పచ్చి బూతులతో రెచ్చిపోయిన ఎమ్మెల్యే దానం !

కానీ దానికి భిన్నంగా తెలంగాణా అసెంబ్లీలో సీనియర్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మాత్రం తనదైన శైలిలో పచ్చి బూతులతో రెచ్చిపోయారు.

Update: 2024-08-02 14:57 GMT

పవిత్రమైన అసెంబ్లీ. మాటకు ముందు వెనక గౌరవ అని సంభోదిస్తూంటారు. మరి అ పవిత్రత గౌరవ మర్యాదలు కాపాడాల్సింది సభ్యులే కదా. కానీ దానికి భిన్నంగా తెలంగాణా అసెంబ్లీలో సీనియర్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మాత్రం తనదైన శైలిలో పచ్చి బూతులతో రెచ్చిపోయారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఉద్దేశించి అనుచితమైన కామెంట్స్ చేశారు. నీ అమ్మ అంటూ బూతు పురాణాన్ని అందుకున్నారు. తెలంగాణా అసెంబ్లీలో శుక్రవారం దానం నాగేందర్ ప్రసంగిస్తున్నారు. ఆ సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్ను ఆందోళన చేస్తున్నారు. ముఖ్యంగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అయితే ఎక్కువగా మాట్లాడారు. దాంతో చిరాకెత్తిన దానం నాగేందర్ ఇక లాభం లేదు అనుకున్నారో ఏమో తెలియదు కానీ బూతులనే లంకించుకున్నారు.

ఏయ్ అంటూ సాటి ఎమ్మెల్యేల మీద ఏకవచనంతో దిగిపోయారు. కూసో అంటూనే తోలు తీస్తాను హైదరాబాద్ లో బయట ఎక్కడా తిరగలేవు అంటూ దానం నాగేందర్ సహనం కోల్పోయి రెచ్చిపోయారు. ఏమనుకుంటున్నావ్ రోడ్లమీద మళ్లీ తిరగనివ్వను అంటూ హెచ్చరికలు జారీ చేశారు.

అసెంబ్లీలో దానం నాగేందర్ బూతు పురాణాన్ని చూసిన స్పీకర్ కూడా ఒక దశలో ఆయనను ఆపేందుకు ప్రయత్నించారు. అయినా సరే అమ్మ అన్న పదాలు హైదరాబాద్ లో లోకల్ గా మాట్లాడుకునేవే అని దానం సమర్ధించుకోవడం జరిగింది. అవి ఏ మాత్రం అన్ పార్లమెంటరీ పదాలు కానే కావు అని దానం చెప్పడం ద్వారా తన బూతు పురాణాన్ని తానే కాసుకుని వచ్చారు.

అయితే ఈ విషయంలో రికార్డులు పరిశీలించి అన్ పార్లమెంటరీ పదాలు అయితే తప్పకుండా తొలగిస్తామని స్పీకర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు హామీ ఇచ్చారు. ఇంతలా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద రెచ్చిపోయిన దానం నాగేందర్ గత డిసెంబర్ లో బీఆర్ఎస్ టికెట్ మీదనే ఖైరతాబాద్ నుంచి గెలిచారు. ఆ తరువాత ఆయన కాంగ్రెస్ లోకి ఫిరాయించారు. ఇపుడు టికెట్ దక్కించుకుని గెలిచిన పార్టీ ఎమ్మెల్యేల మీదనే నోరు పారేసుకుంటున్నారు.

అసెంబ్లీ అని చూడకుండా అసభ్య వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు. అయితే దీని మీద బీఅర్ఎస్ నేత హరీష్ రావు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఆయన మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ ఏమిటి ఈ భాష అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీకి ఇది చీకటి రోజు అని ఆయన అభివర్ణించారు. హైదరాబాద్ రోడ్ల మీద తిరగనివ్వను అంటున్నావ్ నీ అయ్య జాగీరా హైదరాబాద్ అని దానం నాగేందర్ ని ఉద్దేశించి ప్రశ్నించారు

మొత్తం మీద చూస్తే తెలంగాణా అసెంబ్లీలో బూతు పురాణం మాత్రం ఏ మాత్రం సభ హుందాతనానికి సరిగ్గా లేదని అంతా అంటున్నారు. పైగా ఒక పార్టీ నుంచి గెలిచి అధికార పార్టీలోకి దూకిన దానం నాగేందర్ వంటి వారు సాటి పార్టీ సభ్యుడినే ఎక్కడా తిరగనివ్వను అని అనడమేంటి అన్న చర్చ కూడా సాగుతోంది.

ఈ విధంగా అయితే కాంగ్రెస్ పార్టీకి జనంలో కూడా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తందని అంటున్నారు. సభలో ఏమి జరుగుతుందో జనాలు అన్నీ జాగ్రత్తగా గమనిస్తారు అని అంటున్నారు. ఏపీ అసెంబ్లీలో గతంలో వైసీపీ హయాంలో కొంతమంది అధికార సభ్యులు చేసిన అతి వల్లనే ఆ పార్టీ చేదు ఫలితాలు అందుకున్న సంగతిని గమనించాలని కూడా కోరుతున్నారు.

Tags:    

Similar News