ఇజ్రాయెల్ - గాజా సీజ్ ఫైర్... అగ్రరాజ్యంలో క్రెడిట్ ఫైట్!
సుమారు 15 నెలలుగా అవిరామంగా కొనసాగుతున్న ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి ముగింపు పలుకుతూ బుధవారం ఓ అంగీకారానికి వచ్చినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
అక్టోబర్ - 7, 2023న ఇజ్రాయెల్ లోకి ప్రవేశించిన హమాస్ ఉగ్రవాదులు 1200 మంది ఇజ్రాయెల్ పౌరులను హతమార్చి, సుమారు 250 మందిని బందీలుగా చేసుకున్న సంగతి తెలిసిందే. నాటి నుంచి గాజా లక్ష్యంగా ఇజ్రాయేల్ సైన్యం విరుచుకుపడింది. ఈ క్రమంలో సుమారు 46,000 మంది పాలస్తీనియన్లు మృతి చెందినట్లు చెబుతున్నారు. అయితే.. తాజాగా వీరి మధ్య ఒప్పందం నెలకొంది.
సుమారు 15 నెలలుగా అవిరామంగా కొనసాగుతున్న ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి ముగింపు పలుకుతూ బుధవారం ఓ అంగీకారానికి వచ్చినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ సమయంలో ఈ క్రెడిట్ మొత్తం తనదే అంటే తనదేనని ఫైట్ అమెరికాలో మొదలైంది. ఇందులో భాగంగా... ఈ యుద్ధం ఆగడానికి తానే కారణం అని ట్రంప్ అంటే.. ఏమిటి జోకా? అని బైడెన్ అంటున్నారు.
అవును... గాజాలో శాంతి ఒప్పందం కుదిర్చిన ఘనత దక్కించుకునే విషయంలో ట్రప్ – బైడెన్ ల మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఇందులో భాగంగా... తన ప్రమాణస్వీకారం నాటికి బందీలను విడుదల చేయకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ హమస్ ను హెచ్చరించారు డొనాల్డ్ ట్రంప్. ఇదే సమయంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహును విమర్శించారు.
ఈ నేపథ్యంలో ఆ రెండింటికి సంబంధించిన వీడియోలను షేర్ చేశారు డొనాల్డ్ ట్రంప్. ఈ సందర్భంగా... హమాస్ - ఇజ్రాయెల్ మధ్య జరిగిన కాల్పుల విరమణ ఒప్పందం చాలా గొప్పదని.. నవంబర్ లో తన విజయం ఫలితంగా తన కార్యవర్గం శాంతిని కోరుకుంటుందనే విషయాన్ని ప్రపంచానికి చాటి చెప్పిందని అని రాసుకొచ్చారు.
మరోవైపు తన చివరి ప్రసంగం మొదట్లో బైడెన్ మాట్లాడుతూ.. ఇది తన కెరీర్ లోనే కఠినమైన డీల్ అని.. తాను గత మే నెలలో ప్రస్తావించిన అంశాలు ఈ డీల్ లో ఉన్నాయని.. వాటిని ఐక్యరాజ్యసమితి భద్రతామండలి సహా అన్ని దేశాలూ ఆమోదించాయని అన్నారు. ఇదే సమయంలో... ఈ ఒప్పందంలో డొనాల్డ్ ట్రంప్ పాత్ర లేదని కొట్టి పారేశారు.
ఈ సందర్భంగా.. ఇజ్రాయెల్ – హమాస్ మధ్య కుదిరిన శాంతి ఒప్పందానికి తానే కారణం అని ట్రంప్ చెబుతున్నారనే విషయాన్ని ఆయనవద్ద ఓ విలేకరి ప్రస్థావించగా.. "ఏమిటి.. జోకా..?" అని బైడెన్ వెటకారంగా స్పందించడం గమనార్హం.
ఇదే సమయంలో... ఇజ్రాయెల్ – హమాస్ మధ్య శాంతి ఒప్పందం కుదిర్చినందుకు జోబైడెన్ నాయకత్వానికి ధన్యవాదాలు తెలిపారు ఉపాధ్యక్షురాలు కమలా హారిస్. ఈ సందర్భంగా... అమెరికన్ల భద్రతకు అధ్యక్షుడు బైడెన్ అధిక ప్రాధాన్యం ఇస్తారని అన్నారు. అయితే... ఈ ఒప్పందం వేళ స్పందించిన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు... డొనాల్డ్ ట్రంప్, జో బైడెన్ ఇద్దరికీ ధన్యవాదాలు తెలిపారు.
శాంతి ఒప్పందంలో కండిషన్స్ ఏమిటి?:
తాజాగా ఇజ్రాయెల్ తో జరిగిన శాంతి ఒప్పందానికి సంబంధించిన డాక్యుమెంట్ ను హమాస్ విడుదల చేసింది. ఈ ఒప్పందం మూడు దశల్లో కొనసాగుతుందని తెలిపింది! ఇందులో భాగంగా... మొదటి దశ ఆరువారాల పాటు ఉంటుందని.. ఈ సమయంలో వారానికి కొంతమంది చొప్పున విడుదల చేస్తారని.. ఆఖరి వారం బంధీలందరినీ హమాస్ విడుదల చేస్తుందని అంటున్నారు.
ఇక రెండో దశలో మిలటరీ ఆపరేషన్స్ శాస్వతంగా ఆగిపోతాయి. ఈ సమయంలో ఇజ్రాయెల్, హమాస్ లు పరస్పరం సైనికులను, పౌరుల్ని విడుదల చేస్తాయి. ఇక మూడో దశకు వచ్చేసరికి.. మృతదేహాలు, అస్తికలను ఇస్తారు. ఆ తర్వాత ఐడీఎఫ్ దాడుల్లో ఛిద్రమైన గాజా పునర్నిర్మాణం మొదలవుతుందని చెబుతున్నారు.