రేవంత్ రెడ్డికి కేటీఆర్ ఇంట్రస్టింగ్ సవాల్!

ఫార్ములా ఈ-రేసు కేసు తెలంగాణలో తీవ్ర సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.

Update: 2025-01-16 15:28 GMT

ఫార్ములా ఈ-రేసు కేసు తెలంగాణలో తీవ్ర సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే కేటీఆర్, అరవింద్ కుమార్, బీ.ఎల్.ఎన్. రెడ్డిలకు నోటీసులు ఇచ్చిన ఏసీబీ విచారించగా.. తాజాగా ఈడీ అధికారులు విచారించారు. సుమారు 7 గంటల పాటు జరిగిన ఈ విచారణ అనంతరం కేటీఆర్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.

అవును.. ఫార్ములా ఈ-రేసు కేసుకు సంబంధించి బీఆరెస్స్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు విచారించారు. ఉదయం 10:40 గంటల ప్రాంతంలో మొదలైన ఈ విచారణ సాయంత్రం దాదాపు 5:30 వరకూ జరిగింది. విచారణ అనంతరం ఆఫీస్ నుంచి బయటకు వచ్చిన కేటీఆర్... రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు.

ఈ సందర్భంగా... రేవంత్ రెడ్డి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే తనపై తప్పుడు కేసులు పెట్టారని.. దర్యాప్తు సంస్థలు, విచారణ అధికారులపై తనకున్న గౌరవంతో ఏ తప్పూ చేయకపోయినా విచారణకు హాజరైనట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎసీబీ, ఈడీ రెండు సంస్థలు ఒకే రకమైన ప్రశ్నలు తిప్పి తిప్పి అడిగాయని అన్నారు.

ముందు ఏసీబీ అడిగినా, తాజాగా ఈడీ అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానమిచ్చినట్లు చెప్పిన కేటీఆర్... ఎన్నిసార్లు పిలిచినా విచారణకు వస్తానని, ఎన్ని ప్రశ్నలు వేసినా సమాధానాలు చెబుతానని.. భారత రాజ్యాంగాన్ని, న్యాయ వ్యవస్థను గౌరవిస్తూ విచారణకు పూర్తిగా సహకరిస్తానని మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు.

ఈ సందర్భంగా ఫార్ములా ఈ-రేస్ కేసు విచారణకు రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్లు ఖర్చవుతుందని పేపర్ లో చూసినట్లు చెప్పిన కేటీఆర్... అందుకే రేవంత్ రెడ్డికి ఓ మాట చెబుతున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా.. "మీపై ఈడీ, ఏసీబీ కేసులున్నాయని, నాపైనా పెట్టించారు.. మీరు దొరికిపోయారు.. నేను నిజాయతీ గల వ్యక్తిని" అని అన్నారు.

అందువల్ల... విచారణ పెరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకుండా ఆ డబ్బుతో ఇంకో 500 మంది రైతులకు రుణమాఫీ చేయొచ్చని కేటీఆర్ సూచించారు. ఈ సమయంలో న్యాయమూర్తి, మీడియా ముందు లై డిటెక్టర్ పరీక్షకు తాను సిద్ధంగా ఉన్నానని.. రేవంత్ రెడ్డి సిద్ధంగా ఉన్నారా అని అడిగిన కేటీఆర్.. ఆ విచారణ రాష్ట్ర ప్రజలంతా చూస్తుండగానే జరగాలని అన్నారు.

ఆ విధంగా చేస్తే అటు ప్రజాధనం వృథా కాకుండా ఉండటంతో పాటూ నిజా నిజాలు బయటకు వస్తాయని సూచించారు. ఏది ఏమైనా త్వరలోనే వాస్తవాలు అన్నీ ప్రజలకు తెలుస్తాయని అన్నారు. ఇక తనను మరోసారి విచారణకు రావాలని ఈడీ అధికారులు చెప్పలేదని చెప్పిన కేటీఆర్.. ఒకవేళ విచారణకు పిలిస్తే వెళ్తానని అన్నారు.

Tags:    

Similar News