టెక్కీకి స్కెచ్ వేసి సక్సెస్ అయిన సైబర్ నేరగాళ్లు... బీ కేర్ ఫుల్!!
ఇటీవల కాలంలో సైబర్ నేరగాళ్లు రకరకాల ఘోరాలతో రెచ్చిపోతున్న సంగతి తెలిసిందే.
ఇటీవల కాలంలో సైబర్ నేరగాళ్లు రకరకాల ఘోరాలతో రెచ్చిపోతున్న సంగతి తెలిసిందే. అవతలి వ్యక్తి భయమో, బలహీనతో, అజాగ్రత్తో, అవివేకమో... ఏదో ఒకదాన్ని ఆయుధంగా మార్చుకుని చెలరేగిపోతున్నారు. అమ్మాయిలను వల వేసి కొంతమంది.. రెట్టింపు సంపద ఆశచూపి ఇంకొంతమంది.. పోలీసుల పేరు చెప్పి మరికొంతమంది రెచ్చిపోతున్నారు.
వాట్సప్ లో అమ్మాయిలతో ఎరవేసి, ఆ తర్వాత డబ్బులు గుంజి సంపాదించేవారు కొందరైతే... ఆన్ లైన్ బిజినెస్ అని, పెట్టుబడులు పెట్టి డబుల్ ఆదాయం సంపాదించొచ్చని చెప్పి రకరకాలుగా నేరాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా పోలీసుల పేరు చెప్పి భారీ మొత్తంలో ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కు కుచ్చుటోపీ పెట్టారు సైబర్ నేరగాళ్లు.
అవును... ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగిని బెదిరించి, బ్లాక్ మెయిల్ చేసి సైబర్ నేరగాళ్లు భారీగా మోసం చేశారు. ఈ క్రమంలో సదరు ఉద్యోగి పేరిట రూ.13.8 లక్షల లోన్ తీసుకుని కాజేశారు. దీంతో విషయం గ్రహించిన సదరు సాఫ్ట్ వేర్ ఉద్యోగి.. పోలీసులను ఆశ్రయించాడు. తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.
వివరాళ్లోకి వెళ్తే... తిరుపతిలోని విద్యానగర్ కు చెందిన సాఫ్ట్ వేర్ ఉద్యోగి రూప్ కుమార్ కు ఈ నెల 5న దుండగులు సైబర్ క్రైమ్ పోలీసుల పేరుతో ఫోన్ చేశారు. ఈ సందర్భంగా... ఇరాన్ కు వస్తువులు అక్రమంగా సరఫరా చేశావంటూ బెదిరించారు. ఈ క్రమంలో విచారణ నిమిత్తం ముంబై కి రావాలని చెప్పారు.
ఈ సమయంలోనే బ్యాంక్ ఖాతా వివరాలు, ఓటీపీలు తీసుకున్నారు. ఈ క్రమంలోనే రూ.13.8 లక్షల లోన్ తీసుకున్నట్లు రూప్ కుమార్ కు బ్యాంక్ నుంచి ఫోన్ వచ్చింది. దీంతో.. షాకైన సదరు టెక్కీ.. తిరుపతి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో రూరల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఓటీపీలు ఎవరికీ చెప్పొద్దంటూ పోలీసులు సూచిస్తున్నారు.