుగా కూడా పనిచేశారు.

ఇక చూస్తే కనుక పీవీ నరసింహారావు వెదురు కుర్చీలో కూర్చున్న బ్లాక్ అండ్ వైట్ ఫొటోను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఇది చాలా ఆకర్షణీయంగా ఉంది. మొత్తానికి చూస్తే పీవీ మరణించిన ఇరవై ఏళ్ళకు కాంగ్రెస్ పార్టీ ఆయనకు అరుదైన గౌరవం ఇచ్చి తమ వాడిగా చేసుకుందని అంటున్నారు. కొసమెరుపు ఏంటి అంటే పీవీకి భారత రత్న ఇచ్చి నరంద్ర మోడీ ప్రభుత్వం గౌరవించింది. ఇపుడు పీవీ తమ సొంతం అని కాంగ్రెస్ గట్టిగా చాటి చెప్పిన నేపధ్యంలో బీజేపీ మళ్లీ పీవీ గురించి కాంగ్రెస్ ని ఆడిపోసుకునే సందర్భం వస్తుందా రాదా అన్నది వేచి చూడాల్సిందే.

Tags:    

Similar News