మేటర్ సీరియస్... కౌన్సిలర్ ని కుర్చీకి కట్టేశారు!

ఇది భారత దేశంలో అత్యంత సహజమైన విషయంగా మారిపోతున్న సంగతి తెలిసిందే.

Update: 2024-03-10 19:30 GMT

సాధారణంగా ఎన్నికల సమయంలో నేతలు చెప్పే మాటలు, ఇచ్చే హామీలు, చేసే వాగ్ధానాల సంగతి తెలిసిందే. ఈ విషయంలో అతి తక్కువమంది ఇచ్చిన హామీలు, చేసిన వాగ్ధానాలను సక్రమంగా నెరవేరిస్తే.. మరికొంతమంది మాత్రం ఇచ్చిన హామీలను కుర్చీలు ఎక్కగానే మరిచిపోతుంటారు. ఇది భారత దేశంలో అత్యంత సహజమైన విషయంగా మారిపోతున్న సంగతి తెలిసిందే.


ఈ సమయంలో ఇచ్చిన హామీలు నేరవేర్చని నేతలపై తమ ఆగ్రహాన్ని చూపించడానికి.. తమ కోపాన్ని రుచి చూపించడానికి తిరిగి ఐదేళ్ల తర్వాత ఎన్నికలు వచ్చేవరకూ ఆగాల్సి ఉంటుంది.. ఆల్ మోస్ట్ మెజారిటీ ప్రజానికం అలానే ఎదురుచూస్తారు.. తిరిగి ఎన్నికలు వచ్చిన తర్వాత చూపించాల్సిన రీతిలో వారి కోపాన్ని చూపిస్తారు. ప్రస్తుత ట్రెండింగ్ ప్రకారం చెప్పాలంటే కుర్చీలు మడతపెట్టేస్తారు!!

మరికొంతమంది మాత్రం ప్రతిఘటిస్తుంటారు.. నేతలను నిలదీస్తుంటారు.. ఘెరావ్ చేస్తుంటారు.. తమ ఆగ్రహాన్ని పబ్లిక్ గానే చూపించే ప్రయత్నం చేస్తుంటారు. అది సమర్ధనీయమా కాదా అనే విషయం కాసేపు పక్కనపెడితే.. తాజాగా అలాంటి ఘటనే వారణాసిలో జరిగింది. ప్రజా సమస్యలపై దృష్టి పెట్టలేదని ఒక కౌన్సిలర్ ని కుర్చీకి కట్టేశారు పబ్లిక్!

అవును... వారణాసి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక కౌన్సిలర్ కు చేదు అనుభవం ఎదురైంది. ఇందులో భాగంగా... నియోజకవర్గంలో డ్రైనేజీల నిర్వహణ సరిగ్గా లేకపోవడంతో మురుగు నీరు రోడ్లపై పారుతుంది. దీంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయంపై అధికారులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోవడం లేదట.

దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రజలు.. అక్కడికి వచ్చిన స్థానిక కౌన్సిలర్ పై తమ ఆగ్రహాన్ని చూపించారు. ఇందులో భాగంగా కౌన్సిలర్ ని కుర్చీకి కట్టేశారు. తమ సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఈ విషయం వైరల్ గా మారింది. దీంతో... ప్రజలు ప్రతిఘటించడం మొదలు పెడితే ఇలానే ఉంటుందంటూ ఈ సందర్భంగా పలువురు కామెంట్ చేస్తున్నారు.

Tags:    

Similar News