ఉచిత హామీల మీద కాంగ్రెస్ బిగ్ ట్విస్ట్

ఉచిత హామీలను గత రెండేళ్ళుగా అధికారానికి పరమ పద సోపానంగా కాంగ్రెస్ పార్టీ వాడుకుంది.

Update: 2024-11-03 18:12 GMT

ఉచిత హామీలను గత రెండేళ్ళుగా అధికారానికి పరమ పద సోపానంగా కాంగ్రెస్ పార్టీ వాడుకుంది. దాంతో పొలిటికల్ గా సూపర్ హిట్లు కొట్టింది కూడా. హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణా ఎన్నికల్లో సూపర్ ఫైవ్ అంటూ భారీ హామీలను గుప్పించింది. జనాలు కూడా అదరించి ఓట్లేసి పవర్ అప్పగించారు.

ఇక ఇటీవల ముగిసిన హర్యానా ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ఈ తరహా ఉచిత హామీలు ఇచ్చింది. సీట్లూ ఓట్లూ భారీగా పెరిగాయి కానీ అధికారంలోకి రాలేకపోయింది. ఇవన్నీ పక్కన పెడితే హిమాచల్ ప్రదేశ్ లో రాష్ట్ర బడ్జెట్ ని మించి ఉచిత హామీలకు ఖర్చు అవుతోంది. తొంబై వేల కోట్ల రూపాయల బడ్జెట్ కంటే ఇంకా ఎక్కువగానే రెవిన్యూ జనరేట్ చేస్తే తప్ప హామీలు నెరవేర్చే సీన్ లేదు. దాంతో అక్కడ కాంగ్రెస్ ఇబ్బందులు పడుతోంది.

అదే విధంగా చూస్తే కనుక కర్ణాటకలో ఉచిత బస్సు హామీ మీద పునరాలోచన చేస్తామని ఏకంగా ఉప ముఖ్యమంత్రి హోదాలో డీకే శివకుమార్ ప్రకటించారు. అయితే ఆ తరువాత ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అది కాదు అమలు చేస్తామని అన్నారు. కానీ అక్కడ చూస్తే కనుక ఉచితాల పేరుతో ఖజానాకు భారీ చిల్లు పడుతోంది అని అంటున్నారు.

ప్రభుత్వాన్ని సైతం నడపలేక అవస్థ పడుతున్న నేపథ్యం ఉంది. తెలంగాణాలో కూడా రెండు లక్షల రుణ మాఫీ అని రైతులకు ఇచ్చిన హామీని నెరవేర్చినా ఇంకా ఇవ్వలేదు అనే వారు ఉన్నారు. అక్కడ ప్రతిపక్షాలు వారిని అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్నాయి. ఇతర హామీలలో కొన్ని తీర్చినా ఇంకా అలాగే ఉంది. ఖజానా ఈ భారం మోయలేక పోతుంది అని అంటున్నారు.

ఈ నేపధ్యంలో దూసుకుని వచ్చిన మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ ఉచితాల మీద చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది అని అంటోంది. నోరు జారి ఉచిత హామీలు ఇచ్చినట్లు అయితే ఆ తరువాత అధికారం దక్కినా అది ముళ్ళ కిరీటమే అవుతుంది అని భావిస్తోంది. దాంతో కాంగ్రెస్ పునరాలోచన పడుతోంది అని అంటున్నారు.

దానికి కాంగ్రెస్ జాతీయ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గె చేసిన కామెంట్స్ ని ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు అని అంటున్నారు. ఆయన లేటెస్ట్ గా ఏమన్నారు అంటే మహారాష్ట్ర బడ్జెట్ ని చూసి కానీ తాము ఉచితాల మీద ఒక నిర్ణయం తీసుకోమని. అంటే ఉచిత హామీలు ఇచ్చినా కూడా అవి బడ్జెట్ కి లోబడి ఉండాలని కాంగ్రెస్ భావిస్తోంది అన్న మాట.

నేల విడిచి సాము చేయకూడదని కాంగ్రెస్ నిర్ణయించుకుంది అని అంటున్నారు. ఇక కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ కూడా ఉచిత హామీల విషయంలో తగ్గాలని కూడా అంటున్నారని తెలుస్తోంది. వాస్తవికతతో ఆలోచన చేయాలని హామీలు ఇచ్చి ఆ తరువాత నెరవేర్చలేదని నిందలు ఎందుకు అని కాంగ్రెస్ అగ్ర నాయకత్వం భావిస్తోంది. సో మహారాష్ట్ర ఎన్నికలు చూస్తే కనుక కాంగ్రెస్ ఉచిత హామీలు ఎన్ని ఇస్తుందో అన్నది ఇపుడు ఆసక్తిని పెంచుతోంది.

ఒకవేళ కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఉచిత హామీలు ఉన్నా కూడా అవి మరీ విచ్చలవిడిగా ఉండబోవని అంటున్నారు. కాంగ్రెస్ లాంటి జాతీయ పార్టీలో వచ్చిన ఈ మార్పుని దేశంలోని ఇతర పార్టీలు మరీ ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు స్పూర్తిగా తీసుకుంటే ఖజానాకు భారం కాబోదు అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

Tags:    

Similar News