హామీలిచ్చాడు.. తెలంగాణలో ఓట్లు రాకముందే సర్పంచ్ అయ్యాడు

వరంగల్ జిల్లా చెరువుకొమ్ముతండా సర్పంచ్‌గా దరావత్ బాలాజీని అక్కడి ప్రజలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

Update: 2024-09-10 11:30 GMT

తెలంగాణ రాష్ట్రంలో ఇంకా స్థానిక సంస్థల ఎన్నికల జాతర మొదలు కానేలేదు. కానీ.. అప్పుడే ఓ వ్యక్తి ఏకగ్రీవంగా సర్పంచుగా ఎన్నికయ్యాడు. అదేంటి.. ఎన్నికల కాకముందే.. ఎన్నికల షెడ్యూల్ రాకముందే సర్పంచ్ కావడం ఏంటా అని ఆలోచిస్తున్నారా..! అవును అదే నిజం.

 

తెలంగాణ గ్రామ పంచాయతీల్లో ప్రస్తుతం ప్రత్యేక అధికారుల పాలన నడుస్తోంది. జనవరితో 31తో గ్రామాల్లో పాలకవర్గాల పదవీ కాలం ముగిసింది. దాంతో గ్రామాల్లో అభివృద్ధి పర్యవేక్షణ అంతా ప్రత్యేక అధికారులే చూస్తున్నారు. సర్పంచులు పదవుల నుంచి తప్పుకొని ఎనిమిది నెలలు అవుతోంది. అయితే.. ఇంతవరకు స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించలేదు.

కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు స్థానిక సంస్థల ఎన్నికలపై ఓ హామీనిచ్చింది. బీసీ కులగణన చేపట్టిన తర్వాతే లోకల్ ఎలక్షన్లు నిర్వహిస్తామని ప్రకటించింది. దాంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు కూడా బీసీ కులగణన పూర్తయిన తరువాతనే ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రులు చెబుతున్నారు.

దాంతో ఇంకా రాష్ట్రంలోని పంచాయతీలకు ఎలాంటి ఎన్నికల షెడ్యూల్ వెలువడలేదు. కేవలం రాష్ట్ర ఎన్నికల సంఘం మాత్రమే ముసాయిదా ఓటరు జాబితాను సిద్ధం చేస్తోంది. ఇంకా పంచాయతీలకు నోటిఫికేషన్ ఇచ్చి.. షెడ్యూల్ ద్వారా ఎన్నికల తేదీలను ప్రకటించనున్నారు.

ఇంతలోనే వరంగల్ జిల్లాలో ఓ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. పంచాయతీ ఎన్నికల ప్రాసెస్ రాకముందే ఓ వ్యక్తి సర్పంచుగా ఎన్నికయ్యాడు. వరంగల్ జిల్లా చెరువుకొమ్ముతండా సర్పంచ్‌గా దరావత్ బాలాజీని అక్కడి ప్రజలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బాలాజీ ఇచ్చిన హామీలతో గ్రామస్తులు ఈ నిర్ణయం తీసుకున్నారట. ఇంతకీ ఆయన ఇచ్చిన హామీలు ఏంటంటే.. గ్రామంలో 3 గుళ్లు కటిస్తానని చెప్పారు. అలాగే.. బొడ్రాయి పండుగకు ఇంటికి రూ.వెయ్యి చొప్పున పంచుతానని హామీ ఇచ్చాడు. అందుకు సర్పంచ్ ఎన్నికల్లో ఎవరూ పోటీ చేయవద్దని షరతు విధించాడు. ఈ మేరకు గ్రామస్తులతో ఓ అగ్రిమెంట్ సైతం రాయించుకున్నాడు. అంతేకాదు.. సర్పంచుగా ఏకగ్రీవం చేస్తూ గ్రామస్తులు విజయోత్సవ ర్యాలీ తీశారు.

Tags:    

Similar News