సైబర్ మోసం... "మీరు ఇంత బాగా రాస్తారని అనుకోలేదు"!
వాస్తవానికి ఇలా సైబర్ నేరగాళ్ల బారిన పడుతున్నవారిలో ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులతో పాటు వ్యాపారు, సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు కూడా ఉండటం గమనార్హం.
నేరాలందు సైబర్ నేరాలు వేరయా అంటారు! ఎవరు చేస్తున్నారో, ఎలా చేస్తున్నారో, ఎంతకు చేస్తున్నరో తెలుసుకునేలోపు బ్యాంక్ బ్యాలెన్స్ మొత్తం ఖాళీ అయిపోతుంటుంది. ఇందులో చాలా రకాలుగా సైబర్ నేరగాళ్లు గాళాలు వేస్తుంటారు. వారి పెట్టుబడెళ్లా బాధితుల నమ్మకం, అవసరమే! ఈ క్రమంలో తాజాగా రివ్యూలు రాస్తే వేల రూపాయలు ఇస్తామంటూ నమ్మించి ఒక హైదరాబాదీని అడ్డంగా దోచేసిన ఒక సంఘటన తాజాగా తెరపైకి వచ్చింది!
అవును... రివ్యూలు రాస్తే వేల రూపాయ్యలు వస్తాయని ఆశచూపించి, కొందరి నుంచి లక్షల రూపాయలు వసూలు చేసిన సైబర్ స్కామర్లకు సంబంధించిన వ్యవహారాలు ఇప్పటికే ఎన్నో వార్తల్లో వచ్చిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ సైబర్ నేరగాళ్ల ప్రయత్నాలు ఆగడం లేదు.. వారి బారినపడుతున్న బాధితుల లెక్కా తగ్గడం లేదు! ఈ క్రమంలోనే తాజాగా ఒక హైదరాబాదీ లక్షల రూపాయలు పోగొట్టుకున్నారు!
వాస్తవానికి ఇలా సైబర్ నేరగాళ్ల బారిన పడుతున్నవారిలో ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులతో పాటు వ్యాపారు, సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు కూడా ఉండటం గమనార్హం. వీరంగా వీలున్న సమయాల్లో అదనపు ఆదాయాన్ని సంపాదించాలనే ఉద్దేశ్యంతోనే పార్ట్ టైం జాబ్స్ కోసం చూస్తుంటారు. ఈ సమయంలో వీరి అవసరాన్ని అవకాశంగా మలుచుకునే సైబర్ స్కామర్లు తొలుత ఆశచూపించి అనంతరం మొత్తం దోచేస్తుంటారు.
ఈ క్రమంలొనే హైదరాబాద్ కి చెందిన ఒక వ్యక్తికి రివ్యూస్ రాసే పార్ట్ టైం జాబ్ అంటూ ఆఫర్ వచ్చిందంట. హోటల్స్ ని ప్రమోట్ చేయడంలో భాగంగా రివ్యూస్ రాస్తే డబ్బులు ఇస్తామని నమ్మబలికారంట. దీంతో వారి మాటలు నమ్మిన సదరు వ్యక్తి డ్యూటీ ఎక్కారంట. ఈ సమయంలో తొలుత పనికి తగ్గట్లుగానే ఎప్పటికప్పుడు డబ్బులు ఇస్తూవచ్చారంట సైబర్ నేరగాళ్లు. దీంతో ఇతడికి వారిపై ఒక నమ్మకం వచ్చేసిందట.
ఈ సమయంలో వారి పెర్ఫార్మెన్స్ స్టార్ట్ అయ్యిందని తెలుస్తుంది. ఇందులో భాగంగా.. మీరు రాస్తున్న రివ్యూలు చాలా బాగుంటున్నాయి.. మీరు ఇంత బాగా రాస్తారని మేము ఆలు అనుకోలేదు.. అందువల్ల మిమ్మల్ని వీఐపీ గ్రూపులో చేర్చాలని అనుకుంటున్నాము.. దీనిలో కాస్త పెట్టుబడి పెడితే చాలు అధికమొత్తంలో సంపాదించవచ్చు.. పైగా ఈ గ్రూపులో పదిమంది మాత్రమే ఉంటారు.. ఆలసించినా ఆశాభంగం.. అన్న రేంజ్ లో మాట్లాడారంట!
దీంతో పెట్టుబడి కొంచెం కొంచెం పెట్టడం మొదలుపెట్టడం కాస్తా మరింత ఆశకు పోవడంతో... బాధితుడిని నమ్మించి సుమారు రూ. 13 లక్షలకు పైగా కాజేశారని తెలుస్తుంది! దీంతో... లబో దిబో మంటున్న బాధితుడు తదుపరి చర్యలపై దృష్టి సారించారని అంటున్నారు!