కాంగ్రెస్ లో పెరిగిపోతున్న'3' టెన్షన్
తెలంగాణా కాంగ్రెస్ లో కొత్త టెన్షన్ పెరిగిపోతోంది. కారణం ఏమిటంటే మూడు నియోజకవర్గాలకు అధిష్టానం చివరినిముషంలో బీ ఫారాలను అభ్యర్ధులకు అందించకుండా హోల్డులో పెట్టడమే.
తెలంగాణా కాంగ్రెస్ లో కొత్త టెన్షన్ పెరిగిపోతోంది. కారణం ఏమిటంటే మూడు నియోజకవర్గాలకు అధిష్టానం చివరినిముషంలో బీ ఫారాలను అభ్యర్ధులకు అందించకుండా హోల్డులో పెట్టడమే. ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ 60 మందికి బీఫారాలను అందించింది. ఆదివారం గాంధీభవన్లో సీనియర్ నేతలు కొందరు అభ్యర్దులకు బీఫారాలను అందించారు. చివరి నిముషంలో అందిన సర్వే రిపోర్టులు, ఫీడ్ బ్యాక్ తదితరాల కారణంగా బోధ్, వనపర్తి, చేవెళ్ళ నియోజకవర్గాల్లో అభ్యర్ధులకు బీఫారాలను ఇవ్వకుండా నిలిపేసింది.
ప్రస్తుతం చేవెళ్ళల్లో పమేనా భీం భరత్, వనపర్తి నుండి చిన్నారెడ్డి, బోధ్ నుండి వెన్నెల అశోక్ ను అధిష్టానం అభ్యర్ధులుగా ఖాయంచేసింది. వీళ్ళ స్ధానంలో బోధ్ లో నరేష్ జాదవ్, వనపర్తి నుండి శివసేనారెడ్డి పేర్లపై బాగా చర్చ జరుగుతోంది. ముందు ముగ్గురి పేర్లను ఖాయంచేసి చివరి నిముషంలో బీఫారాలు అందించకుండా ఆపటమే పార్టీలో విచిత్రం. అలాంటిది ముందు ప్రకటించిన అభ్యర్ధులకు కొత్తగా ప్రత్యామ్నాయం ఆలోచిస్తున్నారనే ప్రచారం మరింత విచిత్రంగా ఉంది. ఇదే సమయంలో అందరిలోను టెన్షన్ పెంచేస్తోంది.
ముందుగా తమ పేర్లను ఖాయంచేసినట్లు సమాచారం అందటంతో భీం భరత్, చిన్నారెడ్డి, వెన్నెల అశోక్ నియోజకవర్గాల్లో ప్రచారం కూడా చేసేసుకుంటున్నారు. బీ ఫారాలు అందుకుని నామినేషన్లు వేయటం మాత్రమే మిగులుందని ఈ ముగ్గురు అనుకుంటున్నారు. సరిగ్గా ఇలాంటి చివరినిముషంలోనే ముగ్గరి బీఫారాలను ఆపేయాలని అధిష్టానం నిర్ణయించటం పార్టీలో సంచలనంగా మారింది. దాంతో పై ముగ్గురు నేతలు వెంటనే అధిష్టానంపై ఒత్తిళ్ళు మొదలుపెట్టేశారు.
తమ పేర్లను ఖాయంచేస్తు ప్రకటించిన అధిష్టానం చివరినిముషంలో బీపారాలను నిలిపేయటంతో వీళ్ళ అవమానంగా పీలవుతున్నారు. టికెట్లు దక్కకపోతే తమ మద్దతుదారులకు ఏమని సమాధానం చెప్పుకోవాలని పార్టీ పెద్దలను నిలదీస్తున్నారు. తమను కాదని కొత్త నేతలకు టికెట్లు ఇవ్వటం ఏమిటని వీళ్ళు లాజిక్ లేవదీశారు. తమకన్నా కొత్తగా పరిశీలనలో ఉన్న నేతలు ఏ విధంగా మెరుగైనవారో చెప్పాలని సీనియర్లను వీళ్ళు నిలదీస్తున్నారు. దాంతో కొత్త వాళ్ళ కెపాసిటి ఏమిటో అర్ధంకాక, ఇప్పటికే అభ్యర్ధులుగా ప్రకటితమైన ముగ్గురి నేతలకు ఏమి సమాధానాలు చెప్పాలో తెలీక సీనియర్లు తలపట్టుకుని కూర్చున్నారు. మరి చివరకు ఏమి జరగుతుందో చూడాల్సిందే.