తెలంగాణ హైకోర్టుకు 4 కొత్త జడ్జిలు.. వారెవరు? బ్యాక్ గ్రౌండ్ ఇదే
తెలంగాణ రాష్ట్ర హైకోర్టుకు నలుగురు కొత్త న్యాయమూర్తుల పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం కేంద్రానికి సిఫార్సు చేసింది.
తెలంగాణ రాష్ట్ర హైకోర్టుకు నలుగురు కొత్త న్యాయమూర్తుల పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం కేంద్రానికి సిఫార్సు చేసింది. ఇందులో ఇద్దరు పురుష జడ్జిలు కాగా.. మరో ఇద్దరు మహిళా జడ్జిలు ఉన్నారు. ఈ నలుగురు ఎవరెవరంటే..
1. జస్టిస్ రేణుక యారా
2. జస్టిస్ నందికొండ నర్సింగ్ రావు
3. జస్టిస్ ఇ. తిరుమలా దేవి
4. జస్టిస్ బీఆర్ఎస్ మదుసూదన్ రావు
ఈ నలుగురిలో జిల్లా జడ్జిల కోటాలో రేణుక యారాను.. సిటీ సివిల్ స్మాల్ కాజెస్ కోర్టు చీఫ్ గా వ్యవహరిస్తున్న నర్సింగ్ రావును.. హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఇ. తిరుమలా దేవి.. హైకోర్టు రిజిస్ట్రార్ (పరిపాలన) మధుసూదన్ రావులను తెలంగాణ హైకోర్టు జడ్జిలుగా సుప్రీం కొలీజియం ఈ నెల 11న సిఫార్సు చేసింది. ఈ నలుగురిలో ముగ్గురు హైదరాబాద్ మహానగరంలో పుట్టి పెరిగిన వారు కావటం ఆసక్తికర అంశంగా చెప్పాలి. ఇక.. ఈ నలుగురు న్యాయమూర్తుల బ్యాక్ గ్రౌండ్.. వారి అనుభవాన్ని చూస్తే..
రేణుక యారా
హైదరాబాద్ కు చెందిన ఐలయ్య.. నాగమణి దంపతులకు 1973 జూన్ 14న రేణుక జన్మించారు. బషీర్ బాగ్ లోని పీజీ కాలేజీ ఆఫ్ లాలో 1998లో ఎల్ఎల్ బీ.. అమెరికా ఫిలడెల్ఫియా వర్సిటీలో ఎల్ఎల్ఎం పూర్తి చేవారు. 1998లో స్టేట్ బార్ కౌన్సిల్ లో లాయర్ గా నమోదై.. సిటీ సివిల్ కోర్టులో ప్రాక్టీస్ షురూ చేశారు. 2012 డిసెంబరులో జిల్లా జడ్జిగా ఎంపికై.. వరంగల్..కరీంనగర్.. రంగారెడ్డి జిల్లాల్లో పని చేశారు. వ్యాట్ ట్రైబ్యునల్ జ్యుడిషియల్ సభ్యుడిగా పని చేశారు. కొంతకాలం రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ మెంబర్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం సిటీ సివిల్ కోర్టు చీఫ్ జడ్జిగా విధులు నిర్వర్తిస్తున్నారు.
నందికొండ నర్సింగ్ రావు
హైదరాబాద్ కు చెందిన పెంటయ్య.. మణెమ్మ దంపతులకు 1969 మే మూడున జన్మించిన ఆయన.. పీఎంఆర్ లా కాలేజీలో 1995లో లా పట్టా పొందారు. అదే ఏడాది రాష్ట్ర బార్ కౌన్సిల్ లో న్యాయవాదిగా పేరు నమోదు చేసకున్నారు. 2012లో నేరుగా జిల్లా జడ్జిగా ఎంపికయ్యారు. విశాఖలో అదనపు జిల్లా జడ్జిగా నియమితులయ్యారు. తర్వాత జ్యుడిషియల్ అకాడమీ.. గుంటూరు.. వరంగల్.. ఎల్ బీ నగర్.. సైబరాబాద్ ఎంఎస్ జేగా.. న్యాయశాఖ కార్యదర్శిగా.. హైకోర్టు జ్యుడిషియల్.. ఇన్ ఫ్రా రిజిస్ట్రార్ గా విధులు నిర్వహించారు. ప్రస్తుతం సిటీ స్మాల్ కాజెస్ కోర్టు చీఫ్ జడ్జిగా పని చేస్తున్నారు.
తిరుమలాదేవి
సంగారెడ్డికి చెందిన ఈమె 1964 జూన్ 2న జన్మించారు. హైదరాబాద్ లో స్కూలింగ్ పూర్తి చేసిన ఆమె.. లాయర్ గా హైకోర్టు.. జిల్లా కోర్టుల్లోనూ పని చేశారు. 2012లో జిల్లా జడ్జిగా ఎంపికై నిజామాబాద్.. ఖమ్మం.. వరంగల్ లో పని చేశారు. హైదరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జిగా.. హైకోర్టు రిజిస్ట్రార్ గా.. రాష్ట్ర జ్యుడిషియల్ అకాడమీ డైరెక్టర్ గా విధులు నిర్వహించారు. ప్రస్తుతం హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ గా.. విజిలెన్స్ రిజిస్ట్రార్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆమెను హైకోర్టు న్యాయమూర్తిగా సిఫార్సు చేశారు.
బీఆర్ మధుసూదన్ రావు
1969 మే 25న కాజీపేటకు చెందిన ఎల్లయ్య.. అనసూయ దంపతులకు వీరు జన్మించారు. రైల్వే హైస్కూల్ లో స్కూలింగ్ పూర్తి చేసిన ఆయన కాకతీయ వర్సిటీలో ఎల్ఎల్ బీ.. ఎల్ఎల్ఎం పూర్తి చేశారు. 1998 - 99లో న్యాయవాదిగా బార్ కౌన్సిల్ లో నమోదయయారు. 2012 డిసెంబరులో జిల్లా జడ్జిగా ఎంపికై నెల్లూరు.. చిత్తూరు.. మూడ్చల్ - మల్కాజిగిరి కోర్టుల్లో పని చేశారు. సీబీఐ కోర్టు ప్రధాన జడ్జిగా.. వ్యాట్ జ్యుడిషియల్ సభ్యులుగా పని చేసిన అనుభవం ఆయనకు సొంతం. అంతేకాదు.. రాష్ట్ర సేవాధికారసంస్థ మెంబర్ సెక్రటరీగా పని చేశారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర హైకోర్టు రిజిస్ట్రార్ (పరిపాలన)గా వ్యవహరిస్తున్నారు.