ఖమ్మంలో గులాబీ నేతలపై దాడి.. ఎవరు చేశారంటే?

భారీ వర్షాలతో విరుచుకుపడిన వరదలతో ఖమ్మం నగరం ఎంతటి నష్టానికి గురైన సంగతి తెలిసిందే.

Update: 2024-09-03 12:29 GMT

భారీ వర్షాలతో విరుచుకుపడిన వరదలతో ఖమ్మం నగరం ఎంతటి నష్టానికి గురైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండు రోజులుగా ముఖ్యమత్రి రేవంత్ రెడ్డి ఖమ్మంలో ఉండి.. సహాయక చర్యల్ని స్వయంగా పర్యవేక్షిస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఈ రోజు (మంగళవారం) ఖమ్మం నగరంలోని బొక్కలగడ్డలోని బాధితుల్ని పరామర్శించేందుకు బీఆర్ఎస్ నేతల టీం చేరుకుంది. ఇందులో మాజీ మంత్రులు హరీశ్ రావు.. పువ్వాడ అజయ్.. సబితా ఇంద్రారెడ్డి.. మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావులు ఉన్నారు. వీరి వెంట బీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా ఉన్నారు.

బీఆర్ఎస్ నేతలు.. కార్యకర్తలతో బొక్కలగడ్డకు చేరుకోగా.. అప్పటికే అక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు. దీంతో.. గులాబీ శ్రేణులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీనికి స్పందనగా బీఆర్ఎస్ కార్యకర్తలు తిరిగి నినాదాలు చేశారు. దీంతో.. ఇరు పార్టీల కార్యకర్తల మధ్య నినాదాలు అంతకంతకూ పెరిగి చివరకు గొడవకు తెర తీసింది. దీంతో.. ఇరు వర్గాల మధ్య రాళ్లదాడి చోటుచేసుకుంది. దీంతో అక్కడ తీవ్ర ఉద్రికత్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి.

ఇదిలా ఉండగా మంచికంటి నగర్ లో మాజీ మంత్రులు పర్యటిస్తున్న వేళ వారిపై దాడి జరిగింది. మాజీ మంత్రులు పువ్వాడ.. హరీశ్.. సబిత, మాజీ ఎంపీ నామా ప్రయాణిస్తున్న కారుపై కాంగ్రెస్ కార్యకర్తలు విసిరిన రాళ్లతో కారు ధ్వంసమైంది. ఈ ఘటనలో నేతలకు ఎలాంటి గాయాలు కాలేదు. కాంగ్రెస్ కార్యకర్తల దాడిని బీఆర్ఎస్ నేతలు ఖండించారు. వరద బాధితుల్ని పరామర్శించేందుకు వస్తే ఇలా దాడులు చేస్తారా? అంటూ మండపడ్డారు. ఈ దాడిపై ముఖ్యమంత్రి రేవంత్ ఎలా రియాక్టు అవుతారు? అని హరీశ్ ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతలపై రాళ్ల దాడి జరుగుతున్న సమయంలో పోలీసులు అడ్డుకోలేదని.. ప్రేక్షక పాత్ర వహించారంటూ మండిపడ్డారు.

వరదబాధితులు కన్నీరు మున్నీరు అవుతున్నారని.. నిత్యవసరాలతో సహా సర్టిఫికేట్లు.. పుస్తకాలు కొట్టుకుపోయినట్లుగా చెప్పారు. వరద సహాయక చర్యల్లో ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుందన్న హరీశ్.. ‘‘ఇళ్లపై నిలబడిన వరద బాధితులకు ఆహారాన్ని కూడా అందించలేదు. వరదల్లో మరణించిన కుటుంబాలకు రూ.25 లక్షలు ఇవ్వాలి. వర్షం తగ్గి రెండు రోజులు అయ్యాక కూడా విద్యుత్ సరఫరాను పునరుద్ధరించలేదు. మంచినీరు.. ఆహారాన్ని సరఫరా చేయలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యానికి ఖమ్మం.. మహబూబాబాద్ ప్రజలు బలయ్యారు’’ అంటూ హరీశ్ మండిపడ్డారు.

Tags:    

Similar News